దేశీయ ఈ-కామర్స్ మార్కెట్‌లో పట్టు పెంచుకునేందుకు అమెజాన్ ఇండియా భారీ మార్పులు చేస్తోంది. చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.1,000 లోపు ధర కలిగిన ఉత్పత్తులపై అమ్మకందారుల నుంచి వసూలు చేసే రిఫరల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
ఏమిటీ రిఫరల్ ఫీజు?
అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో వస్తువులను విక్రయించినందుకు గానూ ప్రతి అమ్మకంపై సెల్లర్ నుంచి కంపెనీ కొంత శాతం కమీషన్‌ను వసూలు చేస్తుంది. దీనినే రిఫరల్ ఫీజు అంటారు. సాధారణంగా ఇది ఉత్పత్తి కేటగిరీని బట్టి 2% నుంచి 16.5% వరకు ఉంటుంది. తాజా నిర్ణయంతో దాదాపు 1,800 కేటగిరీల్లో రూ.300 నుంచి రూ.1,000 మధ్య ధర ఉన్న ఉత్పత్తులకు ఈ కమీషన్ భారం ఉండదు.
కీలక మార్పులు ఇవే..
గతంలో (ఏప్రిల్ 2025) కేవలం రూ.300 లోపు వస్తువులకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు రూ.1,000 వరకు విస్తరించారు. దీనివల్ల లబ్ధి పొందే ఉత్పత్తుల సంఖ్య 1.2 కోట్ల నుంచి ఏకంగా 12.5 కోట్లకు పెరగనుంది. దాంతోపాటు రూ.300 కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల విక్రేతలకు షిప్పింగ్ ఫీజులో 20% రాయితీ ప్రకటించింది. అమ్మకందారులు తమ వద్దే స్టాక్ ఉంచుకుని కేవలం డెలివరీ బాధ్యతను అమెజాన్‌కు అప్పగించే ‘ఈజీ షిప్’ పద్ధతిలో కూడా ఈ 20% ఫీజు తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది.
‘ఈ నిర్ణయం వల్ల విక్రేతలకు అమ్మకం ఖర్చులో దాదాపు 70% వరకు ఆదా అవుతుంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న వ్యాపారవేత్తలకు అమెజాన్ ప్లాట్‌ఫారమ్ మరింత లాభదాయకంగా మారుతుంది’ అని అమిత్ నందా, డైరెక్టర్, అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్ట్నర్ సర్వీసెస్ అన్నారు.
తీవ్రమవుతున్న ఈ-కామర్స్ పోటీ..
మీషో 2022లోనే జీరో కమీషన్ మోడల్‌ను ప్రవేశపెట్టి చిన్న వ్యాపారులను భారీగా ఆకర్షించింది. ఫ్లిప్ కార్ట్ గతేడాది నవంబర్‌లో రూ.1,000 లోపు ఉత్పత్తులపై కమీషన్ రద్దు చేయడమే కాకుండా, తన ‘షాప్సీ’ ప్లాట్‌ఫారమ్‌లో పూర్తిగా జీరో కమీషన్ అమలు చేస్తోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని విక్రేతలను తమ ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావడమే ఈ సంస్థల ప్రధాన లక్ష్యం. అమ్మకందారులపై భారం తగ్గడం వల్ల వినియోగదారులకు కూడా తక్కువ ధరకే వస్తువులు అందే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!


