ఇదేం దారుణం పవన్ కళ్యాణ్?
కేంద్ర నిఘా వర్గాలేవీ సమాచారం ఇవ్వడం లేదా?
జడలు విప్పిన మైనింగ్ మాఫియా
ధనకొండను పూర్తిగా తవ్వేసిన కూటమి నేతలు
చుట్టూ కొండను తవ్వేసి.. బోడిగుండు చేసేసిన వైనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘దోపిడీకి కాదేదీ అనర్హం’ అన్న చందంగా మారింది కూటమి నేతల అక్రమ వ్యవహారం. అధికారం అండతో మైనింగ్ మాఫియా అవతారం ఎత్తారు. సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారు. బోడి గుండ్లుగా మార్చేస్తున్నారు. చెరువులను చెరబడుతున్నారు. మట్టి, ఇసుక తవ్వి అక్రమంగా తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరుతున్నారు.
ఎవరైనా ప్రశ్నిస్తే అధికారం మాది.. మేం చెప్పిందే వేదమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కూటమి నేతల అక్రమ దందాలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. చివరకు ఆధ్యాత్మిక క్షేత్రాలను సైతం వదలడం లేదంటే ధన దాహానికి ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొడవలి గ్రామంలో ధనకొండకు కూటమి నేతలు గుండు కొట్టేశారు. బౌద్ధక్షేత్రం ఉన్న చారిత్రక తురుక్కుల కొండను కూడా పిండి తొలిచేశారు.
ధనకొండ విధ్వంసం
పిఠాపురం నియోజకవర్గం కొడవలి గ్రామంలో సర్వే నంబర్ 133/1లో ధనకొండ విస్తరించి ఉంది. కొండపై కూటమి మట్టి మాఫియా కన్నుపడింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి కొండను ధ్వంసం చేసింది. పెద్ద పెద్ద యంత్రాలతో కొండను పిండి చేసింది. కొండ చుట్టూ తవ్వకాలు చేపట్టింది. పైకి చూసేందుకు కొండలా కనిపిస్తున్నా.. చుట్టూ తవ్వకాలతో గుల్ల చేసేసింది.

ఎంతగా అంటే సుమారు 40 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇక్కడ కొండ ఉండేదా? అన్న భావన కలుగుతోందంటే ఎంతగా విధ్వంసం సృష్టించారో అర్థమవుతుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. వేల లారీలు, టిప్పర్ల మట్టి, రాళ్లు తెగనమ్ముకున్నారు. తద్వారా రూ.10 కోట్లకు పైగా కూటమి నేతలు కొల్లగొట్టినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పచ్చదనంతో కనిపించిన ఈ ప్రాంతం ఇప్పడు మట్టి దిబ్బగా మారిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కొండను తొలిచేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెబుతున్నారు.
చారిత్రక తురుక్కుల కొండ పిండి
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో బౌద్ధక్షేత్రం కలిగి ఉన్న చారిత్రక తురుక్కుల కొండను కూటమి మాఫియా పిండి చేసింది. కొండ చుట్టూ మట్టి తవ్వకాలు చేపట్టి కొండను తొలిచేసింది. ఎంతగా అంటే కొండపైన ఉన్న బౌద్ధ స్తూపాలు కుంగిపోయే పరిస్థితి తీసుకువచి్చంది. కొండ వెనుక భాగంలో సుమారు వంద అడుగుల మేర తవ్వకాలు జరిపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) రక్షణలో ఉన్న కొండను సైతం వదల్లేదంటే కూటమి మట్టి మాఫియా ఎంతకు తెగిస్తోందో అర్థమవుతుంది.
అనుమతి కొంత.. తవ్వేది కొండంత
మట్టి తవ్వి తరలించేందుకు కొంత మేర మాత్రమే అనుమతులు పొందుతున్నారు. అనంతరం ఆ అనుమతుల పేరుతో రెచి్చపోతున్నారు. అనుమతులు ఎకరం విస్తీర్ణానికి తీసుకుంటే.. వంద ఎకరాల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మాఫియా సభ్యులు ఒక ధర నిర్ణయించి మామూళ్లు ముట్టజెపుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికే అక్రమంగా తవ్వేసి కొండలను పిండి చేసిన మట్టి మాఫియా ఇటీవల తిరిగి తవ్వకాలకు అనుమతులు కోరుతూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సైతం ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాలను సైతం సేకరించారు. ఇక అనుమతులు ఇవ్వడమే తరువాయి అన్నట్లు ప్రక్రియ వేగవంతమైంది.
వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళనతో ఆగిన అనుమతులు
పిఠాపురం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా ఆగడాలపై వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. సహజ సంపదను దోపిడీ చేస్తున్నా పాలకులు, అధికారులు ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నిలదీశారు. చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. దాంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మైనింగ్ అనుమతులను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా, మైనింగ్ మాఫియా జడలు విప్పినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. మట్టి మాఫియాలో కూటమి నేతలంతా ఉండబట్టే ఆయనేమీ మాట్లాడడం లేదన్న విమర్శలున్నాయి.


