ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి నేపథ్యంలో ఏ ఫండ్‌ను ఎంచుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే గందరగోళం పెట్టుబడిదారుల్లో పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.
ఇటీవలి కాలంలో ‘నా దగ్గర రూ.30,000 ఉన్నాయి. వెండి కొనాలా? ఏ ఫండ్ తీసుకోవాలి?’ వంటి ప్రశ్నలు తనను ఎక్కువగా అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. తక్షణ పరిష్కారాల కోసం వెతకడం కంటే సరైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.
ప్రాథమిక అవగాహన ముఖ్యం
చాలామంది ఫైనాన్స్ గురించి కనీస అవగాహన లేకుండానే నేరుగా ఫండ్స్ కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. దీన్ని ఆమె ‘శ్వాస తీసుకోవడం నేర్చుకోకముందే డైవింగ్ చేయడం’తో పోల్చారు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలని, దీనికోసం తన పుస్తకం ‘మ్యాంగో మిలియనీర్’ ఎంతో దోహదపడుతుందని సూచించారు.
ఆర్థిక స్థితిగతులపై స్పష్టత
పెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వాస్తవాలను డాక్యుమెంట్ చేసుకోవాలి.
మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు ఎంత?
ప్రస్తుత పెట్టుబడులు, అప్పులు ఏమిటి?
మీ ఆర్థిక లక్ష్యాలు, వాటి కాలపరిమితి ఎంత?
స్వల్పకాలికంగా నష్టాలు వస్తే భరించే శక్తి ఉందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటేనే బలమైన పునాది ఏర్పడుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు.
నిపుణుల సలహా తీసుకోవడం
మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు లేదా క్వాలిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ల సహాయం తీసుకోవాలని ఆమె కోరారు. పైన పేర్కొన్న ఆర్థిక స్పష్టతతో నిపుణులను కలిసినప్పుడు వారు మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్రణాళికను రూపొందించగలరు. మీకు నమ్మకం కలిగే వరకు ఒకటి కంటే ఎక్కువ మంది నిపుణులతో మాట్లాడటంలో తప్పు లేదని ఆమె అన్నారు.
"I have 30,000 to invest, should I buy silver? What fund do I buy?"
I am seeing a lot more friends, family, and folks in general reach out for advice on their portfolio in the last few months. It is probably because volatility is so high across asset classes, returns over the…— Radhika Gupta (@iRadhikaGupta) February 9, 2026
తొందరపాటు నిర్ణయాలు వద్దు
పెట్టుబడి ప్రయాణం ప్రారంభంలోనే డైరెక్ట్ స్టాక్స్, వెండి, లేదా సంక్లిష్టమైన పీఎంఎస్(ధనవంతులైన పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీస్) ఉత్పత్తుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. మార్కెట్‌పై అవగాహన పెరిగే వరకు వీటి కోసం వేచి చూడటం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
తప్పుల నుంచి నేర్చుకోండి
‘ఇప్పుడే మొదలుపెట్టే వారు వెంటనే పని ప్రారంభించండి. తప్పులు చేసిన వారు కాసేపు విశ్రాంతి తీసుకోండి’ అని ఆమె సరళంగా వివరించారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఎంతోమంది మేధావులు తప్పులు చేశారని గుర్తు చేస్తూ పెట్టుబడి ప్రయాణంలో తప్పులు సహజమని పేర్కొన్నారు. మార్కెట్ దిద్దుబాట్లు అనేవి బోర్డు పరీక్షల వంటివని, అవి మనకు క్రమశిక్షణ, సహనం నేర్పుతాయని ఆమె విశ్లేషించారు.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట


