ఇచ్చింది రెండు.. మెలికెలు మెండు.. | Andhra Pradesh Government orders granting two DAs | Sakshi
Sakshi News home page

ఇచ్చింది రెండు.. మెలికెలు మెండు..

Sep 12 2026 2:56 AM | Updated on Sep 12 2026 2:56 AM

Andhra Pradesh Government orders granting two DAs

26 నెలలు ఆపి.. ఇప్పుడు రెండు డీఏలుఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఇప్పుడు ఇచ్చేది డీఏలు మాత్రమే

బకాయిల కోసం వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే..

అప్పట్నుంచి కూడా 2028 జూలై వరకు వాయిదాల్లో ఇస్తామన్న సర్కారు

ఓపీఎస్‌ ఉద్యోగుల బకాయిలు జీపీఎఫ్‌లోకే.. చేతికి పైసా రాదు

పెన్షనర్లకూ వాయిదాల తిప్పలే

2025 జూలై నుంచి గడువు తీరిన డీఏల ఊసే లేదు

సాక్షి, అమరావతి: ఉద్యోగుల పోరాటానికి దిగి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు రెండు డీఏలు మంజూరు చేసినా, బకాయిల చెల్లింపును మాత్రం 2027, 2028 సంవత్సరాలకు వాయిదా వేసింది. పెరిగిన డీఏ అక్టోబర్‌లో చేతికి వస్తుంది కానీ ఇన్నాళ్లూ ఆపిన బకాయిల కోసం మాత్రం నెలల తరబడి ఎదురుచూడాల్సిందే. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ శుక్రవారం నాలుగు జీవోలు జారీ చేసింది. 2024 జూలై 1 నుంచి 2.73 శాతం, 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో డీఏ 37.31 శాతం నుంచి 41.86 శాతానికి చేరింది. పెన్షనర్లకూ ఇవే రేట్లలో డీఆర్‌ పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన డీఏ, డీఆర్‌ను సెప్టెంబర్‌ జీతం, పెన్షన్‌తో కలిపి ఇవ్వనున్నారు. 2025 జూలై నుంచి గడువు తీరిన డీఏల ఊసే లేదు.

26 నెలల నిరీక్షణ
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడువు తీరిన తొలి డీఏ 2024 జూలై 1 నాటిది. దాన్ని ఇవ్వడానికి సర్కారుకు 26 నెలలు పట్టింది. 2025 జనవరి డీఏకు మరో 20 నెలలు పట్టింది. ఇంతకాలం ఆపిన మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా ఒక్కో డీఏ బకాయిలను నాలుగు విడతలుగా, రెండు డీఏలకు కలిపి మొత్తం ఎనిమిది విడతల్లో ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి విడత 2027 ఏప్రిల్‌లో మొదలై, చివరి విడత 2028 జూలైలో ముగుస్తుంది. మొదటి డీఏకు సంబంధించి 2024 జూలై నుంచి 2026 ఆగస్టు వరకు 26 నెలల బకాయిలు ఉన్నాయి. 

ఇందులో తొలి విడతగా 10 శాతం మాత్రమే 2027 ఏప్రిల్‌లో ఇస్తారు. మిగతా 90 శాతాన్ని 30 శాతం చొప్పున మూడు విడతల్లో 2027 జూన్, ఆగస్టు, అక్టోబర్‌ నెలల్లో ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండో డీఏ పరిస్థితి ఇంకా దారుణం. 2025 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు 20 నెలల బకాయిల్లో తొలి విడత 10 శాతం 2028 జనవరిలో ఇస్తామంది. మిగతా 90 శాతాన్ని 30 శాతం చొప్పున 2028 మార్చి, మే, జూలై నెలల్లో ఇస్తామని తెలిపింది. అంటే 2025 జనవరిలో అందాల్సిన డబ్బు పూర్తిగా చేతికి రావాలంటే 2028 జూలై దాకా ఆగాల్సిందే.

ఓపీఎస్‌ ఉద్యోగులకు చేతికి పైసా రాదు
పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)లోని ఉద్యోగులకు రెండు డీఏల బకాయిలూ, ఎనిమిది విడతలూ జీపీఎఫ్‌ ఖాతాలోకే వెళ్తాయి. రిటైరయ్యే వారు మినహా మిగతా వారికి నగదుగా ఒక్క రూపాయి కూడా అందదు. సీపీఎస్‌ ఉద్యోగులకు ఒక్కో డీఏలో తొలి విడత 10 శాతం బకాయిలు ప్రభుత్వ వాటాతో కలిపి వారి సీపీఎస్‌ పెన్షన్‌ ఖాతా (ప్రాన్‌)లోకి వెళ్తాయి. అంటే ఆ మొత్తం వెంటనే చేతికి రాదు. మిగతా మూడు విడతల 90 శాతం మాత్రమే నగదుగా ఇస్తారు.

రిటైర్‌ అయినవారికి, త్వరలో రిటైర్‌ కానున్న వారికి మాత్రం బకాయిలను జీపీఎఫ్‌లో వేయకుండా నగదుగా ఇస్తారు. 2024 జూలై నుంచి 2027 ఏప్రిల్‌ మధ్య రిటైరయ్యే వారికి మొదటి డీఏ బకాయిలు నగదుగా అందుతాయి. 2025 జనవరి నుంచి 2027 డిసెంబర్‌ మధ్య రిటైరయ్యేవారికి రెండో డీఏ బకాయి­లు నగదుగా అందుతాయి. అయితే ఈ నగదు ఏ నెల­లో ఇస్తారో జీవోలో చెప్పలేదు. ఇప్పటికే చనిపోయిన ఉద్యో­గుల బకాయిలను వారి కుటుంబ సభ్యులకు ఇస్తారు.

పెన్షనర్లకూ వాయిదాలే
పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకూ ప్రభుత్వం ఇదే ఎనిమిది విడతల షెడ్యూల్‌ పెట్టింది. వయసు మీద పడిన పెన్షనర్లు డీఆర్‌ బకాయిల కోసం 2028 జూలై వరకు ఎదురుచూడాల్సిందే. అదే సమయంలో గడువు తీరిన డీఏల ప్రస్తావనే చేయలేదు. 2025 జనవరి డీఏ బకాయిల గురించే పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement