మద్యం షాపులు మళ్లీ టీడీపీ సిండికేట్‌కే | Liquor shops are back in the hands of the TDP syndicate | Sakshi
Sakshi News home page

మద్యం షాపులు మళ్లీ టీడీపీ సిండికేట్‌కే

Sep 12 2026 2:34 AM | Updated on Sep 12 2026 2:34 AM

Liquor shops are back in the hands of the TDP syndicate

పాత మద్యం దుకాణాలకే రెన్యువల్‌  

రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలు మరో ఏడాది కొనసాగింపు  

ఎక్సైజ్‌ పాలసీ ప్రకటించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం షాపులను మళ్లీ టీడీపీ సిండికేట్‌కే చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం దుకాణాలను మరో ఏడాదిపాటు కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి ఎక్సైజ్‌ షాప్స్‌ పాలసీని శుక్రవారం ప్రకటించింది. అవసరమైతే ఇదే పద్ధతిని మరో ఏడాది కొనసాగించేలా వెసులుబాటు కల్పించింది. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను దక్కించుకోవడంలో టీడీపీ సిండికేట్‌ దందా సాగించిన విషయం తెలిసిందే. మద్యం షాపులను ఎవరూరు దక్కించుకున్నా.. వాటిని టీడీపీ సిండికేట్‌ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ మద్యం షాపులకు వేలం నిర్వహిస్తే వేరొకరు పోటీకి వచ్చే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం టీడీపీ వాళ్లకే కొనసాగించేలా పాత షాపులను మరో ఏడాదిపాటు రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఇవ్వడం గమనార్హం.   

లైసెన్సుల రెన్యువల్‌కు 38 శాతం రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను  
నూతన ఎక్సైజ్‌ పాలసీపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది అక్టోబర్‌ 1నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఏడాది పాటు కొత్త పాలసీ అమలులో ఉంటుంది. మొత్తం 3,736 దుకాణాల్లో 3,396 ఓపెన్‌ కేటగిరీలో ఉండగా, 340 దుకాణాలను గీత కులాలకు కేటాయించారు. ప్రస్తుత లైసెన్సుదారులకు తమ దుకాణాల లైసెన్సులను మరో ఏడాది పాటు రెన్యువల్‌ చేసుకునేందుకు వార్షిక రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నులో 38 శాతానికి సమానమైన రెన్యువల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నును చెల్లించాలి. దీంతోపాటు వార్షిక రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను, వర్తించే పర్మిట్‌ రూమ్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. 

రెన్యువల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నును మొదటి విడత వార్షిక రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నుతో కలిపి ఒకేసారి చెల్లించాలి. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఓపెన్‌ కేటగిరీ దుకాణాలకు రెన్యువల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను రూ.23 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.27.2 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35.5 లక్షలుగా నిర్ణయించారు. గీత కులాలకు కేటాయించిన దుకాణాలకు ఇవే కేటగిరీల్లో వరుసగా రూ.11.5 లక్షలు, రూ.13.6 లక్షలు, రూ.17.8 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుత లైసెన్సుదారులు రెన్యువల్‌ కోసం రూ.35 వేల ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. ఎవరైనా లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోకపోతే ఆ దుకాణాన్ని కొత్తగా డ్రా ఆఫ్‌ లాట్స్‌ ద్వారా కేటాయిస్తారు. 

కొత్తగా డ్రా ద్వారా కేటాయించిన దుకాణాలకు రెన్యువల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను వర్తించదు. అమ్ముడుపోని, కేటాయించని దుకాణాలను అవసరాన్ని బట్టి తిరిగి నోటిఫై చేయడం, ప్రాంతాల వారీగా హేతుబద్దీకరించడం, మార్చడం వంటి చర్యలు చేపట్టేందుకు కూడా పాలసీలో అవకాశం కల్పించారు. మద్యం సరఫరా వ్యవస్థపై డిజిటల్‌ నిఘా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి నగరంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి ఉండదు. హైవేలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement