సాగర్ మంథన్ రీసెర్చ్ వెసల్
సముద్ర గర్భంలోనూ భారత్ నిఘా
సాగర్ మంథన్ పరిశోధన నౌక జల ప్రవేశం
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోసం ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ నిర్మాణం
కీల్ వేసిన 5 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న తొలి నౌక
సముద్ర గర్భంలో 6 కి.మీ. లోతున సర్వే చేయగల సామర్థ్యం
ఆన్‌బోర్డ్ డేటా విశ్లేషణ చేయగల ఏకైక వెసల్
రూ.840 కోట్లతో 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు, అపారమైన వనరులకు నిలయమైన కడలి గర్భంలో దాగి ఉన్న విశేషాలతోపాటు వాతావరణ గుట్టును విప్పేందుకు భారతదేశం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఒక ‘ఫ్లోటింగ్ రీసెర్చ్ స్టేషన్’ లాంటి భారీ పరిశోధన నౌకను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు రూ.840 కోట్ల అంచనా వ్యయంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్‌ఎస్‌ఈ) ఈ వెసల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్‌సీపీవోఆర్) అవసరాల కోసం కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ పరిశోధన నౌక ‘సాగర్ మంథన్’ రెండు రోజుల క్రితం జలప్రవేశం చేసి సాగర మథనానికి సిద్ధమైంది.
కదిలే ప్రయోగశాల
సాగర్ మంథన్.. కేవలం సముద్రంపై ప్రయాణించే నౌక మాత్రమే కాదు.. శాస్త్రీయ హంగులు ఉన్న కదిలే ప్రయోగశాల. సముద్రంలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు, ఆన్–బోర్డ్ డేటా ప్రాసెసింగ్ చేయడానికి వీలుగా శాస్త్రవేత్తలకు ఇందులో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించారు. యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు పరిశోధనలపై శిక్షణ ఇచ్చేందుకు కూడా ఈ ఫ్లోటింగ్ రీసెర్చ్ వెసల్ ప్రధాన వేదిక కానుంది.
6 కిలోమీటర్ల లోతు వరకు సర్వేలు
సముద్ర గర్భంలో ఏకంగా 6 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లి కచ్చితమైన సర్వేలు చేయగల సామర్థ్యం సాగర్ మంథన్ సొంతం. అండర్‌వే స్వాత్ మలీ్టబీమ్, జియోఫిజికల్ సిస్మిక్ సర్వేల ద్వారా భూమి కింది పొరల్లోని వనరులను, భౌగోళిక పరిస్థితులను సులువుగా గుర్తిస్తుంది. సముద్రపు నీటి వాహకత, ఉష్ణోగ్రత, లోతు వంటి కీలక అంశాలను కచ్చితంగా అంచనా వేస్తుంది. అత్యాధునిక వలలను ఉపయోగించి వివిధ లోతుల్లోని నీటి నమూనాలను, జీవ నమూనాలను ఏకకాలంలో సేకరించడంలో ఈ నౌక సామర్థ్యం అది్వతీయమనే చెప్పవచ్చు.
వాతావరణం గుట్టు విప్పేలా..
కోరర్స్, గ్రాబ్స్, చైన్ బ్యాగ్ డ్రెడ్జ్‌ల ద్వారా సముద్ర గర్భం నుంచి మట్టి, రాళ్ల నమూనాలను సాగర్ మంథన్ నౌక సేకరిస్తుంది. ఉపరితల వాతావరణ పరిస్థితులు, సముద్ర ప్రవాహాల వేగాన్ని కొలవడం, ఎగువ వాతావరణ డేటాను నిక్షిప్తం చేయడం వంటి కీలక పనులను ఈ ఫ్లోటింగ్ స్టేషన్ షిప్ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. తీరప్రాంతాలతో పాటు డీప్‌సీ మూరింగ్, డేటా బుయ్ ఆపరేషన్స్ చేపట్టడంలో దేశంలో ఇది అత్యంత కీలకంగా మారనుంది.
అనేక రికార్డులు సొంతం
దీనిని రికార్డు వేగంతో నిర్మించారు. నౌక కీల్ వేసిన కేవలం 5 నెలల వ్యవధిలోనే ఇంత భారీ ప్రాజెక్టును జల ప్రవేశం చేయించడం ఓ రికార్డు. 89.50 మీటర్ల పొడవు, 18.80 మీటర్ల వెడల్పు, 5,900 టన్నుల బరువైన ఈ నౌక.. గరిష్టంగా గంటకు 14 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. దేశీయంగా నౌకానిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు, పెరుగుతున్న మన ఇంజినీరింగ్ సామర్థ్యానికి ‘సాగర్ మంథన్’ నిలువెత్తు నిదర్శనం. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో 75 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ వెసల్.. సముద్ర పరిశోధన రంగంలో స్వయం సమృద్ధిని చాటుతోంది.


