బినామీ ఆస్తి అంటే ఏమిటి.? బినామీ వ్యవహారం ఏమిటి.? బినామీదారు ఎవరు? ప్రయోజనం పొందేవారెవరు? మొదలైన విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యవహారాలు చేయడం వల్ల కలిగే కష్టనష్టాలు ఈ వారం తెలుసుకుందాం.!
ఆస్తి జప్తు: బినామీ ఆస్తి అని నిర్ధారణ జరిగితే ఆ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లేదా జప్తు చేసుకుంటుంది.
శిక్షార్హులు: బినామీదారు, ప్రయోజనం పొందే వ్యక్తి (ముసుగు మనిషి), ఈ వ్యవహారాన్ని ప్రేరేపించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తి, ఈ ముగ్గురూ చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆరోపణలు నిరూపణ అయితే ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష (కఠినకారాగార శిక్ష) ఉంటుంది. ఇది కాకుండా, బినామీ ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువ మీద 25% జరిమానాగా విధిస్తారు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే కొన్ని షరతులకు లోబడి జరిమానాను సడలిస్తారు. బినామీదారు బినామీ ఆస్తిని తిరిగి ‘ప్రయోజకుడు’ లేదా ఏ ఇతర వ్యక్తికి కూడా బదిలీ చేయకూడదు. ఇలాంటి బదిలీలు చెల్లవు. అలాంటి అమ్మకం జరిగినప్పుడు కొన్న వ్యక్తికి ఎటువంటి విషయం తెలియకపోతే.. నిజమని నమ్మించి అమ్మితే, కొన్న వ్యక్తి నుంచి ఆస్తి తీసుకోరు.
అధికారుల అధికారాలు
ఈ చట్టప్రకారం నాలుగు రకాల అధికారులు ఉన్నారు. వారి అధికారాలు ఏమిటంటే...
(1) సమన్లు జారీ చేయడం (2) సమాచారం కోరడం (3) డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం (4) విచారణ చేయడం (5). విచారణలో సహకారం కోసం ఇతర అధికారులను కోరడం.
ఇంకా ఏం చేస్తారు
నోటీసులు ఇస్తారు. విచారిస్తారు. తీర్పు ఇస్తారు. తీర్పు అనుగుణంగా ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు.
ఆద్యులెవరు ..
ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికి ముందు.. ఆద్యులు ఎవరంటే ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటు వారు. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని, బినామీ చట్టంలోని అధికారులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఈ తరువాత పద్దతి ప్రకారం పని ముగిస్తారు.
నోటీసు ప్రక్రియ..
నోటీసు ఇవ్వడానికి ప్రక్రియ మారితే.. వ్యక్తిగత పోస్టు ద్వారా లేదా సివిల్ కోడ్ ప్రకారం నోటీసు ద్వారా విచారణ, ప్రశ్నలు, ఇన్వెస్టిగేషన్, సోదాలు, కాగితాల సేకరణ, పత్రాలు అడగడం, ఆ తరువాత తీర్పు ఇవ్వడం, ఎటాచ్‌మెంట్ చేయడం, స్వాధీనపరచుకోవడంలాంటివి జరుగుతాయి. ఆ తరువాత బినామీ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఎంక్వైరీ మధ్యలో బినామీదారు/ముసుగు మనిషి మరణిస్తే వారి వారసులకు కేసు బదిలీ చేస్తారు. కోర్టు పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలోనైనా తప్పుడు సమాచారం ఇచ్చినా., తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినా కఠిన కారాగార శిక్ష, జరిమానాలు పడతాయి.
ఈ రెండు చట్టాలు–చుట్టాలు ..
అటు అదాయపన్ను చట్టం, ఇటు బినామీ వ్యవహారంలో నిషేధిత చట్టం రెండూ కలిసి పనిచేస్తాయి. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వస్తుంది. ఇన్‌కంటాక్స్ అధికారులనే సూత్రధారులుగా .. ప్రారంభించే అధికారిని INITIATING OFFICERS గా వ్యవహరించమంటారు. వారే అన్ని తయారు చేస్తారు. డిపార్టుమెంటు వారు ఈ చట్టం ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు రాబట్టుకుంటారు. వారి చట్టం ప్రకారం పెనాల్టీలు.. ఆదాయం మీద పన్ను వేసి... మిగతా కార్యక్రమం పూర్తి చేసి బినామీ నిషేధ చట్టం అధికారులకు అప్పగిస్తారు. ఈ అధికార్లు ఆస్తిని జప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. డిక్లేర్ చేయని ఆస్తులు.. డిక్లేర్ చేయని ఆదాయ వివరాలు తెలుసుకొని వాటిని అసెస్సీ పన్ను పరిధిలోకి తెచ్చి.. అసెస్‌మెంట్ చేసి... పన్ను, వడ్డీ, పెనాల్టీలు వసూలు చేసి బినామీ చట్టం అధికార్లకు అప్పగిస్తారు.
ఇప్పుడు అర్థమైందా... బినామీ వ్యవహారాల వెనుకు ఎంత రిస్క్ ఉందో... దగ్గర బంధువులు, వ్యాపారం చేస్తున్న మిత్రులు, బంధువులు, మీరు చిన్న ఉద్యోగి అయితే మీ బాస్‌లు, యజమానులు, అల్లుడు, బావ, వియ్యంకుడు ఇలా అభిమానం అడ్డుపెట్టి, డబ్బులు ఎరచూపి, వారి కష్టాలని మీ దగ్గర వెలిబుచ్చి ట్రాప్ చేస్తారు. వారి వలలో పడకండి!


