కేరాఫ్ హైదరాబాద్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు భలే జోరుగా జరుగుతున్నాయి. కొన్ని చిత్రాల షూటింగ్స్ స్వదేశంలో జరుగుతుంటే మరికొన్ని చిత్రీకరణలు విదేశాల్లోనూ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా చిత్రీకరణలతో ఆయా సెట్స్‌లో సందడి నెలకొంది. లోకల్‌లోనే షూటింగ్ కాబట్టి ఇంటి నుంచే షూటింగ్‌కి వెళ్లి సందడి సందడిగా షూటింగ్ చేస్తున్నారు స్టార్స్. ఇలా ‘కేరాఫ్ హైదరాబాద్’ అంటూ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, మహేశ్‌బాబు, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, శ్రీవిష్ణు, సాయిదుర్గా తేజ్... తదితర హీరోలు తమ మూవీ షూటింగ్‌లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం...
ఆర్‌ఎఫ్‌సీలో...
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చిరుబాబీ 2’ (వర్కింగ్ టైటిల్). చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నివేత పేతురాజ్, అనశ్వరా రాజన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట బాబీ.
‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బాబీ కొల్లి ‘మెగా 158’లో చిరంజీవిని పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారు. చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత ఫెరోషియస్ లుక్‌లో ప్రజెంట్ చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఈ సినిమా కోసం 12 గంటల పాటు వర్షంలో తెరకెక్కించిన ఓ ఫైట్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలవనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
అజీజ్ నగర్‌లో...
‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో వెంకటేష్–డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కల్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. వెంకటేశ్–కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి ‘వెంకీఅనిల్ 5, ఎన్‌కేఆర్‌ఏఆర్2’ అన్నది వర్కింగ్ టైటిల్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు హీరోయిన్లు, అలాగే చిత్రంలోని నటీనటులు పాల్గొంటుండగా కీలక సీన్స్ తీస్తున్నారట అనిల్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ గా నటించారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది.
కోకాపేటలో...
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘ఫౌజి’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటీనటులు జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘ఫౌజి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి.
‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో ప్రభాస్ కనిపించనున్నారు. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ మూవీని ఈ డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
శంషాబాద్‌లో...
మహేశ్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘వారణాసి’. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో మహేశ్ బాబుతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
ఈ సినిమా కోసం మహేశ్ బాబు ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. ఈ విజువల్ వండర్‌ను చూడటానికి అంతర్జాతీయ స్థాయిలో సగటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ సినిమా విడుదల కానుంది.
అల్యూమినియం ఫ్యాక్టరీలో...
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ సినిమా ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నారట వెంకట్. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘సింగ’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేసింది యూనిట్. ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఒక బలమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారు. గోపీచంద్‌ను పూర్తి యాక్షన్, ఎమోషన్స్ కూడిన పాత్రలో చూపించనున్నారాయన. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ‘సింగ’ సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
ముచ్చింతల్‌లో...
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నానితో పాటు ముఖ్యమైన నటీనటులపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. పీరియాడిక్ యాక్షన్ డ్రామా, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘ది ప్యారడైజ్’లో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు.
ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి విడుదల కాక పోవచ్చని, సెప్టెంబరు 24న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్.
గండిపేటలో...
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.
విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ‘‘19వ సెంచరీ నేపథ్యం కథతో రూపొందుతోన్న చిత్రం ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుంది. ఈ మూవీలోని విజయ్ దేవరకొండ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. సెప్టెంబరు 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.
శంకరపల్లిలో...
వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామజవరగమన’ (2023) చిత్రం ఘన విజయం సాధించింది. ఆ హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజు కాంబోలో ద్వితీయ చిత్రం రూపొందుతోంది.
‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీ విష్ణుతో పాటు ఇతర నటీనటులపై కీలకమైన సీన్స్ తీస్తున్నారు రామ్ అబ్బరాజు. తొలి చిత్రంతో కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజు కాంబినేషన్ రెండో సినిమాతో ఏ మేర నవ్వులు పంచనున్నారో వేచి చూడాలి.
శంకరపల్లిలో...
సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) వంటి విజయవంతమైన సినిమా తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ‘‘తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు సాయి దుర్గాతేజ్. ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్ కథనం, ఉత్కంఠ భరితమైన విజువల్స్, హై యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో గ్రాండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు రోహిత్. చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రోడక్షన్ పనులను ప్రారంభిస్తాం. ఈ సినిమాని డిసెంబరులో విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
పైన పేర్కొన్న చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ్రపాంతాల్లో జరుగుతున్నాయి.
– డేరంగుల జగన్ మోహన్


