సంచ‌ల‌న విజ‌యం.. ఎవ‌రీ శ్రీలేఖ? | Who is Sreelekha Frontrunner For Thiruvananthapuram Mayor Post | Sakshi
Sakshi News home page

Sreelekha IPS: ఎవ‌రీ 'రైడ్ శ్రీలేఖ'?

Dec 15 2025 3:14 PM | Updated on Dec 15 2025 4:04 PM

Who is  Sreelekha Frontrunner For Thiruvananthapuram Mayor Post

కేర‌ళ రాష్ట్ర రాజ‌ధాని తిరువ‌నంత‌పురం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఒంటరిగా పోటీ చేసి విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొత్తం 101 వార్డుల‌కు జ‌ర‌గిన ఎన్నిక‌ల్లో 50 చోట్ల బీజేపీ అభ్య‌ర్థులు గెలిచారు. దీంతో తిరువ‌నంత‌పురం మేయర్ పీఠం తొలిసారిగా కాషాయ పార్టీకి ద‌క్కింది. అయితే మేయ‌ర్‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. మేయ‌ర్ రేసులో సీనియ‌ర్ మ‌హిళా ఐపీఎస్ అధికారి ఆర్‌. శ్రీలేఖ (R. Sreelekha) ముందంజ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 64 ఏళ్ల శ్రీలేఖ శాస్త్ర మంగ‌ళం వార్డు నుంచి ఎల్‌డీఎఫ్ కూటమి అభ్య‌ర్థిపై 700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

మోదీ స్ఫూర్తితో పొలిటిక‌ల్ ఎంట్రీ
1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శ్రీలేఖ కేర‌ళ‌లో తొలి మ‌హిళా ఐపీఎస్‌గా రికార్డుకెక్కారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర్కొన్న ఆమె, వివాద‌స్ప‌ద అధికారిగా పేరుగాంచారు. 2020లో పదవీ విరమణ చేశారు. అప్ప‌టి నుంచి అనేక అంశాల‌పై బ‌హిరంగంగా స్పందిస్తూ వ‌స్తున్నారు. 2024, అక్టోబ‌ర్‌లో ఆమె బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితో తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు చెప్పారు.  “నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాను. పదవీ విరమణ తర్వాత, ప్రజలకు సేవ చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని నేను నమ్ముతున్నాను,” అని ఆమె అన్నారు.

లెక్చ‌ర‌ర్ టు ఐపీఎస్‌
శ్రీలేఖ తిరువ‌నంత‌పురంలోనే పుట్టిపెరిగారు. 1960 డిసెంబర్ 25న ప్రొఫెసర్ ఎన్. వేలాయుధన్ నాయర్, బి. రాధమ్మ దంపతులకు ఆమె జన్మించారు. కాటన్ హిల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యాభాస్యం ప్రారంభించారు. ఆ త‌ర్వాత ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో తన బ్యాచిలర్ డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్ డిగ్రీ ప‌ట్టా అందుకున్న త‌ర్వాత లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం మొద‌లుపెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులు రిజర్వ్ బ్యాంక్‌లో కూడా పనిచేశారు. 1987, జనవరిలో కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా పోలీసు స‌ర్వీసులో చేరారు. మ‌హిళ‌లు పోలీసు ఉన్న‌త ఉద్యోగాల్లో చేర‌డానికి ఆమె ప్రేర‌ణ‌గా నిలిచారు.

త‌ల్లి ప్రోత్సాహం
మ‌హిళా ఐపీఎస్ అధికారిగా మొద‌టి ప‌దేళ్లు చాలా స‌వాళ్లు ఎదుర్కొన్నాన‌ని గ‌తంలో ఓ ఇంట‌ర్య్వూలో చెప్పారు. మహిళా పోలీసు అధికారికి స్నేహపూర్వకంగా లేని వ్యవస్థతో పోరాడటానికి తాను రెట్టింపు కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే ఎంతో మంది యువ‌తులు త‌న‌ను స్ఫూర్తిగా తీసుకోవ‌డం ఆనందం క‌లిగించే విష‌య‌మ‌ని చెబుతూ... వేరే రాష్ట్రానికి చెందిన ఒక యువ మ‌హిళా ఐపీఎస్ తనలాగే కావాలని ఆకాంక్షిస్తున్నా ఆశీర్వాదం కోసం తన వద్దకు వచ్చిన క్షణాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. త‌న త‌ల్లి ఇచ్చిన ప్రోత్సాహం కార‌ణంగానే తాను ఐపీఎస్ సాధించాన‌ని శ్రీలేఖ వెల్ల‌డించారు. కాగా, పోలీసు శాఖలో మహిళల ప్రాతినిథ్యం పెంచ‌డానికి శ్రీలేఖ కృషి చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో  'పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి' అనే నిబంధనను తొలగించాలని కోరుతూ ఆమె నిరంతరం లేఖలు రాసేవారు. ఆమె కాలంలో 4 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం, నేడు పోలీసు బలగంలో 9 శాతానికి పైగా పెరిగింది.

'రైడ్ శ్రీలేఖ'
చేర్తలా, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాల్లో ఎస్పీగా ప‌నిచేశారు శ్రీలేఖ. త‌న ప‌నితీరుతో 'రైడ్ శ్రీలేఖ'గా ఆమె ప్రాచుర్యం పొందారు. సీబీఐలో నాలుగేళ్లు ప‌నిచేశారు. న్యూఢిల్లీలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గానూ సేవ‌లు అందించారు. డిఐజీ, ఐజీ, ఏడీజీపీగా ఆమె విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో, క్రైమ్ బ్రాంచ్‌కు నాయకత్వం వహించారు. ఆర్థిక నేరాల కేసుల విచార‌ణ‌లో భాగంగా దాడులు చేయ‌డానికి ఏమాత్రం ఆలోచించే వారు కాదు. ఆమె నాయకత్వంలో పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి. అందుకే ఆమెకు 'రైడ్ శ్రీలేఖ' అనే పేరు వ‌చ్చింది. 2007లో కేరళ ప్రభుత్వం ఆమెను విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది.

నిందితురాలికి చెంప‌దెబ్బ‌
కేర‌ళ సంచ‌ల‌నం రేపిన 2003 నాటి కిలిరూర్ లైంగిక వేధింపుల కుంభ‌కోణంలో ప్రధాన నిందితురాలైన లతా నాయర్‌ను చెంప‌దెబ్బ కొట్టి వార్త‌ల్లో నిలిచారు శ్రీలేఖ‌. ఇలా కొట్ట‌డం చట్టవిరుద్ధమైన‌ప్ప‌టికీ త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్థించుకున్నారామె. మైనర్ బాలికల లైంగిక దోపిడీపై ద‌ర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఒక‌రిని అప్ప‌ట్లో శ్రీలేఖ క‌లిశారు. త‌మ‌కు ఈ గ‌తి ప‌ట్టించిన దుర్మార్గుల‌ను ప‌ట్టుకుని రెండు చెంపదెబ్బలు కొట్ట‌మ‌ని ఆమెను బాధితురాలు వేడుకుంది. ఆమె కోరిక మేర‌కు నిందితురాలిని చెంప‌దెబ్బ కొట్టారు. “ఇంకొకటి మిగిలి ఉంది. రెండో చెంప‌దెబ్బ కొట్ట‌నందుకు బాధ ప‌డుతున్నాను” అని తర్వాత అన్నారు. పోలీసు విభాగంలో స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులను కూడా ఆమె బ‌హిరంగంగానే ప్ర‌తిఘ‌టించారు.

చ‌ద‌వండి: సివిల్స్ విజేత‌ల్లో ఎక్కువ మంది వారే!

చిన్న‌నాటి స్నేహితుడే భ‌ర్త‌
శ్రీలేఖ వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే.. ఆమె భర్త డాక్టర్ సేతునాథ్ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా ప‌నిచేశారు. సేతునాథ్ ఆమె చిన్న‌నాటి స్నేహితుడు కావ‌డం విశేషం. వీరి కుమారుడు గోకుల్ ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీలేఖ రచయిత్రి కూడా.  'మరణదూతన్' అనే డిటెక్టివ్ నవల సహా తొమ్మిది పుస్తకాలు రాశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement