ట్రంప్ సర్కార్ మరో షాక్‌.. H-1Bపై కొత్త రూల్‌! | US Donald Trump moves to end 60-day H-1B grace period | Sakshi
Sakshi News home page

ట్రంప్ సర్కార్ మరో షాక్‌.. H-1Bపై కొత్త రూల్‌!

Sep 11 2026 7:21 AM | Updated on Sep 11 2026 7:34 AM

US Donald Trump moves to end 60-day H-1B grace period

వాషింగ్టన్‌: అమెరికాలో ఇమిగ్రేషన్‌ చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. హెచ్‌–1బీ వీసా సహా కొన్ని వర్క్‌ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు హఠాత్తుగా ఉద్యోగం కోల్పోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ను తొలగించాలని ప్రతిపాదించింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఉండి కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే అవకాశం భారీగా తగ్గిపోనుంది. దీంతో అమెరికా టెక్నాలజీ, సేవా రంగాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది.

ప్రస్తుతం H-1B వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఈ సమయంలో మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించడంతో పాటు, కొత్త యజమాని ద్వారా వీసా స్పాన్సర్‌షిప్‌ ప్రక్రియను ప్రారంభించుకోవచ్చు. ఉద్యోగం దొరకకపోతే అమెరికా నుంచి వెళ్లేందుకు ఇల్లు, పిల్లల చదువులు, ఇతర వ్యక్తిగత వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు కూడా ఈ గడువు ఉపయోగపడుతుంది. ఈ 60 రోజుల వెసులుబాటు 2017 నుంచి అమల్లో ఉంది.

భారతీయులపైనే ఎఫెక్ట్‌.. 
అయితే, ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఉద్యోగం ముగిసిన తర్వాత ప్రస్తుతం లభిస్తున్న ఈ 60 రోజుల సమయం ఉండకపోవచ్చు. అంటే లేఆఫ్‌ లేదా ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు అమెరికాలో కొనసాగేందుకు మార్గాలు చాలా పరిమితమవుతాయి. కొత్త ఉద్యోగం, వీసా స్పాన్సర్‌ కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామం ముఖ్యంగా భారతీయ టెక్‌ ఉద్యోగులను కలవరపెడుతోంది. అమెరికా టెక్నాలజీ, ఐటీ, కన్సల్టింగ్‌ రంగాల్లో భారతీయ నిపుణుల సంఖ్య భారీగా ఉంది. పలు ఐటీ సంస్థలు H-1B వీసాలకు ప్రధాన స్పాన్సర్లుగా ఉన్నాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయే భారతీయ ప్రొఫెషనల్స్‌కు కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయం మరింత కీలకంగా మారనుంది.

అన్నీ వీసాలపై ఇలా.. 
ఇమ్మిగ్రేషన్‌ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్రేస్‌ పీరియడ్‌ తొలగిస్తే విదేశీ ఉద్యోగుల లేఆఫ్‌, ఆఫ్‌బోర్డింగ్‌ ప్రక్రియలను కంపెనీలు మరింత వేగంగా నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు అమెరికా ప్రభుత్వం మాత్రం విదేశీ ఉద్యోగుల స్థానంలో సమాన అర్హతలున్న అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈ ప్రతిపాదన H-1Bకే పరిమితం కాదు. కొన్ని L-1, O-1, TN, E-1, E-2 కేటగిరీలతో పాటు సింగపూర్‌, చిలీకి చెందిన H-1B1 వీసాదారులు, ఆస్ట్రేలియా నుంచి వచ్చే E-3 ప్రత్యేక నైపుణ్య ఉద్యోగులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికిప్పుడు ఇది తుది నిర్ణయం కాదు. ప్రతిపాదనపై రెండు నెలల పాటు ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం ట్రంప్‌ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ప్రతిపాదనకు ఆమోదం లభించి అమల్లోకి వస్తే.. ఉద్యోగం పోయినా రెండు నెలల గడువు ఉందనే ధైర్యంతో ఉన్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు అమెరికాలో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశముంది.
ఇదీ చదవండి: భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్‌.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement