జీవన్‌రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌ ఫ్లెక్సీల తొలగింపు | Congress Protocol Flexes Removed At Jeevan Reddy House | Sakshi
Sakshi News home page

జీవన్‌రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌ ఫ్లెక్సీల తొలగింపు

Mar 16 2026 7:47 PM | Updated on Mar 16 2026 8:41 PM

Congress Protocol Flexes Removed At Jeevan Reddy House

జీవన్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)

జగిత్యాల : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద ఉన్న పార్టీ ప్రోటోకాల్‌ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాలలోని జీవన్‌రెడ్డి రెడ్డి నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్‌ ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు తొలగించారు. 

ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఈనెల 24 లేదా 25వ తేదీన జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటివద్ద ఉన్న కాంగ్రెస్‌ ఫ్లెక్సీల తొలగింపు చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్‌రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉతంఠ నెలకొంది.

బీఆర్‌ఎస్‌లో చేరతారా..?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ తర్వాత ప్రముఖంగా ఉన్న పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీలు.  మరి జీవన్‌రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్‌ నడుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం వార్త హల్‌చల్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ గూటికి జీవన్‌రెడ్డి చేరబోతున్నారనేది ఆ వార్త సారాంశం.  

దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడానికి జీవన్‌రెడ్డి సన్నద్ధమవుతున్నారని,  ఆ సభకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత తనకు కాంగ్రెస్‌లో తగిన గౌరవం లభించలేదని భావిస్తున్న జీవన్‌రెడ్డి.. దానికి పార్టీని వీడటం ఒక్కటే సరైన మార్గమని అనుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement