విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారికి కాపలాగా ఉన్న టీడీపీ గూండాలు
నాడు ‘సాక్షి’ కార్యాలయంపై దాడులు
నేడు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దౌర్జన్యాలు
అప్పుడు.. ఇప్పుడు వచ్చింది ఆ గూండాలే
దారిన పోయేవాళ్లమంటూ పచ్చి అబద్ధాలు
బయటపడ్డ లోకేశ్ ప్రైవేటు సైన్యం బాగోతం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తనయుడు లోకేశ్ రౌడీలు, గూండాలతో ఓ ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకున్నారు. తమ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ, వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలపైన, తమ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలపైనా వారిని ప్రయోగిస్తున్నారు. మెగా డీఎస్సీలో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నిరుద్యోగులు శాప్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమాలను అడ్డుకున్న ఆ బ్యాచ్, గతంలో సాక్షి పత్రిక కార్యాలయంపై దాడులకు తెగబడ్డ దుండగులు ఒక్కరేనని తేలింది.
నాడు విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంపై దాడిచేసిన టీడీపీ రౌడీలు నేమ్ బోర్డును సైతం పెకిలించారు. వారే ఇప్పుడు డీఎస్సీపై జరుగుతున్న ఆందోళనలను అడ్డుకోవడానికి రంగంలోకి దిగారు. సాక్షిపై జరిగిన దాడులకు సంబంధించిన ఫొటోల్లోను, డీఎస్సీ నిరసనలపై జరిగిన దాడులకు సంబంధించిన ఫొటోల్లోను వారు స్పష్టంగా కనిపిస్తున్నారు.

దారినపోయే వాళ్లమంటూ బుకాయింపు
ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులతో గొడవ పెట్టుకుని, ఘర్షణకు పాల్పడ్డారు. ‘అసలు మీరు ఎవరు? మీకు, ఈ ఆందోళన కార్యక్రమానికి ఏమిటి సంబంధం? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని శాప్ కార్యాలయం గేటు వద్ద సాక్షి ప్రతినిధి వారిని ప్రశ్నించారు. అయితే తాము రోడ్డు మీద వెళుతూ శాప్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనను చూసి వచ్చామని, తమ అభిమాన నాయకుడు లోకేశ్‌ను కొందరు దూషిస్తుంటే చూసి తట్టుకోలేక అడ్డుకున్నామని వారు బుకాయించారు.

కానీ అంతకుముందే ఈ గూండాలు డీఎస్సీ అభ్యర్థులను స్టేడియం గేటు నుంచి సురక్షితంగా లోపలికి పంపిస్తూ కనిపించారు. పోలీసులు వీరికి రాచమర్యాదలు చేశారు. సాక్షాత్తు షాడో పోలీసుల్లా ప్రతిచోటా లా అండ్ ఆర్డర్‌ను వారే తమ చేతుల్లోకి తీసుకున్నారు. వారు అనుకున్నది పూర్తయిన తరువాత.. అప్పటికే వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకోవడం చూసి, పోలీసులే దగ్గరుండి ఈ ప్రైవేటు గూండాలందరినీ జాగ్రత్తగా అక్కడి నుంచి పంపించేశారు.


