‘అవును భాయ్.. నేను సాహెబ్ కాదు.. నేతాజీనే’ | Wanted to become officer, but became protester: Topper shares struggle in JPSC protest | Sakshi
Sakshi News home page

‘అవును భాయ్.. నేను సాహెబ్ కాదు.. నేతాజీనే’

Aug 7 2026 7:01 PM | Updated on Aug 7 2026 7:31 PM

Wanted to become officer, but became protester: Topper shares struggle in JPSC protest

రాంచీ: జార్ఖండ్‌లోని మధ్యతరగతి కుటుంబాల పిల్లల కలల్లో ప్రభుత్వ ఉద్యోగం ప్రధాన లక్ష్యం. జేపీఎస్సీ , జేఎస్సీఎస్సీ  వంటి నియామక పరీక్షల్లో విజయం సాధించి అధికారి కావాలని వేలాది మంది యువత కష్టపడుతున్నారు. అయితే ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్షల రద్దు, నియామకాలలో జాప్యం వంటి ఆరోపణలు వారి కలలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాంటి వారిలో పాకూర్ జిల్లా ఇల్మీ గ్రామానికి చెందిన షహ్‌బాజ్ హుస్సేన్ ఒకరు. చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడైన షహ్‌బాజ్ పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. అనంతరం ఎంఎస్సీ, ఎంఎడ్‌లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయంలో రెండో ర్యాంకు సాధించాడు. అధికారి కావాలనే లక్ష్యంతో రాంచీకి వెళ్లి చిన్న లాడ్జిలో ఉంటూ జేపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కానీ నియామక పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దు వంటి పరిణామాలు తన జీవితాన్ని మార్చేశాయని షహ్‌బాజ్ చెబుతున్నాడు.

నియామకాల్లో పారదర్శకత కోసం జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న షహ్‌బాద్‌ తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు అందరూ తనను ‘సాహెబ్’ అని కాకుండా ‘నేతాజీ వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. అయినప్పటికీ నిజం కోసం గొంతెత్తడంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. నిజం మాట్లాడితే నాయకుడని అంటారంటే..‘అవును భాయ్‌ నేను నేతాజీనే’ అని షహ్‌బాజ్ వ్యాఖ్యానించారు.

ఆర్థిక, మానసిక ఒత్తిడి
రాంచీలోని లాడ్జీల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అద్దె, భోజనం, పుస్తకాలు, ఇతర ఖర్చులను భరించడం కష్టంగా మారిందని షహ్‌బాజ్ తెలిపారు. గ్రామానికి వెళ్లిన ప్రతిసారీ  ఇంకెంతకాలం? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని, వాటికి సమాధానం చెప్పడం బాధాకరంగా ఉంటుందని అన్నారు. అనిశ్చితి, ఒత్తిడి కారణంగా తనతో పాటు సిద్ధమవుతున్న పలువురు స్నేహితులు చదువును మధ్యలోనే వదిలి గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తానూ అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలనిపించినా, తల్లిదండ్రుల నమ్మకం, చిన్ననాటి కలలు గుర్తుకొచ్చి మళ్లీ ముందుకు సాగుతున్నానని చెప్పారు.

పారదర్శక నియామకాలకే డిమాండ్
తాము వీధుల్లోకి రావడం అల్లర్లు సృష్టించడానికి కాదని, కష్టపడి చదివిన అభ్యర్థులకు న్యాయం జరగాలని మాత్రమే కోరుతున్నామని షహ్‌బాజ్ అన్నారు.నియామక పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు సకాలంలో న్యాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అక్రమాలపై విచారణ విశ్వసనీయంగా జరగాలని, వాస్తవాలు వెలుగులోకి రావాలని విద్యార్థులు ఆశిస్తున్నారని షహ్‌బాజ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement