సాధిక్‌ రైఫిల్‌ షూటింగ్‌ అకాడెమీ సీజ్‌ | Sadhik Rifle Shooting Academy Siege | Sakshi
Sakshi News home page

సాధిక్‌ రైఫిల్‌ షూటింగ్‌ అకాడెమీ సీజ్‌

Sep 11 2026 3:32 AM | Updated on Sep 11 2026 3:32 AM

Sadhik Rifle Shooting Academy Siege

సాధిక్‌ ఖాన్‌ను రైఫిల్‌ షూటింగ్‌ అకాడెమీకి తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తున్న సర్పవరం పోలీసులు

మూడో రోజు విచారణలో అకాడెమీలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ 

30 రైఫిల్స్, ల్యాప్‌టాప్‌లు, కీలక సమాచారం లభ్యం 

నేటితో ముగియనున్న పోలీసు కస్టడీ  

కాకినాడ రూరల్‌: పంచాయతీ రాజ్‌ ఏఈ టి.నూకరాజు కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య, ఆయన అల్లుడి హత్య కేసులో కీలక నిందితుడు షేక్‌ సాధిక్‌ ఖాన్‌ నుంచి పోలీసులు మూడో రోజు కీలక ఆధారాలు సేకరించారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా సర్పవరం సీఐ సీహెచ్‌ ప్రకాష్, పోలీసు బృందం గురువారం ఉదయం సాధిక్‌ను కాకినాడలోని గుడారిగుంట సమీపంలోని సాధిక్‌కు చెందిన ప్రో రైఫిల్‌ షూటింగ్‌ అకాడెమీకి తీసుకువెళ్ళారు. రెండో అంతస్తులో ఉన్న అకాడెమీలో శిక్షణ కోసం వినియోగించే 30 రైఫిల్స్‌ను, కీలకమైన ఆధారాలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ప్రత్యేకంగా రూమ్‌ తదితర వాటిని గుర్తించారు. 

అకాడెమీని సీజ్‌ చేసి, అక్కడి రైఫిల్స్, కీలక ఆధారాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి సాధిక్‌ను విచారించారు. ముఖ్యంగా రైఫిల్స్‌ ఎక్కడ నుంచి వచ్చాయి, శిక్షణకు ఉన్న అర్హత, అకాడెమీకి అనుమతులు, ఎంత మందికి శిక్షణ ఇచ్చారు తదితర అంశాలపై ఆరా తీశారు. సౌజన్య కుమారుడితో అకాడెమీకి ఎప్పటి నుంచి వచ్చేది, ఆమెతో పరిచయం, వేధింపులు, ఆమె భర్త హత్య, తదితర కీలకమైన అంశాలపై ప్రశ్నలకు సమాధానం రాబట్టారు. సౌజన్య కుమారుడిని అకాడెమీకి కారులో సాయంత్రం తీసుకువెళ్లి 2 గంటల పాటు అక్కడే ఉండేదని, అక్కడ సాధిక్‌ రైఫిల్‌ షూటింగ్‌ కంటే ఆమెపైనే ఎక్కువ దృష్టి పెట్టేవాడని సమాచారం. 

ఆమెను తనకు అనుగుణంగా మార్చుకుని పథకం ప్రకారమే జగదీశ్వరరెడ్డిని హతమార్చినట్టు విచారణలో గుర్తించినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణలో భాగంగా జగదీశ్వరరెడ్డికి చెందిన ఖరీదైన కార్లను ఆధారాల కోసం పోలీసులు ఆధీనంలో ఉంచుకున్నట్టు తెలిసింది. సాధిక్‌ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అన్నీ సౌజన్యపై నెట్టివేసే ప్రయత్నం చేయడంతో సాంకేతిక ఆధారాలు, సూసైడ్‌ నోట్‌లను ఉదహరిస్తూ  200 ప్రశ్నలతో కొంత మేర సమాచారం రాబట్టారు. సాధిక్‌ పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం ఉదయం కాకినాడలోని కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేసే అవకాశం ఉందని సర్పవరం పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement