లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు! | Lucknow Fire Horror Residential Building Used as Commercial Complex Kills 15 | Sakshi
Sakshi News home page

లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు!

Jun 23 2026 7:51 AM | Updated on Jun 23 2026 10:43 AM

Lucknow Fire Horror Residential Building Used as Commercial Complex Kills 15

అలీగంజ్: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన  అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఒక యానిమేషన్ కోచింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటలు, దట్టమైన పొగ కారణంగా 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘోర విషాదం వెనుక  నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నివాస గృహంగా అనుమతి పొందిన ఒక భవనాన్ని, ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చేయడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

అనుమతి నివాసానికే.. వ్యాపారం మాత్రం కోట్లలో
లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ రికార్డుల ప్రకారం.. ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న ఈ అంతస్తుల భవనానికి 2014లో కేవలం ‘నివాస భవనం’గానే అనుమతి లభించింది. రామేశ్వరం గ్రూప్‌నకు చెందిన వీరేంద్ర ప్రసాద్ శుక్లా, సురేంద్ర ప్రతాప్ శుక్లా, ధీరేంద్ర ప్రతాప్ శుక్లాల పేరిట ఈ ప్లాన్ ఆమోదం పొందింది. ఆ తర్వాత కాలంలో ఈ ఆస్తి చేతులు మారింది. కాగితాల్లో ఇది నివాస ప్రాంతంగానే ఉన్నప్పటికీ, నిబంధనలను తుంగలో తొక్కి ఇందులో ఆఫీసులు, యానిమేషన్ శిక్షణ కేంద్రాలు వంటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎలాంటి కమర్షియల్ అనుమతులు గానీ, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ (అగ్నిమాపక శాఖ అనుమతి) గానీ తీసుకోలేదని దర్యాప్తులో తేలింది.

బయోమెట్రిక్ లాక్ మృత్యుపాశం
ఈ భవనంలో కనీస అత్యవసర నిష్క్రమణ మార్గం లేకపోవడం, పైకప్పు కు వెళ్లే దారిని మూసివేయడం పెద్ద తప్పిదాలని అధికారులు పేర్కొన్నారు. అన్నింటికంటే దారుణంగా, ఈ కోచింగ్ సెంటర్ ఎంట్రీ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ బయోమెట్రిక్ మెకానిజం, ప్రమాదం జరిగిన సమయంలో కరెంట్ పోవడంతో పూర్తిగా జామ్ అయిపోయింది. దీంతో లోపల ఉన్న విద్యార్థులు బయటకు రాలేక, దట్టమైన పొగలో ఊపిరాడక లోపలే చిక్కుకుపోయారు. సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగగానే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినప్పటికీ, ఈ లోపభూయిష్టమైన భవన నిర్మాణం వల్ల సహాయక చర్యలు అత్యంత కఠినంగా మారాయి.

మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం
ఈ దందాలో స్థానిక మున్సిపల్ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ 2022 నుండి ఈ భవనం నుండి ‘కమర్షియల్ ప్రాపర్టీ టాక్స్’ వసూలు చేస్తోంది. అంటే, ఇక్కడ నివాస భవనంలో వ్యాపారం సాగుతోందనే విషయం అధికారులకు ముందే తెలుసు. అయినా వారు కళ్లు మూసుకున్నారు. ఈ ఘోరానికి కారణమైన నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా, నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ల్యాండ్ యూజ్ మార్పిడిని పట్టించుకోని మాజీ ఎల్‌డీఏ సిబ్బంది, ఇంజనీర్లతో సహా మొత్తం 16 మంది అధికారుల జాబితాను సిద్ధం చేసి, వారిపై కఠిన చర్యలకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: కోచింగ్‌ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement