వరుసగా 200 మెసేజ్‌లు.. రూ.10 లక్షలు మాయం | 56 year old businessman hit by cyber fraud after receiving 200 SMS alerts | Sakshi
Sakshi News home page

వరుసగా 200 మెసేజ్‌లు.. రూ.10 లక్షలు మాయం

Feb 11 2026 11:25 AM | Updated on Feb 11 2026 11:34 AM

56 year old businessman hit by cyber fraud after receiving 200 SMS alerts

బెంగళూరులో ఓ వ్యాపారవేత్త సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.10 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొన్ని గంటల వ్యవధిలోనే 200కు పైగా మెసేజ్‌లు రావడంతో బాధితుడు నిర్ఘాంతపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

బెంగళూరులోని హెచ్‌ఆర్‌బీఆర్ లేఅవుట్‌కు చెందిన 56 ఏళ్ల భువన్ (పేరు మార్చాం) అనే వ్యాపారవేత్తకు ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 1 గంట మధ్య కాలంలో తన మొబైల్‌కు వరుసగా ఎస్‌ఎంఎస్ హెచ్చరికలు రావడం మొదలైంది. ఏవో ఒకటి రెండు కాదు, ఏకంగా 200కు పైగా సందేశాలు రావడంతో ఆయన ఆందోళనకు గురై వాటిని తనిఖీ చేశారు.

ఖాతా ఖాళీ చేసిన సైబర్ కేటుగాళ్లు

వచ్చిన సందేశాలను పరిశీలించగా అవి ఓటీపీలు, బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు వచ్చిన అలర్ట్‌లని ఆయన గుర్తించారు. తన ప్రమేయం లేకుండానే రెండు బ్యాంకు ఖాతాల నుంచి అనధికారికంగా లావాదేవీలు జరిగినట్లు గ్రహించిన భువన్ వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించారు. మొదటి ఖాతా నుంచి రూ.26,000 డెబిట్‌(ఉపసంహరణ) అయ్యాయి. రెండో ఖాతా నుంచి రూ.9.6 లక్షలకు పైగా నగదు మాయమైంది.

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు తెలియకుండానే మోసగాళ్లు పంపిన ఏదైనా అపాయకరమైన ఏపీకే ఫైల్ లింక్‌పై క్లిక్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘సైబర్ నేరగాళ్లు పంపిన మాల్వేర్ లింక్ లేదా ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేయడం ద్వారా బాధితుడి ఫోన్ వారి నియంత్రణలోకి వెళ్లి ఉండవచ్చు. దీనివల్ల బాధితుడికి తెలియకుండానే ఓటీపీలను యాక్సెస్ చేస్తూ నగదును దారి మళ్లించి ఉంటారు’ అని పోలీస్ అధికారి చెప్పారు.

జాగ్రత్త వహించాల్సిన అంశాలు

  • తెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ సందేశాలు లేదా ఎస్‌ఎంఎస్‌లలోని లింక్‌లను క్లిక్ చేయవద్దు.

  • అపరిచిత సోర్సెస్‌ నుంచి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయకండి.

  • బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement