ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్‌లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.
యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు.
దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు.
హనుక్కా అంటే..
"హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.
అద్భుతం జరిగిన రోజు..
క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.
ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..
ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు.
ఎలా జరుపుకుంటారు?
మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.
డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.
విందు..
ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్‌కేక్‌లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్‌ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.
స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.
(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..)


