చెట్టికులంగర: ఆ ఆరోతరగతి పిల్లాడి స్కూల్ బ్యాగులో పుస్తకాల కంటే ప్రాణాన్ని నిలబెట్టే పరికరాలే ఎక్కువ.. కేరళలోని చెట్టికులంగరకు చెందిన పసివాడు అతుల్ కథ వింటే ఎవరికైనా కన్నీరు రాకమానదు. తోటి పిల్లలంతా ఆటపాటల్లో మునిగిపోతుంటే, అతుల్ మాత్రం తన రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించే గ్లూకోమీటర్, ప్రాణాలను నిలబెట్టే ఇన్సులిన్ సిరంజితో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే రోజుకు మూడుసార్లు సూది నొప్పిని భరిస్తూ, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఈ బాలుడి జీవన పోరాటం అత్యంత హృదయవిదారకం.
తీవ్రమైన దాహం, వివరించలేనంత అలసట, అకస్మాత్తుగా తగ్గిపోతున్న బరువు.. అతుల్ శరీరంలో వచ్చిన ఈ మార్పులు అతని తల్లిదండ్రులను విపరీతంగా కలవరపెట్టాయి. పరీక్షల అనంతరం అతుల్‌కు ‘టైప్ 1 డయాబెటిస్’ ఉందని తేలడంతో వారి ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలింది. అతుల్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగడం లేదని..అతను బతకాలంటే బయటి నుండి ఇన్సులిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని వైద్యులు చెప్పారు. ఈ మాటవినగానే బాలుని తల్లిదండ్రుల గుండె ముక్కలైంది. నాటి అతుల్ బాల్యం ఇంజెక్షన్లు, రక్తపరీక్షల మధ్యే నలుగుతోంది.
అతుల్ తండ్రి ఒక వెల్డర్. రోజువారీ సంపాదనతోనే ఇల్లు గడవడం కష్టంగా ఉన్న తరుణంలో, అతుల్ మందుల ఖర్చు నెలకు రూ. ఐదు వేలకుపైగానే అవుతోంది. ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ, కొడుకు ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తండ్రి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ, నేటికీ ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. పథకాలు కాగితాలకే పరిమితమైతే, పేదవాడి ప్రాణం గాలిలో దీపంలా మారుతుందనడానికి అతుల్ పరిస్థితే నిదర్శనం.
ఇన్ని కష్టాలు ఉన్నా అతుల్ చదువుపై మక్కువను వదులుకోలేదు. స్కూల్ ఆఫీసు రూమ్‌లో భోజన సమయంలో ఇన్సులిన్ తీసుకుంటూ, తన దినచర్యను అత్యంత బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులు చాక్లెట్లు, స్వీట్లు తింటుంటే, అతుల్ మాత్రం కఠినమైన ఆహార నియమాలను తప్పకుండా పాటిస్తున్నాడు. ఈ చిన్నారి ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ పసివాడు తాను త్వరలోనే కోలుకుంటానని ఆశపడుతున్నాడు.
ఇది కూడా చదవండి: లోక్‌సభలో ‘ప్రియాంకం’.. అన్న లేని లోటు తీరుస్తూ..


