ఏపీలో దిగజారిన శాంతిభద్రతలు | YSRCP MPs complain to Union Home Minister Amit Shah | Sakshi
Sakshi News home page

ఏపీలో దిగజారిన శాంతిభద్రతలు

Aug 7 2026 5:21 AM | Updated on Aug 7 2026 5:21 AM

YSRCP MPs complain to Union Home Minister Amit Shah

కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థ, చట్టాల దుర్వినియోగం 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు 

భారతి సిమెంట్స్, ఫ్రెంచ్‌ గ్రూపు వికాట్‌ వంటి మల్టీనేషనల్‌ కంపెనీలను బెదిరిస్తున్నారు 

వాటి కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు 

మెగా డీఎస్సీ పేరుతో ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు 

సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలి 

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రజలను కాపాడాలి 

జగన్‌ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం

లక్షలాదిగా జనం వస్తున్నా పోలీసు రక్షణ కరవు

ప్రజల వద్దకు వెళ్తున్న ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కల్పించట్లేదు 

కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి 

కేంద్ర హోం మంత్రి సానుకూలంగా స్పందించారన్న సుబ్బారెడ్డి 

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, ‘రెడ్‌బుక్‌’ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ లోక్‌సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, డాక్టర్‌ మద్దిల గురుమూర్తి, డాక్టర్‌ గుమ్మా తనూజారాణి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు గురువారం సాయంత్రం ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయ్యారు. మెగా డీఎస్సీ అక్రమాలతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్‌ ప్రమాదంలో పడడం, భారతి సిమెంట్స్, ఫ్రెంచ్‌ గ్రూపు వికాట్‌ వంటి మల్టీనేషనల్‌ కంపెనీలను అధికారమదంతో బెదిరించడం, వాటి కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించడం వంటి కీలక అంశాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కేంద్ర హోం మంత్రి వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

ప్రజా సమస్యలపై జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం తెలిసినా అందుకు అనుగుణంగా పోలీసు రక్షణ కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని వివరించింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన విధంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.. ఎంపీల బృందం లేవనెత్తిన అంశాలివే..

పెచ్చుమీరిన కక్షసాధింపు రాజకీయాలు 
రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని, చట్టాలను టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని ఎంపీలు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, రాజకీయ కక్షసాధింపు కేసులతో వేధిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆదోని మాజీ ఎమ్మెల్యే విరూపాక్షల అరెస్టులు ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత రెండు నెలల్లోనే నాలుగు లాకప్‌ డెత్‌లు చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

నియామకాల్లో భారీ అక్రమాలు 
టీడీపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా అమలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవినీతి, చేతివాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని అమిత్‌షాకు వివరించారు. ఆయా అక్రమాలపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. 

భారతి సిమెంట్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు 
ఫ్రెంచ్‌ గ్రూపు వికాట్, భారతి సిమెంట్స్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వపెద్దల ఆదేశాలతో అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రహదారులను దిగ్బంధించడం, సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అ్రల్టాటెక్‌ సిమెంట్స్‌ విషయంలోనూ ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల కార్యకలాపాలను ఈ విధంగా అడ్డుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. 

గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పించాలి 
గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలని ఎంపీ డాక్టర్‌ గుమ్మ తనూజరాణి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులు పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

వైఎస్‌ జగన్‌కు భద్రతా వైఫల్యంపై ఆందోళన 
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న పర్యటనల్లో ఆయనకు రక్షణ కరవైందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దేవరపల్లి పర్యటనలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చినప్పటికీ, పోలీసుల మోహరింపు నామమాత్రంగానే ఉందని, ఈ ఉదాసీనత వైఖరి వల్ల ప్రతిపక్ష నేతకు తీవ్రమైన భద్రతా ముప్పునకు దారితీసిందని చెప్పారు. గత రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం దుర్బుద్ధితోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. 

కేంద్రం జోక్యం చేసుకోవాలి 
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా, చట్టబద్ధతను కాపాడేలా, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని నిలబెట్టేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోరారు. ఆయా సమస్యలపై తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం లేవనెత్తిన ప్రధానాంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement