సైబర్‌ వలలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి | Former JD Lakshminarayana Wife Loses Rs 2. 58 Crore From Cyber Fraud | Sakshi
Sakshi News home page

సైబర్‌ వలలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Jan 11 2026 4:02 AM | Updated on Jan 11 2026 7:28 AM

Former JD Lakshminarayana Wife Loses Rs 2. 58 Crore From Cyber Fraud

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ పేరుతో మోసం 

తనకు ట్రేడింగ్‌లో అనుభవం లేకపోవడంతో భర్తను వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్పించిన ఊరి్మళ 

రూ.2.58 కోట్లు మోసపోయిన బాధితురాలు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సతీమణి ఊర్మిళ సైబర్‌ నేరస్తుల వలలో చిక్కారు. స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు ఆర్జించవచ్చన్న నేరస్తుల మాయమాటలను నమ్మి ఏకంగా రూ.2.58 కోట్లు మోసపోయారు. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలోని స్రవంతి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న లక్ష్మీ నారాయణ భార్య ఊర్మిళకు గత నవంబర్‌ చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌లో సందేశం వచ్చింది.

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు చిట్కాలు ఇస్తామని, అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆ సందేశం సారాంశం. అయితే ఆమెకు ట్రేడింగ్‌లో అనుభవం లేకపోయేసరికి.. తన భర్తను వాట్సాప్‌ గ్రూప్‌లో చేరమని సలహా ఇచ్చారు. దీంతో లక్ష్మీ నారాయణ నవంబర్‌ 29న ‘స్టాక్‌ మార్కెట్‌ ప్రాఫిట్‌ గైడ్‌ ఎక్సే్ఛంజ్‌ గ్రూప్‌–20’అనే పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో చేరారు. ఇందులో 167 మంది సభ్యులు ఉన్నారు. 

అమెరికాలో పీహెచ్‌డీ అంటూ.. 
దినేష్‌ సింగ్‌ అనే వ్యక్తి వాట్సాప్‌ గ్రూప్‌లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులపై సలహాలు ఇస్తూ మెసేజ్‌లు చేసేవాడు. ‘స్టాక్‌ మార్కెట్‌ ట్రెజరీ హంటింగ్‌ సీక్రెట్స్‌’ పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించనున్నానని, ఈనెల 23న ముంబైలో ఈ కార్యక్రమం ఉంటుందని దినేష్‌ గ్రూప్‌ సభ్యులకు కల్లబొల్లి మాటలు చెప్పాడు. తాను ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్‌ని అని, అమెరికాలోని వార్టన్‌ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశానని, జేపీ మోర్గాన్‌లో 6 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను నిర్వహించిన ఈక్విటీ అనలిస్ట్‌నని చెబుతూ ఓ నకిలీ లింక్‌ను పంపించాడు. అది చూసిన గ్రూప్‌ సభ్యులు నిందితుడిని గుడ్డిగా నమ్మారు.

ఇదే సమయంలో దినేష్‌ ‘ది వెల్త్‌ అలయెన్స్‌’ అనే కాన్సెప్‌్టను గ్రూప్‌ సభ్యులకు పరిచయం చేశాడు. ఒకేరకమైన ఆలోచనలు, లక్ష్యాలు ఉన్న గ్రూప్‌ సభ్యులు కలిసి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే 500 శాతం రాబడులు వస్తాయని.. అదే అలయెన్స్‌ లక్ష్యమని నమ్మించాడు. 5–6 వారాల్లో 200 శాతం లాభాలు అందిస్తానని హామీ ఇచ్చాడు. సభ్యులతో ఏకీకృత బ్రోకరేజ్‌ ఖాతాను తెరిచాడు. మెకన్లీ బ్రోకరేజ్‌ సర్విసెస్‌ ద్వారా మాత్రమే ఇండియన్‌ మార్కెట్‌ క్యూఐబీ ట్రేడింగ్, యూఎస్‌ మార్కెట్‌ క్యూఐబీ ట్రేడింగ్, ఐపీఓ సబ్‌స్రి్కప్షన్లను నిర్వహించాలని సూచించాడు. ఇందుకు కస్టమర్‌ సర్విసెస్‌ మేనేజర్‌ అంటూ ఖైతీ అనే మహిళను పరిచయం చేశాడు. సెబీ రిజిస్టర్డ్‌ సంస్థ అని నకిలీ గుర్తింపు పత్రాలను చూపాడు. భారత్‌తోపాటు అమెరికా, హాంకాంగ్‌లలో ట్రేడింగ్‌ చేయడానికి అధికారం ఉందని వివరించాడు.   

బంగారం మీద రుణం తీసుకొని మరీ.. 
గ్రూప్‌ సభ్యులను మూడు శ్రేణులుగా విభజించిన దినేష్‌.. రూ.20 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు ఉన్నవారికి విక్టరీ వాన్‌ గార్డ్స్‌ టీమ్‌–1 అని, రూ.20 లక్షల కంటే ఎక్కువ పెట్టేవారిని విక్టరీ వాన్‌ గార్డ్స్‌ టీమ్‌–2 అని, అత్యధిక పెట్టుబడులు పెట్టేవారిని క్లోజ్డ్‌ డోర్‌ డిస్‌ప్లే టీమ్‌ అని పేర్లు పెట్టాడు. గ్రూప్‌ సభ్యులకు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మార్గదర్శకత్వం అందిస్తామని మాయమాటలు చెప్పాడు. గ్రూప్‌ సభ్యులు అధిక లాభాలు పొందేందుకు పెట్టుబడులు పెంచాలని.. లేకపోతే లాభాలు కోల్పోతారని భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఊర్మిళ పెట్టుబడుల మొత్తాన్ని పెంచారు. ఈ2ఈ రైల్, గాబియన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓలలో పాల్గొనాలని, పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేయాలని సూచించాడు. 300 శాతం లాభాలు వస్తాయని నమ్మించాడు.

దీంతో గుడ్డిగా నమ్మిన ఊర్మిళ.. బంగారం మీద రుణం తీసుకొని మరీ పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు అత్యాశ వద్దని భర్త హెచ్చరించినా పట్టించుకోకుండా ఆమె పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేయడం గమనార్హం. పెట్టుబడుల కోసం నిందితులు పశి్చమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన కరెంట్‌ ఖాతా నంబర్లను అందించారు. దీంతో అనుమానం కలిగిన ఊర్మిళ.. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేశారు. వాట్సాప్‌ ఆధారిత పెట్టుబడి మోసాల గురించి పలు నివేదికలను చూశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోరి్టంగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 6న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్‌ఎస్‌ చట్టం సెక్షన్‌ 111(2)(బీ), 318(4), 319(2), 336(3), 338, 340(2)లతో పాటు ఐటీ చట్టంలోని 66–సీ,డీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఒక్క రోజే రూ.38 లక్షలు..
ఊర్మిళ తన భర్త పేరు, వివరాలతో ‘మెక్కీ సీఎం’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ట్రేడింగ్‌ ఖాతాను ప్రారంభించారు. గ్రూప్‌లో ఇచ్చిన సూచనల మేరకు మెకిన్లీ ట్రేడింగ్‌ ఖాతాలోకి సొమ్మును బదిలీ చేశారు. గత డిసెంబర్‌ 24న తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. అప్పట్నుంచి ఈనెల 5 వరకు 19 దఫాలుగా మొత్తం రూ.2.58 కోట్లు పెట్టారు. డిసెంబర్‌ 26న ఒక్క రోజే ఏకంగా రూ.38 లక్షలు పెట్టారు. బాధితురాలి యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి నిందితులకు చెందిన సీబీఐ బ్యాంక్‌లోని కంపాకోలా బెవరేజెస్‌ ఖాతాకు ఈ సొమ్మును బదిలీ చేశారు. నిందితులు మాతారా ఎంటర్‌ప్రైజెస్, రిసోర్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్, సమ్మిట్‌ ఆటోమేషన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ పేరుతో కరెంట్‌ ఖాతాలు నిర్వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement