ఖాకీలు తోడుగా టీడీపీ గూండాల దాడి | Chandrababu Govt Atrocities: TDP goons attack with police support | Sakshi
Sakshi News home page

ఖాకీలు తోడుగా టీడీపీ గూండాల దాడి

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

Chandrababu Govt Atrocities: TDP goons attack with police support

డీఎస్సీ బాధితులు, విద్యార్థి నాయకులపై కర్రలతో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు

‘మెగా డీఎస్సీ’ గళాలపై యువగళం పైశాచికం

మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో తప్పుడు సర్టిఫికెట్లతో టీచర్‌ పోస్టుల అమ్మకాలు 

ఈ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు, నిరుద్యోగుల పోరుబాట  

విజయవాడ ‘శాప్‌’ కార్యాలయం వద్ద శాంతియుతంగా భారీ ధర్నా 

అప్పటికే అక్కడ మోహరించిన యువగళం గూండాలతో దాడికి పురిగొల్పిన బాబు సర్కార్‌ 

టీచర్ల ముసుగులో విచక్షణారహితంగా విద్యార్థి నేతలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై గూండాల దాడి  

పచ్చమూకల అరాచకాలకు పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీసులు  

ఆపై విచక్షణారహితంగా లాఠీచార్జ్‌ చేసి, వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఈడ్చి పడేసిన ఖాకీలు 

టీడీపీ గూండాలు, పోలీసుల దాడుల్లో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన పలువురు నేతలు

సాక్షి, అమరావతి: పచ్చమూకల పైశాచికంతో ప్రజాస్వామ్యం మంటగలిసింది. ప్రశాంతంగా జరుగుతున్న నిరసనలపై చంద్రబాబు సర్కారు గూండాలను మోహరించి రాక్షస క్రీడకు తెగబడింది. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు బరి తెగించి అరాచక దాడులకు పురిగొల్పింది. కళ్లెదుట కనిపిస్తున్న మెగా డీఎస్సీ అక్రమాలకు సమాధానం చెప్పలేక, నిజాయతీని నిరూపించుకోవడం చేతగాక.. ప్రశ్నించిన వారిపై ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పింది. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన వారిపై లాఠీచార్జీ జరిపి అక్రమ అరెస్టులకు పాల్పడింది. ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరంలో చంద్రబాబు సర్కారు దమనకాండను చూసి యావత్‌ రాష్ట్రం నిర్ఘాంతపోయింది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్‌ అరాచకాలు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. తప్పు జరుగుతోందని నిలదీస్తే.. అక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. లాఠీలతో తలలు పగలగొడతామనేలా, సంకెళ్లు వేసి నడిరోడ్డుపై ఈడ్చి పడేస్తామనేలా చంద్రబాబు, లోకేశ్‌ నడుపుతున్న గూండారాజ్యంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పరాకాష్టకు చేరింది. మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రశ్నిస్తూ.. బాధితులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా చేపట్టింది. శాంతియుతంగా జరుగుతున్న పోరుబాట కార్యక్రమాన్ని కూటమి సర్కారు కుట్రలతో అడ్డుకుని ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలకు దారితీసేలా రెచ్చగొట్టి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపింది.
  
ఖాకీలు.. గూండాలు కుమ్మక్కు! 
‘శాప్‌’ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తామని వైఎస్సార్‌సీపీ ముందుగానే సమాచారం ఇచ్చింది. అందుకు అనుమతినివ్వాల్సిందిగా పోలీస్‌ శాఖను లిఖిత పూర్వకంగా కోరినా ఇవ్వలేదు. ముందుగా ప్రకటించిన మేరకు శాప్‌ కార్యాలయం వద్దకు దివ్యాంగ నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు ఉదయమే చేరుకున్నాయి. వారంతా కేవలం బ్యానర్‌ పట్టుకుని శాప్‌ గేటు వద్ద బైఠాయించి నినాదాలు మాత్రమే చేశారు. మెగా డీఎస్సీలో నకిలీ సర్టిఫికెట్లతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న టీడీపీ యువగళం ప్రైవేట్‌ గూండాలు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు. కనీసం దివ్యాంగులని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారు. కాళ్లు లేని వారు తెచ్చుకున్న ఊతకర్రలను లాక్కుని వాటితోనూ, రాళ్లతోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నిరుద్యోగులను విచక్షణారహితంగా చావబాదారు. టీడీపీ అనుబంధ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు, టీడీపీ కార్యకర్తలు టీచర్ల ముసుగులో చొరబడి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. దాడులకు పాల్పడుతున్న వారు తాము లోకేశ్‌ అభిమానులమని, యువగళం సభ్యులమని ప్రకటించుకున్నారు. 

వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. పాశవికంగా దాడులు చేస్తున్న వారిని ఏమాత్రం అడ్డుకోలేదు. శాప్‌ కార్యాలయం గేటు వద్ద తిష్ట వేసిన టీడీపీ గూండాలను అక్కడి నుంచి పంపించపోగా వారికి భద్రత కల్పించారు. వారేమీ డీఎస్సీ అభ్యర్ధులు కాదు.. నిరుద్యోగులు అంతకంటే కాదు.. మరి అలాంటి వారిని ఇక్కడ ఎందుకు మోహరించారని పోలీసులను పలువురు ప్రశ్నించినా స్పందించలేదు. గేటు వద్ద గూండాలను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొద్ది సేపటికి వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున శాప్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రైవేటు సైన్యాన్ని పక్కకు పంపేసి పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దొరికినవారిని దొరికినట్లుగా, ఆడమగా అనే తేడా లేకుండా లాఠీలతో చితకబాదారు. అటుగా వచ్చిన ప్రైవేటు స్కూల్‌ బస్సుపై ఎక్కి నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్‌ చేసి అదే బస్సులో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై బైఠాయించిన నేతలను ఈడ్చి పారేశారు. ఈ క్రమంలో జరిగిన లాఠీచార్జిలో  వైఎస్సార్‌సీపీ కార్మి­క విభాగం అధ్యక్షుడు గౌతంరెడ్డి సొమ్మసిల్లి కిందపడిపోయారు. పార్టీ నేతలు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.  

విజయవాడ శాప్‌ కార్యాలయానికి వస్తున్న డీఎస్సీ బా«ధిత అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నిరుద్యోగులను బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పోలీసులు 

పక్కా కుట్ర.. 
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరుబాటను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు పక్కా కుట్ర పన్నింది. అందులో భాగంగానే డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిని ముందురోజే విజయవాడకు రప్పించింది. వారితో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి, వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసింది. వారందరికీ నగరంలోనే రాత్రి బస కల్పించింది. సోమవారం ఉదయమే వారందరినీ శాప్‌ కార్యాలయం వద్దకు తరలించింది. అక్కడ వారికి ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీ­లు వేసి మైకులు, ప్లకార్డులు సమకూర్చింది. వారంతా అసభ్య పదజాలంతో నిరసన కారులను రెచ్చగొట్టేలా అరుపులు, కేకలు వేశారు. అనుకూల మీడియాను మాత్రమే లోపలికి అనుమతించి వారితో మాట్లాడించి ఆ ఛానళ్లలో తప్పుడు ప్రచారం చేయించారు. 

మరోవైపు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు లోపలికి రాకుండా శాప్‌ కార్యాలయం గేట్లకు తాళం వేశారు. గేటు బయట అడ్డంగా టీడీపీ యువగళం బ్యాచ్‌ గూండాలను నిలబెట్టారు. ఇలా పక్కా ప్రణాళికతో వైఎస్సార్‌సీపీ, నిరుద్యోగుల ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగా కుట్రలు పన్నింది.  వైఎస్సార్‌సీపీ ధర్నాకు అనుమతివ్వని చంద్రబాబు సర్కారు.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని శాప్‌ కార్యాలయం ప్రాంగణం లోపలే కూర్చోబెట్టి ప్లకార్డులతో నినాదాలు చేసేందుకు అనుమతించడంలోనే కుట్ర బట్టబయలు అవుతోంది. ఇక వారంతా బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులమనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నిరుద్యోగులపై లాఠీచార్జి చేస్తూ తరిమికొడుతున్నప్పుడు మైకుల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ తాము ముందుగా రూపొందించుకున్న పాటలను ఆలపించారు. 


ఎక్కడికక్కడ ఆంక్షలు.. అక్రమ అరెస్టులు 
కుట్రల్లో భాగంగా చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలను ప్రయోగించింది. శాప్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేసేందుకు వస్తున్న నిరుద్యోగులు, నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంది. ముందుగానే హౌస్‌ అరెస్టులు, అరెస్టులకు పాల్పడింది. శాప్‌ కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారుల్లో భారీగా పోలీసులను మోహరించింది. అడుగడుగునా బారికేడ్లు పెట్టించింది. విజయవాడకు వస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను జిల్లాల సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులను కాజా టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించిన అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు పలువురు నేతలను అరెస్టు చేశారు. బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన్ను బాపట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఏలూరు నుంచి విజయవాడకు వస్తున్న వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు కామిరెడ్డి నానిని కలపర్రు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడంతో పాటు మచిలీపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద పోలీసులను మోహరించారు.  
 

అడ్డుగోడలు బద్ధలు కొట్టుకుని.. 
పోలీసులను మోహరించి చంద్రబాబు సర్కారు విధించిన ఆంక్షలు, అడ్డంకులను లెక్కచేయకుండా వైఎస్సార్‌ సీపీ నేతలు భారీ ఎత్తున తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మొండితోక అరుణ్‌ కుమార్, రమేష్‌ యాదవ్, వరుదు కళ్యాణి, ఇశ్రాయేలు, మురుగుడు హనుమంతరావు, కవురు శ్రీనివాస్, సీహెచ్‌ ఏసురత్నం, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, మల్లాది విష్ణు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, నల్లగట్ల స్వామిదాస్, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పేర్ని కిట్టు, విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర, జగ్గయ్యపేట ఇన్‌చార్జీ తన్నీరు నాగేశ్వరరావు, నందిగామ ఇన్‌చార్జీ మొండితోక జగన్‌మోహన్‌రావు, పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి రాష్ట్ర అధికార ప్రతినిధులు నాగార్జున యాదవ్, ఆరె శ్యామల, పూనూరు గౌతంరెడ్డి, పోతిన మహేష్‌, కాకుమాను రాజశేఖర్, అంజిరెడ్డి, వంగవీటి నరేంద్ర, మాజీ మేయర్‌ భాగ్యలక్ష్మి, పెనమలూరు పార్టీ ఇన్‌చార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి, గిరిజన నేత గుండా సురేంద్ర, పార్టీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలసి శాప్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. డీఎస్సీలో అక్రమ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినదించారు.   

వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు   
లబ్బీపేట (విజయవాడతూర్పు): నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నేతలపై విజయవాడ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. హత్యాయత్నానికి సంబంధించిన 109(1)తోపాటు బీఎన్‌ఎస్‌189, 221, 223, 127, 132, ఎస్సీ,ఎస్టీ యాక్ట్‌ 3(2)(వి) సెక్షన్లను అక్రమంగా బనాయించారు.  17 మందిని నిందితులుగా పేర్కొనగా వారిలో జక్కంపూడి రాజా, పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్‌ ఉన్నారు.  వీరిని 11.30కి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి.. రాత్రి 11 గంటలవరకు అక్కడే ఉంచారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణకుమార్, లీగల్‌ సెల్‌ అధ్యక్షులు మనోహర్‌ రెడ్డి తదితరులు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడిన తర్వాత 41, 151 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు.

రోడ్డుపై పడుకుని ఎమ్మెల్సీల నిరసన..
శాప్‌ కార్యాలయం వద్ద తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, నాయకులు రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిర­సన తెలిపే హక్కును పోలీ­సులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. మెగా డీఎస్సీ–­2025లో ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయని స్పష్టం చేశారు. తప్పుడు క్రీడా ధ్రువపత్రా­లతో ఉద్యో­గాలు పొందినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పేర్ని కిట్టు, తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేసి కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ దౌర్జన్యకాండ కొనసాగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement