భర్త, కుమారుడితో కలిసి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం | Employee attempts suicide with husband and son | Sakshi
Sakshi News home page

భర్త, కుమారుడితో కలిసి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

Aug 7 2026 5:06 AM | Updated on Aug 7 2026 5:06 AM

Employee attempts suicide with husband and son

కడవకొల్లు పీఏసీఎస్‌లో సీఈఓగా పనిచేస్తున్న బాధితురాలు  

సొసైటీలో రూ. 62,38,393 నగదు దుర్వినియోగం నేపథ్యం 

డబ్బు చెల్లించాలని ఆమెపై ఒత్తిళ్లు 

ఆ డబ్బంతా సొసైటీ మాజీ చైర్మన్‌ వాడుకున్నాడని సూసైడ్‌ నోట్‌ 

కృష్ణాజిల్లా ఉయ్యూరులో కలకలం

ఉయ్యూరు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) ఇన్‌చార్జ్‌ కార్యదర్శిగా (సీఈఓ) పనిచేస్తున్న ఒక ఉద్యోగిని భర్త, కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడం కృష్ణాజిల్లా, ఉయ్యూరు సమీపంలోని కడవకొల్లు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. కడవకొల్లు శివారు వీరవల్లి మొఖాసా పరిధిలో గల పీఏసీఎస్‌లో పనిచేస్తున్న హేమ అక్కడికి సమీపంలోని ఉయ్యూరు శివాలయం రోడ్డులో భర్త బాలాజీ, కుమారుడు మేఘాన్ష్  తో కలిసి నివసిస్తున్నారు. 

బుధవారం రాత్రి ఇంట్లో భర్త, కుమారుడితో కలిసి పురుగు మందు తాగారు.  ఫోన్‌ ద్వారా హేమ చెప్పిన సమాచారం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన వారి నివాసానికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురిని వైద్యం నిమిత్తం తొలుత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి,  అటుపై మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సొసైటీ చైర్మన్‌గా పనిచేసిన జొన్నలగడ్డ తాతా నరేష్ బాబే తమ ఆత్మహత్యకు కారణమని సూచిస్తూ హేమ రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాదీనం చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.  

‘నరేష్  బాబుకు రూ.2 లక్షలు ఇచ్చి గుమాస్తాగా ఉద్యోగంలో చేరా. అటు తర్వాత సీఈఓగా పదోన్నతి పొందా.  నరేష్‌ తన వ్యక్తిగత అవసరాలకు సొసైటీ సొమ్ము వాడుకుంటూ ఉండేవాడు. ఇవ్వనని నిరాకరిస్తే బెదిరించేవాడు.  ఒత్తిడి తట్టుకోలేక డిపాజిట్లు క్లోజ్‌ చేసి సొమ్ము అప్పగించేవాళ్లం. అప్పటి నుంచి ఈ విధంగా రూ. 62,38,393 నగదు దుర్వినియోగం అయినట్లు బ్యాంకు అధికారులు గత నెల 17న నిర్వహించిన తనిఖీల్లో తేల్చారు. పది రోజుల్లో సొమ్ము జమ చేయాలని బ్యాంకు అధికారులు ఆదేశించారు. 

నరేష్ ను సొమ్ము విషయమై అడగ్గా తనకు సంబంధం లేదని, నువ్వే కట్టుకో అంటూ బెదిరించాడు. సొమ్ము కట్టలేని పరిస్థితుల్లో పరువు పోతుందనే భయంతో డిపాజిట్‌దారులకు ఎలా న్యాయం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నా’ అని హేమ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  కాగా హేమ ఆరోపణలపై నరేష్ ను సంప్రదించగా తాను బ్యాంకు చైర్మన్‌ పదవి కోల్పోయి రెండున్నరేళ్లు అవుతుందని, నిధులు గోల్‌మాల్‌ వ్యవహారానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎప్పుడూ తనతో కార్యదర్శి హేమ చర్చించలేదని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement