ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చట్టబద్ధమే
దాని లక్ష్యం ఏకాభిప్రాయం సాధించడమే కావాలి
విద్యా రంగంపై వ్యయాన్ని జీడీపీలో 6 శాతానికి పెంచాలి
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టీకరణ
జెన్–జెడ్, జెన్–ఆల్ఫా సభ్యులతో సంభాషణ
ముంబై: ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక చట్టబద్ధమైన సంభాషణ రూపమని, దాని లక్ష్యం విభేదాలు సృష్టించడం కాకుండా ఏకాభిప్రాయం సాధించడం కావాలని ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ చెప్పారు. భారతదేశ విద్యా వ్యవస్థపై యువతరంలో వ్యక్తమవుతున్న ఆందోళనలు ముమ్మాటికీ వాస్తవమైనవేనని పేర్కొన్నారు.
వారి ఆందోళనలో న్యాయం ఉందన్నారు. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 6 శాతానికి పెంచాలని స్పష్టంచేశారు. విద్య అనేది వ్యాపారం కాదని, అది అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించాలని తెలిపారు. విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో సమాజం కూడా తనవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ముంబైలో ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్(ఐఐఎంయూన్)15వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 2,000 మంది జెన్–జెడ్, జెన్–ఆల్ఫా సభ్యులు పాల్గొన్నారు. వారితో మోహన్ భాగవత్ సంభాíÙంచారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనేది ఏకాభిప్రాయాన్ని సాధించే ఒక చక్కటి మార్గమని వివరించారు. విభిన్న అభిప్రాయాలు ఏకమై, చర్చల అనంతరం ఏకాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం లెక్కచేయకపోతే వారు ఆందోళనకు దిగవచ్చని అన్నారు. నేడు జెన్ జెడ్ తరం చేస్తున్న ఫిర్యాదులు నిజమైనవని, వారి నిజాయితీని విశ్వసిస్తున్నానని అన్నారు.
చర్చలే మొదటి అడుగు..
ప్రజలు ఆందోళనకు దిగినప్పుడు చర్చలు ఎల్లప్పుడూ మొదటి అడుగుగా ఉండాలని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఏం చేయాలనేది త ర్వాత ఆలోచించవచ్చని సూచించారు. పెద్దలు చెప్పినదాన్ని ప్రశ్నించకుండా అంగీకరించే మునుపటి తరాలకు భిన్నంగా నేటి జెన్ జెడ్ యువత తమ ప్రశ్నలకు గౌరవంతోపాటు తార్కిక సమాధానాలను కోరుకుంటోందని గుర్తుచేశారు. పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో ఘర్షణలు జరిగినప్పుడు పౌరులు మన ప్రభుత్వానికి, సాయుధ దళాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. అయితే, అటు వంటి పరిస్థితులు ప్రజల మధ్య సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీయకూడదని వెల్లడించారు.
చట్టాలు సమాజాన్ని శాసించవు
స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల సమస్యలు, స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత స్పందించారు. ఆ వర్గానికి చెందిన ప్రజలు భారతీయ సమాజంలో అంతర్భాగమని, వారిని ఆదరించే సంప్రదాయం ఎప్పటినుంచో ఉందని చెప్పారు. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి ఒక వెసులుబాటు మాత్రమే కాదన్నారు. కుటుంబం అంటే సమాజంలో ఒక యూనిట్ అని తెలిపారు. కొత్త వ్యవస్థను సృష్టించకుండా ఇప్పుడున్న వ్యవస్థనే భంగపరిస్తే అది సంఘర్షణకు దారితీయవచ్చని హెచ్చరించారు. చట్టాలు ప్రజలను నిర్దేశించేవిగా కాకుండా సామాజిక ఆమోదాన్ని అనుసరించేవిగా ఉండాలని అన్నారు.
స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి
సోషల్ మీడియాను నిషేధించడం దాని దుష్ప్రభావాలకు పరిష్కారం కాదని, సమాజం స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలని, ఆన్‌లైన్‌లో దేనినైనా నమ్మే ముందు ప్రామాణిక మూలాల నుంచి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని భాగవత్ సూచించారు. ప్రజల వైఖరి మారకపోతే నియమ నిబంధనలు పని చేయవని అన్నారు. నియమాలు, క్రమశిక్షణ అవసరమే గానీ ప్రజల దృక్పథాలు మారినప్పుడే అవి సఫలమవుతాయని చెప్పారు. ప్రజల ఆలోచనా విధానాన్ని మా ర్చడమే ముఖ్యం అని తేల్చిచెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం దురి్వనియోగం అవు తుండడంపై ఆందోళన వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలోని సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండా నమ్మకూడదని హితవు పలికారు.


