అక్రమ ఏఐ కంటెంట్ నియంత్రణే లక్ష్యం
న్యూఢిల్లీ: అక్రమ కృత్రిమ మేధ(ఏఐ) కంటెంట్, డీప్‌ఫేక్‌ల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇతర వేదికలు అక్రమ ఏఐ కంటెంట్‌ను ప్రభుత్వం లేదా కోర్టు నుంచి ఆదేశాలు అందిన మూడు గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు 24 గంటలుగా ఉండేది.
అలాగే కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన చిత్రాలు, వీడియోలు, ఆడియో, టెక్స్‌ట్‌లపై స్పష్టమైన లేబుల్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ ఎక్కడి నుంచి వచి్చందో తెలుసుకునేందుకు వీలు కల్పించే మెటాడేటాను కూడా జోడించాలి.
ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, ఆడియోలు, వ్యక్తుల నకలు చేయడం (ఇంపర్సనేషన్), పిల్లల శోషణ, ఆమోదం లేని చిత్రాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఐటీ చట్టాన్ని సవరించనున్నారు. దీంతోపాటే ఫిర్యాదుల పరిష్కారానికి ఉన్న గడువును 72 గంటల నుంచి 36 గంటలకు తగ్గించారు. నగ్నత్వం, ఇతరుల నకలు వంటి ఫిర్యాదులకు ఈ సమయం రెండంటే రెండే గంటలు. గతంలో ఇది 24 గంటలుగా ఉండేది.


