మధుమేహం కారణంగా కాళ్లలో పుళ్లు, ఆపై ఆంపిటేషన్స్
ప్రతి నలుగురు మధుమేహుల్లో ఒకరికి ఈ తరహా సమస్య
ముందుగా గుర్తిస్తే వాస్క్యులర్ చికిత్సలతో కాలు సురక్షితం
పలు విభాగాల వైద్యుల సమన్వయంతో ఈ చికిత్సలు
కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన సదస్సులో వైద్యనిపుణుల వెల్లడి
హైదరాబాద్: మన దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్నారని, వీరికి కాళ్లలో పుళ్లు పడినా నొప్పి తెలియకపోవడంతో అవి తీవ్రమై.. చివరకు కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వైద్య నిపుణులు తెలిపారు. ప్రతి నలుగురు మధుమేహ బాధితుల్లో ఒకరికి ఈ తరహా సమస్య వస్తోందన్నారు. ముందుగా గుర్తించగలిగితే వాస్క్యులర్ చికిత్సలతో కాళ్లను కాపాడుకునే అవకాశం ఉంటుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బొల్లినేని తెలిపారు.
అన్ని విభాగాలకు చెందిన వైద్యుల సమన్వయంతో మధుమేహ బాధితుల కాళ్లను తొలగించాల్సిన అవసరం లేకుండా కాపాడుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ అంశంపై ఆస్పత్రి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) సదస్సులో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో ప్రధానంగా వాస్క్యులర్ సర్జన్లు, ప్లాస్టిక్ సర్జన్లు, పోడియాట్రిస్టులు (పాదాల నిపుణులు), జనరల్ సర్జన్లు, ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు, ఇన్ఫెక్షువస్ డిసీజ్ స్పెషలిస్టులు ఉన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ బొల్లినేని మరియు బృందం మాట్లాడుతూ, “చికిత్సా పద్ధతిని ప్రామాణీకరించడం ద్వారా మధుమేహ బాధితులలో కాళ్ల తొలగింపును నివారించడం, తగ్గించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ముప్పును ముందుగా గుర్తించడం, వాస్క్యులర్ చికిత్సలు చేయడం, ఇన్ఫెక్షన్లను నియంత్రించడం, గాయాలు, మృదు కణజాలాలకు చికిత్సలు అందించడం, దీర్ఘకాలం పాటు పాదాల సంరక్షణ ఎలా చేసుకోవాలో మధుమేహ బాధితులకు చెప్పడం లాంటివి చాలా ముఖ్యం.
దేశంలో ఇతర ప్రాంతాల కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మధుమేహం చాలా ఎక్కువమందికి ఉంటోంది. దానివల్ల కాళ్ల తొలగింపు ముప్పు కూడా ఇక్కడే ఎక్కువగా కనిపిస్తోంది. మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఒకరికి కాళ్లలో పుళ్లు ఏర్పడతాయి. అయితే, వారికి స్పర్శ అంతగా తెలియకపోవడంతో ఆ విషయాన్ని గుర్తించరు. దీనివల్ల పుళ్లు ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి కాళ్లు తొలగించాల్సి వస్తోంది. అందువల్ల కేవలం మధుమేహ నియంత్రణకే వైద్యులు పరిమితం కాకుండా.. సమగ్ర చికిత్సలు చేయాల్సిన అవసరం ఉంది.
అత్యాధునిక ఊండ్ కేర్ విధానాలు పాటించాలి. అలాగే ఇన్ఫెఫెక్షన్లను నియంత్రించాలి. మధుమేహ బాధితుల కాళ్లను కాపాడడంతో వాస్కులర్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. గతం కంటే ఇప్పుడు ఎండోవాస్క్యులర్ విధానాలు, ఆధునిక రీకన్‌స్ట్రక్టివ్ టెక్నిక్‌లు, డెర్మల్ సబ్‌స్టిట్యూట్లు రావడంతో చికిత్స ఫలితాలు మెరుగుపడుతున్నాయి. చాలా కేసుల్లో చివరి దశకు చేరుకున్న తర్వాతే రోగులు వైద్యులను సంప్రదించడం పెద్ద సవాలుగా మారుతోంది” అని తెలిపారు.
ప్లాస్టిక్ సర్జన్ డా. శరత్ చంద్రరెడ్డి మరియు ఆయన బృందం మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారు కాళ్ల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, చిన్న గాయం కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పలువురు ఇతర వైద్య నిపుణులు సూచించారు. ముందస్తు స్క్రీనింగ్, సరైన అవగాహనతో చాలావరకు కాళ్ల తొలగింపులను నివారించవచ్చని వారు స్పష్టం చేశారు. ఇలాంటి సీఎంఈ కార్యక్రమాల ద్వారా వైద్యుల్లో అవగాహనను పెంచుతూ, రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి కిమ్స్ ఆస్పత్రి కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.


