రిస్క్‌ లేకుంటే రాబడి లేదు! | Balanced Wealth Strategy For 2026, FDs Lost Their Shine Even Gold Silver Volatile Best Investment Plan, Read Story Inside | Sakshi
Sakshi News home page

రిస్క్‌ లేకుంటే రాబడి లేదు!

Feb 9 2026 8:17 AM | Updated on Feb 9 2026 9:51 AM

FDs lost their shine even gold silver volatile best investment plan

ఈ ఏడాది ఆరంభం నుంచే పెట్టుబడుల్లో తీవ్ర ఒడిదుడుకులు

ఎఫ్‌డీలపై తగ్గుతున్న వడ్డీలు.. మరింత తగ్గనున్న రాబడులు

ఈక్విటీలు, మెటల్స్‌లో పెరిగిన ఊగిసలాట; దీంతో ఆందోళన

డైవర్సిఫికేషన్‌ ఉంటేనే కాస్త మెరుగైన రాబడి సాధించే వీలు

ఈ ఏడాది ఏ ఒక్కదానికో పరిమితం కావద్దు: నిపుణులు  

క్యాలెండర్‌ మారి నెల దాటిపోయింది. ఫిబ్రవరి కూడా గడిచిపోతోంది. ఈక్విటీలు స్థిరంగా లేవు. ఇండెక్స్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు దగ్గర్లో కనిపిస్తున్నా.. 80–90 శాతం షేర్లు కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఎఫ్‌డీలను చూస్తే వడ్డీలు తగ్గి రాబడుల్లేవు. సురక్షితమని బంగారం, వెండి వంటి లోహాలవైపు వెళితే... వాటి ఎగుడుదిగుళ్లకి ఊపిరాడని పరిస్థితి. మొత్తంగా ఇప్పటివరకూ 2026 చెబుతున్నదొక్కటే. రిస్క్‌ తీసుకోకుంటే రాబడుల్లేవు. అలాగని రిస్క్‌ తీసుకున్నా నిద్ర లేదు. మరేం చేద్దాం? 
ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన దారేది? కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాలేంటి? వీటి విశ్లేషణే ఈ వారం ‘వెల్త్‌ ప్లస్‌’ స్టోరీ...

కొందరిది రిస్క్‌కు దూరంగా ఉండే ధోరణి. కొందరిదైతే దూకుడుగా రిస్క్‌ గురించి ఆలోచించకుండా ముందుకెళ్లే ధోరణి. వాస్తవానికి ఇలాంటి ఏకపక్ష విధానాలు ఎప్పుడో తప్ప కలిసిరావు. ఈ సంవత్సరం ఇలాంటి విధానాలు అస్సలు కలిసొచ్చేలా లేవు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌ తమ పెట్టుబడుల సామర్థ్యం, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య కేటాయింపులు సమతుల్యం చేసుకోవాలి. ‘బ్యాలన్స్‌’గా నడుచుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గతేడాది కూడా (2025–26లో) సంప్రదాయ ఎఫ్‌డీలు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లూ పెరిగాయి. జీడీపీలో ఆర్థిక పొదుపులు 47 ఏళ్ల కనిష్టానికి చేరాయి. జీవన వ్యయాలేమో పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకిది పెద్ద సవాలే. కాబట్టి ఏం చేయాలంటే...

వేటి ప్రాధాన్యం వాటిదే..

  • మనం ఆహారంలో భాగంగా బియ్యం/గోధుమలకే పరిమితం కాలేం. కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం ఇలా అన్నింటినీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కోదానిలో ఉండే పోషకాలు వేరు. సమతుల్య ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది.  

  • పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తమ నికర ఆర్జన ఎంత? అందులో ఖర్చులు ఎంత? మిగిలేది ఎంత? భవిష్యత్‌ లక్ష్యాలు ఏవి? వాటికి ఎంత మొత్తం సమకూరాలి? ఇందుకోసం ఎంత రాబడి అవసరం? ఈ అంశాల ఆధారంగా ఎఫ్‌డీలు/డెట్‌ ఫండ్స్‌–ఈక్విటీలు–పసిడి/వెండి ఇలా వివిధ సాధనాలకు కేటాయింపులు చేసుకోవాలి. దీన్నే అసెట్‌ అలోకేషన్‌ అని కూడా అంటుంటారు.  

  • ఏదో ఒక సాధనం కాకుండా, స్వల్పకాల అవసరాల కోసం డెట్, మధ్య కాల అవసరాలకు డెట్‌–ఈక్విటీ, దీర్ఘకాల అవసరాలకు ఈక్విటీ, బంగారం సాధనాలకు కేటాయింపులు ప్లాన్‌ చేసుకోవాలి. దీని వల్ల వైవిధ్యం ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఉన్న సమయంలో మరో విభాగంలోని పెట్టుబడులు మంచి పనితీరుతో ప్రయోజనం పొందొచ్చు.  

వేటికి ఎంత..? 

  • సంపాదనలో 35 శాతం అయినా (మూడింట ఒక వంతు) ఆదా చేయాలి.  

  • ఆదా చేసిన మొత్తంలో 30–35 శాతాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు, లేదా లిక్విడ్, మనీ మార్కెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.

  • కనీసం 50–60 శాతాన్ని ఈక్విటీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.  

  • బంగారం, వెండిలో 10–15 శాతం మించకుండా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.  

  • ఈక్విటీ, బంగారం, వెండిపై పెట్టుబడులకు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) మంచి సాధనం.  

రక్షణ–రాబడులు

  • ఎఫ్‌డీలు, డెట్‌ ఫండ్స్‌తో సంపద సృష్టి సాధ్యం కాదు. కానీ, పెట్టుబడికి రక్షణ ఉంటుంది. స్వల్పకాలంలో పెట్టుబడి  కాపాడుకోవడమే ముఖ్యం.

  • ఈక్విటీలతో సంపద సృష్టి సాధ్యం. అది దీర్ఘకాలంలో, క్రమశిక్షణతో నడుచుకున్నప్పుడే.

  • కమోడిటీలు మిగిలిన పెట్టుబడులకు హెడ్జింగ్‌గా పనిచేస్తాయి. అదే సమయంలో మెరుగైన రాబడికీ మార్గం చూపుతాయి.  

ప్రీమియం లోహాలు..

బంగారం, వెండి ర్యాలీ ఏ స్థాయిలో ఉంటుందో గత కొన్నేళ్ల అనుభవాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అయితే పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. దీన్ని చూసి ఇన్వెస్టర్లు పసిడి, వెండిలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. కాకపోతే ఈ ఏడాది ఊగిసలాట మామూలుగా లేదు. తాజాగా వెండి గరిష్ఠానికి చేరటం... భారీగా పతనమవటం అంతా నెలలో జరిగిపోయింది. మిగిలిన పెట్టుబడి సాధనాల నుంచి వైదొలిగి మొత్తం వీటిలోనే కుమ్మరించిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నది వీటికీ వర్తిస్తుంది.  

  • బంగారం, పసిడి ఏటా స్థిరంగా రాబడినిస్తాయన్న భరోసా లేదు. ఇవి ఒక సైకిల్‌ ప్రకారం చలిస్తుంటాయి. కొన్నేళ్ల పాటు అతి తక్కువ రాబడి, స్థిరీకరణ తర్వాత కొద్ది కాలంలోనే ఎక్కువ ర్యాలీ చేయడం వీటి స్వభావం.  

  • కనుక ఏటా స్థిరంగా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లడమే మెరుగైన విధానం.

  • స్టాక్స్‌లో మాదిరి వీటిపై డివిడెండ్, బోనస్‌లు వంటివేవీ ఉండవు.

  • బంగారం కంటే వెండిలో ఆటుపోట్లు ఎంతో ఎక్కువ.  

  • ఆర్థిక వ్యవస్థలు గొప్పగా పనిచేస్తున్న కాలంలో ఇవి దీర్ఘకాలం పాటు ర్యాలీకి దూరంగా ఉంటాయి.  

  • ఇన్వెస్టర్ల హెడ్జింగ్‌ కోసం, సెంట్రల్‌ బ్యాంకుల మారకం నిల్వల స్థిరత్వానికి పసిడికి డిమాండ్‌ ఎక్కువ. పారిశ్రామిక వినియోగం, ఇన్వెస్టర్ల పెట్టుబడిగానూ వెండికి డిమాండ్‌ పెరుగుతోంది.

  • కానీ, ఇప్పటి వరకు చరిత్ర చూస్తే 1950 నుంచి ఇప్పటి వరకు పసిడి, వెండిపై రాబడి 10–11 శాతం (వార్షికంగా) చొప్పున ఉంది.

  • పసిడి, వెండిపై పెట్టుబడులకు చార్జీలు, లిక్విడిటీ పరంగా ఈటీఎఫ్‌లు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలే మెరుగైనవి.  

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు భద్రమే కానీ..

  • ఎఫ్‌డీలపై 6.5–7 శాతం రాబడి పేపర్‌పై కనిపించేంత వరకే. మన దగ్గర ద్రవ్యోల్బణం సగటున 5–6 శాతం మధ్య ఉంటోంది. అంటే ఎఫ్‌డీ ఇచ్చిన రాబడిని ద్రవ్యోల్బణమే తినేస్తున్నట్లు లెక్క. ఇక ఇన్వెస్టర్‌కు మిగిలేది ఏముంటుంది?  

  • కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోతోందన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.  

  • ఒకవేళ 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉంటే ఎఫ్‌డీఐపై వచ్చే 6–7 శాతం రాబడిపై కూడా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు అసలు రాబడి రాకపోగా... పన్ను అనంతరం స్వల్పంగా నష్టపోవాల్సి వస్తుంది.  

  • దీనివల్ల కాలానుగుణంగా ఆ డిపాజిట్‌కు ఉన్న విలువ తగ్గిపోతుందని గమనించాలి.  

  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అన్నది ఎంతో సులభమైన పెట్టుబడి సాధనం. కాల వ్యవధి తీరే నాటికి ఎంత వస్తుందన్నది ముందుగానే తెలిసిపోతుంది. పైగా ఇంటి సమీపంలోని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసుకుని, కావాల్సినప్పుడు అదే రోజు వెనక్కి తీసుకోగల సౌలభ్యం ఉంటుంది.  

  • ఎఫ్‌డీలో పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఒక డిపాజిటర్‌కు ఒక బ్యాంక్‌ పరిధిలో రూ.5 లక్షల వరకు బీమా 
    ఉంటుంది కనుక నిశ్చింత ఎక్కువ.  

  • కానీ, భద్రత కోసమని, సౌకర్యం ఉందని చెప్పి నికరంగా రూపాయి కూడా రాబడి లేని (ఎఫ్‌డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం తీసేయగా) సాధనంలో ఉన్నదంతా పెట్టేస్తే ముఖ్యమైన లక్ష్యాలను సాధించడమెలా అన్నది ఆలోచించాలి.  

  • పైగా ఆర్‌బీఐ ఇటీవలి కాలంలో 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించేసింది. భవిష్యత్తులోనూ తగ్గించొచ్చు. అలాంటప్పుడు ఎఫ్‌డీఐలపై రాబడి మరింత తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి.  

  • కాలానుగుణంగా మన పెట్టుబడి విలువ కూడా పెరగాలి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా విద్య, వైద్యం, గృహ అద్దె, నిత్యాసవరాల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈ స్థాయిలో లేదంటే ఇంతకుమించి పెట్టుబడిని వృద్ధి చేసుకోవాల్సిందే. ఇక్కడే ఈక్విటీల పాత్ర కీలకం అవుతుంది.  

ఈక్విటీలు మెరుగే కానీ..

  • ఈక్విటీలు ఇతర సంప్రదాయ సాధనాలకు మించి రాబడులను ఇస్తాయన్నది చారిత్రక వాస్తవం. కానీ, అది దీర్ఘకాలంలోనే సాధ్యం. పదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లో రాబడి 12– 15 శాతం మధ్య ఉంది. స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో అయితే ఈ రాబడి 30 శాతం వరకు ఉంది.  

  • స్వల్పకాలానికి ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు, కరెన్సీ విలువలు, దేశాల రుణ భారాలు, వడ్డీ రేట్లు, వాతావరణ మార్పులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈక్విటీలు కదులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూలతలను జీర్ణం చేసుకుంటూ మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన పనితీరు చూపిస్తుంటాయి.

  • క్రమశిక్షణ, అనుభవం కలిగిన ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీల పతనాలను చూసి ఆందోళన చెందుతుంటారు. ప్రతి ర్యాలీ తర్వాత దిద్దుబాటు కచ్చితంగా ఉంటుందన్నది వాస్తవం.

  • దీంతో ఈక్విటీ పెట్టుబడులపై నిశ్చింత, ప్రశాంతత అన్నది అన్ని సందర్భాల్లో ఉండదు.  

  • ముఖ్యంగా మధ్యతరగతి ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తక్షణ రాబడుల కోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో), ఇంట్రాడే ట్రేడింగ్‌ వైపు అడుగులు వేస్తుంటారు. సరైన పరిశోధన, ఆయా సాధనాల పనితీరు, రిస్క్‌లు ఇవన్నీ తెలుసుకోకపోవడం ఫలితంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది.  

  • ఎఫ్‌డీల మాదిరి (రూ.5లక్షలు) ఈక్విటీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. స్వల్పకాలంలో పెట్టుబడి విలువ కూడా తగ్గిపోవచ్చన్నది గుర్తు పెట్టుకోవాలి.  

  • ఒక్కోసారి మెరుగైన రాబడుల కోసం మార్కెట్‌ సైకిల్‌ మారే వరకూ వేచి చూడాల్సి రావచ్చు.  

  • ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులతో కంపెనీలు జారీ చేసే డివిడెండ్‌ సైతం తిరిగి పెట్టుబడిగా మారుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌తో రాబడి మరింత ఇతోధికం అవుతుంది.  

  • లిక్విడిటీ ఎక్కువ. సులభంగా క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు.  

  • ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు ఈక్విటీ పెట్టుబడులు బలంగా పనిచేస్తాయి. దీంతో కొనుగోలు శక్తి తగ్గదు.

ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement