బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో మన దేశానికి పెద్దగా ఒరిగేదేం లేదని.. ఒకవేళ నిజంగా ప్రయోజనం ఉంటే అదేంటో చెప్పాలని కేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సవాల్ విసిరారు. అయితే దీనికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. అదే టైంలో.. కాంగ్రెస్ నుంచే కౌంటర్ రియాక్షన్ వచ్చింది.
చిదంబరం వేసిన ప్రశ్నలకు సొంత పార్టీకే చెందిన మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బదులిచ్చారు. ఆ ప్రయోజనాలు ఇవేనంటూ వివరించారు. ఈ వేదిక భారత్ దౌత్యపరమైన ప్రభావాన్ని, ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల సామర్థ్యాన్ని చాటుతుందని పేర్కొన్నారు.
‘గ్లోబల్ సౌత్‌కు కీలక వేదిక’
ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ముందు మాట్లాడిన థరూర్.. గ్లోబల్ సౌత్‌కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పారు. విస్తరించిన బ్రిక్స్‌లో 11 దేశాలు ఉన్నాయని, ఇవి ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. ఇలాంటి దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు.
‘ప్రపంచ వేదికపై భారత్ దౌత్య బలం’
బ్రిక్స్ సదస్సుకు పలువురు దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు హాజరవుతుండటం భారత్‌కు ప్రతిష్టాత్మక విషయమని థరూర్ అన్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ ‘డిప్లొమాటిక్ కన్వీనింగ్ పవర్’ను చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్‌లో అన్నీ సానుకూల అంశాలే లేవని కూడా స్పష్టం చేశారు.
ఇదీ సవాల్.. ఏకాభిప్రాయం కష్టమే!
విభిన్న దేశాలు, విభిన్న ప్రయోజనాలు ఉన్నందున కీలక అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం బ్రిక్స్‌లో పెద్ద సవాలని థరూర్ అన్నారు. మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్-యూఏఈ మధ్య విభేదాల కారణంగా ఉమ్మడి ప్రకటన వెలువడలేదని గుర్తుచేశారు. దీంతో భారత్ చైర్ ప్రకటనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా సదస్సులోనూ అలాంటి పరిస్థితి వస్తే అది బ్రిక్స్ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందన్నారు.
చిదంబరం ఏమన్నారు?
ఇటీవల చిదంబరం మాట్లాడుతూ.. గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల నుంచి భారత్‌కు వచ్చిన స్పష్టమైన ప్రయోజనాలు తనకు కనిపించలేదన్నారు. బ్రిక్స్‌తో పాటు ఎస్‌సీఓ, జీ20, క్వాడ్‌లో భారత్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. వాటి నుంచి దేశానికి వస్తున్న స్పష్టమైన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
వాణిజ్య లోటుపైనా థరూర్ ఆందోళన
మరోవైపు బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్యం పెరుగుతున్నప్పటికీ.. అది పూర్తిగా భారత్‌కు అనుకూలంగా లేదని థరూర్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు తగ్గుతుండగా.. దిగుమతులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అంటే బ్రిక్స్ వేదిక భారత్‌కు దౌత్యపరంగా ప్రాధాన్యమైనదే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా మరింత సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నది థరూర్ వ్యాఖ్యల సారాంశం.
ఇదీ చదవండి: పార్టీ కంటే పిల్లనిచ్చిన మామే ఎక్కువయ్యాడా?


