ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) వల్ల సినీ సెలబ్రిటీలకు... ముఖ్యంగా హీరోయిన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు హీరోయిన్ల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించి నెట్టింట పోస్ట్ చేస్తుండటంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఆ ఫొటోలు, వీడియోలు ఒరిజినల్ అని భ్రమపడేవారు లేక పోలేదు. అందుకే అవి డీప్ ఫేక్ ఫొటోలు అని సదరు స్టార్స్ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రష్మిక మందన్నా, ఆలియా భట్‌తో పాటు పలువురు నటీమణులు ఈ ఇబ్బందులు ఎదుర్కోగా తాజాగా హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు.
ఇటీవల ‘ఎక్స్’లోని ఒక పేజీలో ఆమె మార్ఫింగ్ ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా వీటిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మృణాళ్ ఠాకూర్. ‘‘నా డీప్ ఫేక్ ఫొటోలను సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్ట విరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే వాటిని తొలగించండి... లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ఫొటోలను ఇకపై షేర్ చేసినవారిపై కూడా చర్యలు తప్పవు’’ అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.


