పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరం పేరుతో పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు నిలదీసింది. పోలీస్ యూనిఫాం వేసుకుని కౌన్సిలింగ్ చేయటమంటే, అది ప్రజలను బెదిరించడం, భయభ్రాంతులను గురి చేయడమేనని స్పష్టం చేసింది.
సివిల్ వివాదాలతో అసలు పోలీసులకు సంబంధం ఏంటని నిలదీసింది. ఇలాంటివి చూస్తూ వదిలేస్తే పోలీసులు రేపు సమాంతర కోర్టులు నిర్వహించేందుకు కూడా వెనకాడరని పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు ఏ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి స్టేషన్లకు పిలిపిస్తున్నారంటూ విశాఖ పోలీసులను నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదికను ముందు ఉంచాలని విశాఖ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.


