భారీ వ్యయంతో నిర్మించిన ఓ ప్రతిష్టాత్మక ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన కొద్ది రోజులకే దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. రూ.4,200 కోట్లతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రారంభించిన మూడు వారాలకే పలు ప్రాంతాల్లో కుంగుదల, పగుళ్లు కనిపించడంతో అధికారులు ప్యాచ్ వర్క్ చేపట్టారు. మరోవైపు.. అనుకోని ఈ పరిస్థితుల్లో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఎక్స్‌ప్రెస్‌వే అంతటా టోల్ వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది.
సుమారు 63 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేను లక్నో–కాన్పూర్ మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నిర్మించారు. జూలై 13న దీన్ని ప్రారంభించగా.. కేవలం 13 రోజులకే జూలై 26న ఉనావ్ జిల్లాలోని 64వ కిలోమీటర్ వద్ద రహదారి కుంగిపోవడం, ఉపరితల పొర కొట్టుకుపోవడం బయటపడ్డాయి.
మళ్లీ మళ్లీ అదే ప్రాంతం
మొదట సమస్య కనిపించిన ప్రాంతంలో పరిమిత స్థాయిలో మరమ్మతులు చేపట్టారు. సుమారు 120 మీటర్ల ప్రాంతంలో సమస్య గుర్తించగా.. దాదాపు 100 మీటర్ల బిటుమెన్ పొరను మరమ్మతు చేశారు. మరో 20 మీటర్ల భాగాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించారు. అయితే కొద్ది కాలానికే సమస్య మళ్లీ తలెత్తడంతో అధికారులు మరింత విస్తృత స్థాయిలో పరిశీలన చేపట్టారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా సుమారు 300 మీటర్ల మేర రహదారిని తవ్వి తిరిగి నిర్మిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్డు పెచ్చులుగా ఊడడం కనిపించడంతో జేసీబీలు, రోలర్లతో పనులు కొనసాగుతున్నాయి.
Pedestal fans being used to dry the patch work after the multiple portions of the Lucknow-kanpur expressway was damaged barely a forthnight after inauguration.#REDMINote17 #vivoS2#Investors_favorite_Stock#Avadhootadattapeetham #vivoseries pic.twitter.com/Y5vdl2gLz1
— Cockroach Janta Party,Kanpur (@CJPknp) August 6, 2026
ఒకే మార్గంలో రెండు వైపులా వాహనాలు
మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దెబ్బతిన్న క్యారేజ్‌వేలను మూసివేయడంతో లక్నో నుంచి కాన్పూర్, కాన్పూర్ నుంచి లక్నో వెళ్లే వాహనాలను ఒకే మార్గంలోకి మళ్లిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనదారులు యూ టర్న్ తీసుకుని వ్యతిరేక దిశలో ప్రయాణించాల్సి వస్తోంది.
120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో డైవర్షన్లు, బ్యారికేడ్లు, మరమ్మతు ప్రాంతాల కారణంగా వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. అయితే అధికారికంగా వేగ పరిమితిని తగ్గించలేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.
టోల్ చెల్లించిన తర్వాతే డైవర్షన్ సమాచారం
మరమ్మతుల కారణంగా మార్గం మార్చాల్సి వస్తున్నప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని పలువురు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. టోల్ చెల్లించిన తర్వాతే రూట్ మార్పు వివరాలు చెబుతున్నారని ఆరోపించారు. కొంతమంది ప్రయాణికులు రోడ్డులో కుంగిన ప్రాంతాల వల్ల వాహనాలు అదుపు తప్పే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో పాత రహదారుల వైపు మళ్లుతున్నట్లు చెప్పారు.
నీరు చొరబడటమే కారణమా?
ప్రాథమిక పరిశీలనలో వర్షపు నీరు రహదారి పొరల్లోకి చేరి కింద ఉన్న మట్టిని బలహీనపరిచినట్లు భావిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. తవ్విన ప్రాంతాల్లో తడి మట్టి కనిపించిందని, దీంతో రోడ్డు పైభాగం కుంగిపోయినట్లు ప్రాథమిక అంచనా వేశారు. రోడ్డు నాణ్యతను ప్రభావితం చేసే అంశాల్లో మట్టి నాణ్యత, పొరల కాంపాక్షన్, డ్రైనేజీ వ్యవస్థ, బిటుమెన్ నాణ్యత కీలకమని నిపుణులు చెబుతున్నారు. కారణాలను పూర్తిగా గుర్తించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు.
నిర్మాణ సంస్థపై చర్యలు
ఈ ఘటనపై నిర్మాణ సంస్థ పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌పై ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు ప్రారంభించింది. సంస్థను “నాన్-పర్ఫార్మర్”గా ప్రకటించే ప్రక్రియ మొదలుపెట్టడంతో పాటు, బాధ్యులపై జరిమానాలు, భవిష్యత్ ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా నిషేధం వంటి చర్యలను పరిశీలిస్తోంది. మరమ్మతు పనుల మొత్తం ఖర్చును నిర్మాణ సంస్థే భరించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. సుమారు రూ.3 కోట్ల వరకు ఈ పనులకు ఖర్చవుతుందని అంచనా వేసింది.
ఇంజినీర్లపై వేటు
ప్రాజెక్టు పర్యవేక్షణలో నిర్లక్ష్యంపై కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు మేనేజర్ వివేక్ కుమార్ గుప్తా, ఇండిపెండెంట్ ఇంజినీర్ టీమ్ లీడర్ సురేంద్ర కుమార్, రెసిడెంట్ ఇంజినీర్ యతేంద్ర కుమార్‌లను ప్రాజెక్టు నుంచి తొలగించారు.
టోల్ వసూళ్లకు బ్రేక్
మరమ్మతులు పూర్తయ్యే వరకు కాన్పూర్–లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ వసూళ్లు నిలిపివేస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. టోల్ ఆదాయ నష్టాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేస్తామని వెల్లడించింది. రూ.4,200 కోట్లతో నిర్మించిన హైస్పీడ్ కారిడార్.. ప్రారంభమైన కొద్ది రోజులకే రిపేర్ల బాట పట్టడం ఇప్పుడు రహదారి నిర్మాణ నాణ్యతపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది.


