2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు! | AI Double Edged Sword Harsh Goenka Warns of Job Losses by 2028-2033 | Sakshi
Sakshi News home page

2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!

Mar 2 2026 8:32 AM | Updated on Mar 2 2026 8:42 AM

AI Double Edged Sword Harsh Goenka Warns of Job Losses by 2028-2033

ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సాంకేతిక విప్లవంలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తోంది. అది కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వరంగా మారితే ఇంకొ​ందరికి శాపంగా మారుతోంది. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార్పొరేట్, సామాన్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2028 నుంచి 2033 మధ్య కాలంలో కృత్రిమ మేధ ఏయే వృత్తులను కబళించబోతుందో ఆయన విశ్లేషించిన తీరు, ఉపాధి భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. గోయెంకా అంచనా ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి.

తొలి దశ: 2028 - 2029 (సాంకేతిక, సేవా రంగాల్లో మార్పులు)

ఈ రెండేళ్ల కాలంలో ఏఐ కేవలం ఉద్యోగులకు సహాయకారిగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని గోయెంకా పేర్కొన్నారు. అందులో..

సాఫ్ట్‌వేర్ కోడర్లు (2028): ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల బృందాలు చేసే పనిని ఏఐ స్వతంత్రంగా చేయనుంది. కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను ఏఐ స్వతంత్రంగా నిర్వహించడంతో డెవలపర్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది.

డ్రైవింగ్, లాజిస్టిక్స్ (2029): సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల ఉపాధికి గండం పొంచి ఉంది.

బోధన రంగం (2029): క్లాస్‌రూమ్ బోధన స్థానంలో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్ వస్తారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 24/7 అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు సంప్రదాయ ఉపాధ్యాయ వృత్తికి సవాలుగా మారుతాయి.

రెండో దశ: 2030 - 2032 (వృత్తి నిపుణులపై ప్రభావం)

వైద్యులు, రోగ నిర్ధారణ (2030): రోగ నిర్ధారణ విషయంలో ఏఐ మానవ వైద్యుల కంటే వేగంగా, కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మెడికల్ ఇమేజింగ్, హిస్టరీ అనాలిసిస్ వంటివి పూర్తిగా ఏఐ మయం అవుతాయి.

కళాకారులు, సృజనాత్మకత (2030): సంగీతం, పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి రంగాల్లో ఏఐ సృష్టించే కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సృజనాత్మకత అనేది కేవలం మానవుల సొత్తు అనే భావన చెరిగిపోనుంది.

న్యాయవాదులు (2031): లీగల్ రీసెర్చ్, ఒప్పంద పత్రాల తయారీ వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల జూనియర్ న్యాయవాదుల డిమాండ్ పడిపోతుంది.

మాన్యుఫాక్చరింగ్ (2031): ఫ్యాక్టరీలు పూర్తిస్థాయి ఆటోమేషన్‌కు చేరుకుంటాయి. విశ్రాంతి అవసరం లేని రోబోలు ఉత్పత్తి రంగంలో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేస్తాయి.

సర్జన్లు (2032): శస్త్రచికిత్సల్లో రోబోటిక్ కచ్చితత్వం పెరుగుతుంది. సర్జన్ల పాత్ర కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావచ్చు.

2033 (రక్షణ రంగం)

గోయెంకా అంచనాల ప్రకారం 2033 నాటికి యుద్ధ తంత్రం కూడా మారిపోతుంది. మానవ సైనికుల కంటే ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధ వ్యవస్థలు నిఘా, వ్యూహాత్మక దాడులను నిర్వహిస్తాయి. ఇది అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలను మార్చేయనుంది.

Harsh Goenka drops AI bombshell: 9 jobs AI may erase by 2033

భవిష్యత్తు మంత్రం

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మార్పును ఆహ్వానిస్తూ ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవడం నేర్చుకోవాలి. యంత్రాలు చేయలేని సృజనాత్మక, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాణించాలి. ఉద్యోగాలు పోతాయనే భయం కంటే ఏఐ సృష్టించే కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేదే నేటి యువత ముందున్న అసలు సవాలు.

ఇదీ చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్‌కు కారణం ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement