గోశాల స్థలంలో జోక్యం చేసుకోవద్దు | High Court orders Tuda officials | Sakshi
Sakshi News home page

గోశాల స్థలంలో జోక్యం చేసుకోవద్దు

Sep 12 2026 3:01 AM | Updated on Sep 12 2026 3:01 AM

High Court orders Tuda officials

అందులోని నిర్మాణాలను కూల్చొద్దు 

తుడా అధికారులకు హైకోర్టు ఆదేశం 

మధ్యంతర ఉత్తర్వులు జారీ 

సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా, తిరుచానూరులోని శ్రీరాధాగోవింద గోరక్ష సమితి 3 ఎకరాల స్థలంలోని నిర్మాణాలను రహదారి విస్తరణ పేరుతో కూల్చేందుకు అధికారులు ప్రయత్నింస్తుండటంపై హైకోర్టు స్పందించింది. తిరుచానూరు సర్వేనంబరు 575/1లోని గోరక్ష సమితికి చెందిన భూమిలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా), ఆర్డీవో తదితరులను హైకోర్టు ఆదేశించింది. అక్కడ నిర్మాణాల జోలికి కూడా వెళ్లొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 

తుడా అధికారుల తీరుపై అత్యవసర పిటిషన్‌... 
తిరుచానూరు గోరక్ష సమితి స్థలంలో తుడా అధికారులు జోక్యం చేసుకుంటూ, అక్కడి నిర్మాణాలను కూల్చేసేందుకు యత్నిస్తున్నారంటూ శ్రీరాధాగోవింద గోరక్ష సమితికి చెందిన ఎ.గాయత్రి హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. 

తిరుచానూరు సర్వే నంబరు 575/1లో గోశాల నిర్మాణం కోసం మూడు ఎకరాలను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్‌ 2001లో ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.అప్పటి నుంచి ఆ స్థలం గోశాల స్వాదీనంలో ఉందన్నారు. రహదారి విస్తరణ పేరుతో తుడాకు చెందిన అధికారులు, స్థానిక అధికారులతో కలిసి అక్కడి నిర్మాణాలను కూల్చివేసేందుకు యత్నిస్తున్నారని ఉమేష్‌ చంద్ర హైకోర్టు దృష్టికి తీసుకొచ్చా­రు. అంతేకాక కూల్చివేతలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. వాదనలు విన్న గోశాలకు చెందిన స్థలంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరారు. 

తుడా తరపు న్యాయవాది కేకే దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అభ్యంతరాలు కోరుతూ తుడా ప్రకటించిన రహదారి అభివృద్ధి ప్రణాళికలో సర్వే నంబరు 575/1 లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి, సర్వే నంబరు 575/1లోని గోశాలకు సంబంధించిన స్థలం విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement