ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్‌... జాగ్రత్తలు | House Rent Allowance Claims Precautions New Rules Costly Mistakes to Avoid | Sakshi
Sakshi News home page

ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్‌... జాగ్రత్తలు

Mar 2 2026 12:06 PM | Updated on Mar 2 2026 12:47 PM

House Rent Allowance Claims Precautions New Rules Costly Mistakes to Avoid

ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్‌ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్‌మిట్‌ చేసి నాటకం ఆడుతున్నారు.  

ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్‌ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్‌మిట్‌ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్‌ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్‌లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్‌ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు.  

బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్‌మెంట్‌ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్‌ ప్రకారం ఇక నుంచి .. అంటే  ఏప్రిల్‌1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్‌ పేరు, అడ్రస్, పాన్‌.. మీకు ఓనర్‌కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్‌ ఆదాయాన్ని ట్రాక్‌ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్‌ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్‌ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్‌ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.

అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్‌ చేత రిటర్ను వేయించండి.

Advertisement
 
Advertisement
Advertisement