శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.
ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.
ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్‌కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.
'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను.
రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్‌తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.
(చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు)


