చెత్త స్టోరేజీ సామర్థ్యం పెంపు
‘గార్బేజ్ డిస్పోజల్ సిస్టం’కు రూపకల్పన
ఆర్‌డీఎస్‌వో తుది ఆమోదం అనంతరం అమలుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: ‘రైళ్లు శుభ్రంగా ఉండటం లేదు. బోగీల్లోనే చెత్తా చెదారం పేరుకుపోతోంది.’ దేశంలో రైల్వే ప్రయాణికుల ప్రధాన ఫిర్యాదు ఇదే. జనరల్ కోచ్‌లే కాదు స్లీపర్, ఏసీ కోచ్‌లలో కూడా ఇదే సమస్య వేధిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ సరికొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. రైళ్లను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ‘గార్బేజ్ డిస్పోజల్ సిస్టం’ను రూపొందించింది.
ఝాన్సీలోని ‘రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్’ ఈ సరికొత్త మౌలిక వ్యవస్థను డిజైన్ చేసింది. రైళ్లలో చెత్త స్టోరేజీ సామర్థ్యాన్ని అమాంతం పెంచేందుకు ఈ సరికొత్త మౌలిక వ్యవస్థ దోహదపడనుంది. రైల్వే డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌వో) ఈ డిజైన్‌ను సూత్రప్రాయంగా ఆమోదించింది. మరికొన్ని పరీక్షల అనంతరం త్వరలోనే తుది ఆమోదం అనంతరం రైళ్లలో ప్రవేశపెట్టనున్న గార్బేజ్ డిస్పోజల్ సిస్టం ఇలా ఉండనుంది.
చెత్త నిర్వహణ సామర్థ్యం పెంపు
ప్రస్తుతం రైళ్లలో చెత్త నిర్వహణ అత్యంత పరిమితంగా ఉంది. కోచ్‌లలో ఉండే డస్ట్‌బిన్‌కు కేవలం 18 లీటర్ల నిర్వహణ సామర్థ్యం మాత్రమే ఉంది. దాంతో కొద్దిసేపటికే నిండిపోయి చెత్తా చెదారం అంతా రైల్ కోచ్‌లోనేపడి అపరిశుభ్రంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం ఏకంగా 367.4 లీటర్ల నిర్వహణ సామర్థ్యంతో సరికొత్త స్టోరేజ్ వ్యవస్థను రూపొందించారు. అందుకోసం ఎల్‌హెచ్‌బీ విధానంలో రూపొందిస్తున్న కోచ్‌ల అడుగు భాగంలో స్టోరేజ్ కంటైనర్‌ను ఏర్పాటు చేస్తారు.
ప్రతి కోచ్‌లో రెండు వైపులా టాయిలెట్ల వద్ద ఉండే డ్రాప్ బాక్స్‌లలో చెత్తను వేయగానే కిందనున్న స్టోరేజ్ కంటైనర్‌లోకి చేరుతుంది. రైలు గమ్యస్థానానికి చేరిన తరువాత కంటైనర్ నుంచి తొలగించి శుభ్ర పరుస్తారు. ఈ కంటైనర్‌ను 3.10 ట్యాపర్ డిజైన్‌తో స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందించారు. ఆర్‌డీఎస్‌వో తుది ఆమోదం లభించిన తరువాత ఎల్‌హెచ్‌బీ విధానంలో రూపొందిస్తున్న రైల్ కోచ్‌లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.


