కోచింగ్‌ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి | Lucknow Coaching Centre Catches Fire In Aliganj | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి

Jun 22 2026 3:18 PM | Updated on Jun 22 2026 7:06 PM

Lucknow Coaching Centre Catches Fire In Aliganj

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకే ప్రమాదంలో రెండు విషాదాలు చోటు చేసుకోవడం మరింత కలచివేసింది.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

దట్టమైన పొగలు, మంటల మధ్య చిక్కుకుని కొంతమంది విద్యార్థులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు పై అంతస్తుల నుండి దూకే క్రమంలో తొక్కిసలాటలో మరణించారు. బయటకు వచ్చే మార్గం మూసుకుపోవడంతో విద్యార్థులు కిటికీలు, రైలింగ్‌ల నుండి దూకారు. ఈ సమయంలో ఒక యువకుడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న వెంటనే లక్నో చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో 14 అగ్నిమాపక వాహనాలు, ఒక హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఐదారు మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రాథమికంగా 11 మంది మృతి చెందినట్లు సమాచారం. అనంతరం మృతుల సంఖ్య 14కి చేరింది.

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement