ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.
మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలు
పుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.
President Putin arrives in New Delhi:
Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.
(3:54 am, Delhi time)
NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026
రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్‌లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్
పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.
పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్‌కు సవాల్
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు.
ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.
విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యం
బ్రిక్స్‌లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.
ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.
రెండు రోజులపాటు కీలక భేటీలు
భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.
బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్‌తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్‌ల్యాండ్


