జయపూర్ పరిధిలోని గోవింద్ పురాలో భార్యాబిడ్డల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించాడో వ్యక్తి. ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ దాడిలో 40 ఏళ్ల గీతా ఝా, ఆమె ముగ్గురు కుమార్తెలు నందిని, గిరీష, రాధిక (17-23 ఏళ్లు) మృతి చెందారు. మృతురాలి భర్త, పిల్లల తండ్రి రాహుల్ ఝాగా నిందితుడిగా గుర్తించారు. కుటుంబంలో చెలరేగిన తీవ్రమైన వివాదాలే ఈ దారుణ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!
వెలుగులోకి వచ్చిందిలా
శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఎలాంటి కదలికలు లేకపోవడంతో పొరుగువారు, బంధువులకు అనుమానం వచ్చి చూడటంతో ఈ ఘోరం బయటపడింది.మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడి 85 ఏళ్ల తండ్రి ఇంట్లోనే ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు, డాగ్ స్క్వాడ్ ప్రదేశాన్ని పరిశీలించి రక్త నమూనాలు, ఆధారాలను సేకరించాయి. దాడికి ఉపయోగించిన ఇటుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసిపి (వెస్ట్) ప్రశాంత్ కిరణ్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నగర సరిహద్దుల్లో తనిఖీలు తీవ్రతరం చేసి, రాహుల్ ఝా ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
ఇదీ చదవండి: రూ. 100 కోట్ల బ్లాక్ బ్లస్టర్ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి?


