పర్యాటకం.. అటకెక్కిపాయె! | APTDC not focusing on Alluri district | Sakshi
Sakshi News home page

పర్యాటకం.. అటకెక్కిపాయె!

Sep 11 2026 3:47 AM | Updated on Sep 11 2026 3:47 AM

APTDC not focusing on Alluri district

కాగితాలకే పరిమితమైన అభివృద్ధి 

అల్లూరి జిల్లాపై దృష్టిసారించని ఏపీటీడీసీ 

ఇంకా డీపీఆర్‌ దశలోనే రూ.375 కోట్ల పెట్టుబడులు 

2025లో 72.10 లక్షల మంది పర్యాటకుల రాక 

ఈ ఏడాది జూలై నాటికి  2.79 లక్షల మంది సందర్శన

సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకం పడకేసింది. విశాఖ నగరంలో పలు ప్రాజెక్టులు పునాది రాళ్లకే పరిమితం కాగా.. గిరిజన సంస్కృతికి కేరాఫ్‌గా నిలిచిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖలో ఇటీవల నిర్వహించిన సదస్సులో పర్యాటక రంగం అభివృద్ధిపై పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. 

గత రెండేళ్లలో ఒకటీ అర ప్రాజెక్టులు మినహా పెద్దగా పర్యాటక రంగం అభివృద్ధి చెందిన దాఖలాలు కనిపించడం లేదని అధికారులు సైతం పెదవి విరిచారు. ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమవుతూ.. ప్రాజెక్టుల అభివృద్ధిపై పెద్దగా దృష్టిసారించకపోవడం, స్థానిక పర్యాటక అధికారులు సైతం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా అంటీముట్టనట్లు వ్యవహరించడం పర్యాటక రంగం పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. పుష్కలమైన అవకాశాలున్న అల్లూరి జిల్లాను పూర్తిగా విస్మరించడంతో.. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 

పర్యాటకుల సందడి ఏదీ 
ఉమ్మడి విశాఖ జిల్లాకు పర్యాటకుల రాక ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే అల్లూరి జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో 72,10,942 మంది పర్యాటకులు జిల్లాను సందర్శించగా.. ఈ ఏడాది జూలై నాటికి కేవలం 2,79,553 మంది మాత్రమే వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా సందర్శనీయ స్థలాలను అభివృద్ధి చేయకపోవడంతో క్రమంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. అందుబాటులో ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి, కొత్త ఆకర్షణలను అందుబాటులోకి తీసుకురావడంలో పర్యాటక శాఖ విఫలమవుతోంది. 

కాగితాల్లోనే పెట్టుబడులు 
ఏపీటీడీసీ విశాఖ రీజియన్‌ పర్యవేక్షణలో అల్లూరి జిల్లాలో రూ.375 కోట్ల పెట్టుబడులు, 925 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన మూడు పర్యాటక ప్రాజెక్టులు ఇంకా డీపీఆర్‌ తయారీ దశలోనే మగ్గుతున్నాయి. రూ.15 కోట్లతో వైజాగ్‌ రిక్రియేషన్‌ ప్రై. లిమిటెడ్, రూ.350 కోట్లతో సన్‌విక్‌ గోల్ఫ్‌ హెవెన్‌ ప్రై. లిమిటెడ్, రూ.10 కోట్లతో ఉర్మికా లీజర్‌ సర్వీసెస్‌ చేపట్టాల్సిన ప్రాజెక్టులు డీపీఆర్‌ తయారీ దశను దాటలేదు. కనీసం ఈ ప్రాజెక్టులనైనా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

ఇవి నిజంగా పెట్టుబడులేనా? లేక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఉత్తుత్తి ఒప్పందాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరకు మండలం కొత్తవలసలో రూ.18 కోట్లతో చేపట్టాల్సిన టెంట్‌ సిటీ పనులు ఇంకా టెండర్‌ దశలోనే ఉన్నాయి. లంబసింగిలో రూ.6.13 కోట్లతో చేపట్టిన టెంట్‌ సిటీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నాయి. అంజోడ, అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి ప్రాంతాల్లో కారవాన్‌ టూరిజం ప్రాజెక్టులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. అడ్వెంచర్‌ టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లు సైతం ఇంకా సర్క్యులేషన్‌లోనే ఉండిపోవడం గమనార్హం. 

భూములున్నా.. అభివృద్ధి శూన్యం 
అల్లూరి జిల్లాలో పర్యాటక శాఖకు మొత్తం 180.39 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఏకంగా 92.86 ఎకరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రభుత్వం పర్యాటక శాఖను పూర్తిగా గాలికొదిలేయడంతో.. స్థానిక అధికారులు సైతం ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యాటక శాఖ కార్యాలయంలో కనీసం రెగ్యులర్‌ అధికారులు, తగినంత సిబ్బంది, కార్యాలయ వాహనాలు కూడా లేని దుస్థితి నెలకొంది. పర్యాటక కేంద్రాల్లో కనీసం చెత్తకుండీలు, సైనేజ్‌ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేని దయనీయ పరిస్థితి తమ శాఖలో ఉందని కొందరు పర్యాటక శాఖ సిబ్బంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement