ప్రత్యూష మృతి కేసు: సిద్ధార్థరెడ్డి లొంగుబాటు | Pratyusha Death Case, Siddharth Reddy Surrenders In Court After Supreme Court Upholds Two Year Sentence | Sakshi
Sakshi News home page

ప్రత్యూష మృతి కేసు: సిద్ధార్థరెడ్డి లొంగుబాటు

Mar 16 2026 9:13 PM | Updated on Mar 17 2026 11:30 AM

Pratyusha Death Case: Siddharth Reddy Surrenders in Court

హైదరాబాద్‌:  సినీ నటి ప్రత్యూష మృతికేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థరెడ్డి కోర్టులో లొంగిపోయాడు. ఈ రోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) నాంపల్లి కోర్టులో సిద్ధార్థరెడ్డి లొంగిపోయాడు. అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో సరెండర్‌ అయ్యాడు. 2002 ఫిబ్రవరి 23న సినీ నటి ప్రత్యూష మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. 

డ్రింక్‌లో పురుగుమందు కలిపిన సిద్ధార్థరెడ్డి.. అతను తాగడంతో పాటు ప్రత్యూషకు కూడా ఇచ్చాడు. ఇది తాగిన ప్రత్యూష్‌  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, సిద్ధార్థరెడ్డి కోలుకున్నాడు. 

ఇటీవల ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది.  బెయిల్‌ కోసం ఆయన వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది.  ప్రత్యూష హత్య కేసులో సిద్దార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు  శిక్షను సుప్రీంకోర్టు  సమర్థించింది. 

ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ్‌ రెడ్డి  అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ప్రత్యూష హీరోయిన్‌గా రాణిస్తున్నప్పడు సిద్ధార్థ్‌ రెడ్డి ఇంజనీరింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో  2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ   విషం తీసుకున్నారు.

చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్‌ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.

నాలుగు వారాల్లో లొంగిపోవాలి
సీబీఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, తీర్పును సవాల్‌ చేస్తూ సిద్ధార్థరెడ్డి  హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది.

ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే..
అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి.  కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో సంతోషంగా ఉన్నాం.  ఫేషియల్, వ్యాక్సింగ్‌ చేయించుకోవడానికి తన కజిన్‌ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. పార్లర్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్‌ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్‌ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు బయటకు వెళ్లి వస్తానని శిరిని వెయిట్‌ చేయమని చెప్పింది.

అయితే, కొంత సేపటికి ప్రత్యూష నుంచి నాకు ఫోన్‌ వచ్చింది... ‘జయం సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్లు తేజ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి నాకు వచ్చిన చివరి ఫోన్‌ కాల్‌.. కానీ, వాళ్లు మాత్రం తేజ గారి ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరికి ఫోన్‌ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత శిరి ఫోన్‌ చేసినా సరే ప్రత్యూష ఫోన్‌ తియ్యలేదట. ఆ తర్వాత అంతా మిస్టరీగానే మిగిలిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement