వెర్రి వేయి తలలు.. అంటే ఇదేనేమో?!.. దీనికి తాజా ఉదాహరణే ఇది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భాగ్యనగరంలో గడిపింది కేవలం కొన్ని గంటలే. ఆయన పర్యటన శంషాబాద్ విమానాశ్రయం–తాజ్ ఫలక్‌నుమ–ఉప్పల్ స్టేడియం మధ్యే జరిగింది. అయినప్పటికీ మెస్సీతో వేల మంది ఫొటోలు దిగారు. కొందరైతే తాము వండిన వంటల్నీ ఆ ఆటగాడికి రుచి చూపించారు. మరికొందరు ఫుట్‌బాల్‌తో పాటు ఇతర ఆటలు సైతం మెస్సీతో ఆడించేశారు. వీటిని సంబంధించిన ఏఐ ఫొటోలు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కల్పిత ఫొటోల హడావుడి నేపథ్యంలో నిజంగా మెస్సీతో ఫొటో దిగిన వాళ్లు తమ ప్రత్యేకతను చాటుతూ పోస్టు చేయలేని, చేసినా నమ్మలేని పరిస్థితి నెలకొంది.
సామాజిక మాధ్యమాల రాకతో ప్రతి ఒక్కరూ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో భాగస్వాములయ్యే అవకాశం దక్కింది. దీంతో పాటు ఇటీవల అందుబాటులోకి వచ్చిన గూగుల్ జెమినీ, పర్‌ప్లెక్సిటీ, చాట్‌జీపీటీ వంటి మాధ్యమాల రాకతో నిజానికి, అబద్దానికి మధ్య తేడా గుర్తించడం సామాన్యులకు కష్టమైన పరిస్థితిగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా, ఆనందంగానూ అనిపిస్తుంటి.. మరికొన్ని బాధను కలిగించే పోస్టులు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే పోస్టులు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అదే అర్జంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీతో దిగిన ఫేక్ సెల్ఫీ ఫొటోలు.
మెస్సీతో మేముసైతం..
మెస్సీ హైదరాబాద్ టూర్, సీఎం ఎ.రేవంత్‌రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ తదితరాలకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే అప్‌డేట్ వచ్చింది. అయితే మూడు రోజుల క్రితం వరకు ఏఐ చిత్రాల హడావుడి సోషల్‌మీడియాలో కనిపించలేదు. ‘మెస్సీతో సెల్ఫీ దిగడానికి రూ.10 లక్షలు చెల్లించాలి.. అది కూడా కేవలం వంద మందికి మాత్రమే అవకాశం’ అంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
అప్పటి నుంచి ఈ ఏఐ చిత్రాల ప్రతిసృష్టి ప్రారంభమైంది. తాము మెస్సీ వద్దకు వెళ్లి, రూ.10 లక్షలు చెల్లించి ఫొటో ఎందుకు దిగాలంటూ కామెంట్స్ చేస్తున్న సిటిజనులు ఆ ఫుట్‌బాల్ దిగ్గజంతో రూపొందించిన ఏఐ చిత్రాలను తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో పోస్టు చేస్తూ మెస్సీనే వారి వద్దకు వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిత్రంగా, విచిత్రంగా..
ఉప్పల్ స్టేడియంలో ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా కీడ్రాభిమానుల సోషల్‌మీడియా ఖాతాలన్నీ సంబంధిత ఫొటోలతో నిండిపోతాయి. స్పోర్ట్స్ టీషర్టులు, ముఖానికి రంగులతో స్టేడియం లోపల, చుట్టుపక్కల దిగిన ఫొటోలను పోస్టు చేస్తుండటం పరిపాటే. మెస్సీ టూర్ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ‘సెల్ఫీ–రూ.10 లక్షల’ అంశంతో వీటితో పాటు ఏఐ చిత్రాలూ సోషల్‌మీడియా ఖాతాలను ముంచెత్తాయి.
కొందరు మెస్సీని స్టేడియంలోని తమ గ్యాలరీల్లోకి వచ్చి, తమతో ఫొటోలు దిగినట్లు సృష్టిస్తున్నారు. మహిళలు, యువతులైతే మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా మెస్సీని నేరుగా తమ ఇళ్లకే తీసుకెళ్లిపోయారు. హాలు, వంటిల్లు అన్న తేడా లేకుండా కూర్చోబెట్టి బిర్యానీ, పులిహోర తినిపిస్తున్నట్లు, వండిస్తున్నట్లు కూడా ఏఐ ఫొటోలు సృష్టించి సోషల్‌మీడియాల్లో పోస్టు చేశారు.
ఆడించి.. ఓడించి..
సిటీ టూర్‌లో భాగంగా మెస్సీ–సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్, సింగరేణి ఆర్‌ఆర్–9 జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. క్రీడాకారులు, ప్రముఖులు, యాంకర్లతో కలిపి ఈ మ్యాచ్‌లో మొత్తం 50 మంది కూడా పాల్గొనలేదు. అయితే సోషల్‌మీడియా వేదికగా మాత్రం మెస్సీ లక్షల మందితో ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్ బాల్‌తో పాటు కబడ్డీ కూడా ఆడేశాడు.
ఆయన తమతో ఆయా ఆటలు ఆడినట్లు, ఆడలేక ఓడినట్లు ఏఐ చిత్రాలను సృష్టించిన నెటిజనులు సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. కొందరైతే చారి్మనార్, గోల్కొండ, ఫలక్‌నుమ ప్యాలెస్ వద్ద మెస్సీతో కలిసి హైదరాబాద్ చాయ్ తాగుతున్నట్లు, ఆయనే ఫాస్ట్‌ఫుడ్ తయారు చేస్తున్నట్లు సృష్టించారు. ఈ ఏఐ ఫొటోలను సృష్టించి వైరల్ చేసిన వారిలో సమాన్యులే కాదు.. కొందరు ప్రముఖులు, నాయకులు, యాంకర్లు సైతం ఉండటం గమనార్హం.
(చదవండి: ఆ దేశంలో న్యాప్ కేఫ్‌లు ఉంటాయి!)


