హెల్త్‌కు సూపర్‌ టాపప్‌! | Difference between Top-up and Super Top-up Health Plans | Sakshi
Sakshi News home page

హెల్త్‌కు సూపర్‌ టాపప్‌!

Mar 2 2026 6:33 AM | Updated on Mar 2 2026 7:56 AM

Difference between Top-up and Super Top-up Health Plans

ఆరోగ్య బీమా కవరేజీ తగినంత తప్పనిసరి

వేగంగా పెరుగుతున్న ఆసుపత్రుల ఖర్చులు

రూ.5 లక్షలు, 10 లక్షలు కూడా సరిపోని పరిస్థితి

అధిక కవరేజీ కావాలనుకుంటే ప్రీమియం మోపెడు

దీనికి సమాధానమే టాపప్‌.. సూపర్‌ టాపప్‌లు

ఫ్యామిలీ పాలసీలకు సూపర్‌ టాపప్‌ తప్పనిసరి

తక్కువ ప్రీమియానికే భారీ కవరేజీ పొందే అవకాశం టాపప్‌

సూపర్‌ టాపప్‌తో అదనపు రక్షణ.. ప్రీమియం కూడా చౌక

గణనీయంగా పెరగనున్న సమ్‌ అష్యూర్డ్‌  

పదేళ్ల కిందట హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంటే... లక్ష రూపాయలు చాలు. ఆ మాత్రం కవరేజీ ఉంటే హ్యాపీ. ఇక రెండు లక్షలంటే లగ్జరీకిందే లెక్క. మరిప్పుడు? చాలామంది తమకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు కవరేజీ ఉన్నా సరే ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. 

ఏ పరీక్షల్లో ఏం బయటపడుతుందో తెలియదు. దానికి ఎన్ని లక్షలవుతుందో తెలియదు. ఎందుకంటే జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దానికి తగ్గట్లే అత్యాధునిక హంగులతో కార్పొరేట్‌ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. ఖర్చు ఏటా 14% చొప్పున పెరుగుతోందన్నది ఒక అంచనా. మరిప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే టాపప్‌. ఆ వివరాలే ఈ ‘వెల్త్‌ స్టోరీ’

అవసరానికి పనికిరాకుంటే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంత బీమా కవరేజీ ఉన్నదనేది ఇప్పుడు ప్రధానం కాదు. అది ఎంతవరకూ అవసరానికి పనికొస్తుందన్నదే ప్రధానం. చాలామందికి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల కవరేజీ ఉంటోంది. చాలా సందర్భాల్లో అది సరిపోతుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగితేనో, కేన్సర్‌ వంటి మహమ్మారి చికిత్సలు అవసరమైతేనో అది ఎంతమాత్రం చాలదు. 

ఎందుకంటే కేన్సర్‌ చికిత్సకు దాని స్టేజ్‌ను బట్టి ఆరంభంలో రూ.15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంటుంది. ఇక వైద్యం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఉండటంతో చికిత్సల వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 14 శాతంగా ఉంటున్న వైద్య ద్రవ్యోల్బణం మనకు తెలియకుండానే.. మన బీమా రక్షణ కవరేజీ సామర్థ్యాన్ని తినేస్తోంది. గతంలో రూ.3000 ఉన్న ఆసుపత్రి రూమ్‌ చార్జీ ఇపుడు రూ.6వేలు దాటిపోయింది. ఇపుడు తీసుకున్న రూ.5 లక్షల బీమా ఐదేళ్ల తర్వాత రూ.2.5 లక్షలకు సమానం. కనుక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య బీమానూ సమీక్షించుకోవాలి.  
         
ప్రీమియం భారం..? 
వైద్య చికిత్సల వ్యయాలు, క్లెయిమ్‌లకు అనుగుణంగా బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో కరోనా తర్వాతి కాలంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు 50 శాతానికి పైనే పెరిగాయి. అధిక ఆయుర్దాయం, పెరిగిపోతున్న వ్యాధులు, కరోనా విపత్తు అనంతరం ఆరోగ్య సమస్యలతో కంపెనీలపై క్లెయిమ్‌ల భారం పడడం ఈ పరిస్థితికి కారణం. ఇక వయసును బట్టి ప్రీమియంల పెంపు సహజంగానే చూస్తుంటాం. 35– 40, 45–50, 60 తర్వాత ప్రీమియం ఎంతలేదన్నా 20 శాతం మేర పెరుగుతుంటుంది. కనుక చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు భారీ ప్రీమియంతో ప్రాథమిక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ (బేసిక్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌) తీసుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో తక్కువ ప్రీమియానికి అదనపు రక్షణనిచ్చే టాపప్, సూపర్‌ టాపప్‌ ప్లాన్ల గురించి, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయన్నది తప్పకుండా తెలుసుకోవాలి.  
             
టాపప్‌ ప్లాన్లు.. 
పరిమిత ప్రీమియానికి అదనపు ఆరోగ్య బీమా రక్షణను టాపప్, సూపర్‌ టాపప్‌లు అందిస్తుంటాయి. బేస్‌ పాలసీ కవరేజీని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువుంటుంది. కానీ రూ.15 లక్షల సూపర్‌ టాపప్‌ ప్రీమియం చాలా తక్కువ. ఇవి బేస్‌ పాలసీతో అనుసంధానమై పనిచేస్తాయి. ‘డిడక్టబుల్‌’ (తగ్గించడం) ఇక్కడ కీలకం. టాపప్‌ అయినా, సూపర్‌ టాపప్‌ అయినా కనీస డిడక్టబుల్‌తో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలకు టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ తీసుకున్నారనుకుంటే.. హాస్పిటల్‌ బిల్లు రూ.5 లక్షల్లోపే ఉంటే టాపప్, సూపర్‌ టాపప్‌తో పని ఉండదు. బేస్‌ పాలసీలోనే క్లెయిమ్‌ పరిష్కారం అవుతుంది. బిల్లు రూ.5 లక్షలు దాటినప్పుడు ఈ ప్రత్యేక ప్లాన్లు యాక్టివ్‌గా మారతాయి. అదనపు మొత్తాన్ని అందిస్తాయి. బిల్లు రూ.8 లక్షలు వచి్చందనుకుందాం. అప్పుడు బేస్‌ పాలసీ రూ.5 లక్షలు, టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ రూ.3 లక్షలు చెల్లిస్తాయి.  
           
రెండూ వేర్వేరు.. 
ఇక్కడ టాపప్, సూపర్‌ టాపప్‌ రెండూ డిడక్టబుల్‌తో వచ్చినప్పటికీ.. కొంత స్పష్టమైన వైరుధ్యం ఉంది. టాపప్, సూపర్‌ టాపప్‌ రెండూ ‘డిడక్టబుల్‌’ దాటిన సందర్భాల్లో అమల్లోకి వస్తాయి. ఇందులో టాపప్‌ ప్లాన్‌ అనేది ఒకసారి ఆసుపత్రిలో చేరినపుడు ఆ క్లెయిమ్‌ మొత్తం డిడక్టబుల్‌ మొత్తాన్ని మించినప్పుడే అమలవుతుంది. సూపర్‌ టాపప్‌ అలా కాదు. ఒక బిల్లు డిడక్టబుల్‌ను మించిన సందర్భాల్లోనూ చెల్లింపులు చేస్తుంది. అలాగే, ఒక పాలసీ సంవత్సరంలో విడిగా ఒక్కో బిల్లు డిడక్టబుల్‌ దాటకుండా.. అన్నీ కలసి డిడక్టబుల్‌ను మించిన సందర్భంలోనూ చెల్లింపులు చేస్తుంది.    

పాలసీ కవరేజీ
బేస్‌ ప్లాన్‌        రూ.10 లక్షలు 
టాపప్‌            రూ.20 లక్షలు 
సూపర్‌ టాపప్‌    రూ.20 లక్షలు 
డిడక్టబుల్‌         రూ.10 లక్షలు

ఒక ఏడాదిలో క్లెయిమ్‌లు 
మొదటి క్లెయిమ్‌     4 లక్షలు 
రెండో క్లెయిమ్‌         3.50 లక్షలు 
మూడో క్లెయిమ్‌      4.50 లక్షలు 
మొత్తం                 రూ.12 లక్షలు 
 

→ ఇందులో టాపప్‌ ప్లాన్‌ కింద ఎలాంటి చెల్లింపులు రావు. ఎందుకంటే విడిగా ప్రతీ క్లెయిమ్‌ డిడక్టబుల్‌ రూ.10 లక్షలుమించలేదు.  

→ సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ మాత్రం విడిగా ఒక క్లెయిమ్‌ అనే కాకుండా, ఒక ఏడాదిలో మొత్తం క్లెయిమ్‌లు రూ.10 లక్షలు మించినా యాక్టివేట్‌ అవుతుంది. కనుక రూ.10 లక్షలు డిడక్టబుల్‌ పోను మిగిలిన రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరారన్న దానితో సంబంధం లేకుండా డిడక్టబుల్‌ దాటిన తర్వాత నుంచి ఆ పాలసీ సంవత్సరంలో అయ్యే వ్యయాలు అన్నింటికీ పాలసీ గరిష్ట పరిమితి మేరకు చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.20 లక్షలకు సూపర్‌ టాపప్‌ తీసుకుంటే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు మించి, రూ.20 లక్షల వరకు పాలసీ నిబంధనల మేరకు చెల్లింపులు అందుకోవచ్చు.  

→ టాపప్‌లో ఈ ఫీచర్‌ లేదు. ఏ బిల్లు అయినా డిడక్టబుల్‌ దాటినప్పుడే యాక్టివేట్‌ అవుతుంది.  

→ ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాల్లో వైద్యం అవసరమవుతుందో తెలియదు. ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అన్నది కుటుంబం అంతటికీ ఉద్దేశించినది. ఒక ఏడాదిలో ఒకరు ఆస్పత్రి పాలై బేసిక్‌ కవరేజీ ఖర్చయిపోయితే, అదే ఏడాది అదే కుటుంబంలో మరొకరికి వైద్యం అవసరం పడొచ్చు. అటువంటప్పుడు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ ఆదుకుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్తులు, వైరల్‌ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల కారణంగా ఒకే ఏడాది కుటుంబంలో ఒకరికి మించి వైద్యం అవసరం ఏర్పడొచ్చు.  

ఏది తీసుకోవాలి..? 
→ వివాహం కాని వారు, ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తోపాటు టాపప్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. 

→ కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ తీసుకునే వారికి సూపర్‌ టాపప్‌ అనుకూలం.  

→ బేసిక్‌ ఇండెమ్నిటీ హెల్త్‌ ప్లాన్‌ కంపెనీ నుంచే టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ తీసుకోవాలని లేదు. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి కాదు. పాలసీదారులు తమకు నచి్చన సంస్థ నుంచి ఈ రక్షణలను ఎంపిక చేసుకోవచ్చు. 

→ ఒకే కంపెనీ నుంచి బేసిక్‌ ప్లాన్, టాపప్‌/సూపర్‌ టాపప్‌ ఉంటే క్లెయిమ్‌లు సాఫీగా పరిష్కారం అవుతాయి. టాపప్‌–సూపర్‌ టాపప్‌ క్లెయిమ్‌ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. 

→ టాపప్‌– సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ ప్రీమియం తక్కువ కోరుకుంటే, వేర్వేరు కంపెనీల నుంచి ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు.  

→ బేసిక్‌ ప్లాన్, టాపప్‌/సూపర్‌ టాపప్‌ కవరేజీల్లో ఏకరూపత ఉంటే మంచిది.

వీటిపై ఫోకస్‌ చేయండి.. 
→ బీమా కంపెనీ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ ఎంత బలంగా ఉందో చూడాలి. తాము నివసించే ప్రాంతంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా కంపెనీ నగదు రహిత ఆస్పత్రుల నెట్‌వర్క్‌లో ఉంటే నయం.  

→ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా.. అదే రోజు చికిత్స తీసుకుని వెళ్లిపోయే (డే కేర్‌ ప్రొసీజర్స్‌) చికిత్సలకు (అన్నింటికీ) కవరేజీ ఉన్నాయేమో ధ్రువీకరించుకోవాలి.  

→ ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఎక్కువ రోజులకు కవరేజీ ఉండాలి.  

→ అత్యాధునిక రోబోటిక్, లేజర్‌ సర్జరీలకు పాలసీలో చెల్లింపుల ప్రయోజనాలు ఉంటే మెరుగు.  

→ ముందస్తు వ్యాధులకు కవరేజీ ఎంత వెయిటింగ్‌ తర్వాత అమల్లోకి వస్తాయో తెలుసుకోవాలి.  

→ ముఖ్యంగా రీసోర్టేషన్‌ ప్రయోజనం ఉంటే మంచిది. అంటే ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల సమ్‌ అష్యూర్డ్‌ మొత్తం ఖర్చయిపోతే.. తిరిగి అంతే మొత్తాన్ని తదుపరి వైద్యానికి బీమా సంస్థ పునరుద్ధరిస్తుంది.  

→ ఎంపిక చేసుకునే పాలసీల ప్రీమియం భరించగలిగే స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి.  

తగినంత కవరేజీ.. 
→ చాలా కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా రక్షణను (సమ్‌ అష్యూర్డ్‌) ఎంపిక చేసుకోవడం లేదని ఎన్నో సర్వేల్లో తేలింది. మెజారిటీ పాలసీదారుల రక్షణ అవసరానికంటే తక్కువే ఉంటోంది.  
→ కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారికి అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? తాము నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైద్యానికి అయ్యే వ్యయాల ఆధారంగా కవరేజీని నిర్ణయించుకోవాలన్నది నిపుణుల సూచన. 
→ కనీసం రూ.10 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో బేసిక్‌ ప్లాన్, రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవడం సముచితంగా ఉంటుంది. దీనివల్ల నేటి వ్యయాలకే కాకుండా, భవిష్యత్తు వ్యయాలకు సైతం రక్షణను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement