తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం | Travel bus set on fire in Tirupati district | Sakshi
Sakshi News home page

తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

Sep 11 2026 3:28 AM | Updated on Sep 11 2026 3:28 AM

Travel bus set on fire in Tirupati district

19 మంది ప్రయాణికులు సురక్షితం.. డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం 

ఓజిలి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి 19 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓజిలి వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన కామాక్షి ట్రావెల్స్‌ బస్సు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రేపల్లె నుంచి బెంగళూరుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, 19 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మొదటి డ్రైవర్‌ జేడీ ప్రేమ్‌ రాత్రి 10 గంటలకు ఒంగోలు వద్దకు వచ్చేసరికి బస్సును రెండవ డ్రైవర్‌ తిరుపతయ్యకు అప్పగించారు. 

అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో ఓజిలి పెద్దచెరువు సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్‌ నుంచి కాలిన వాసన, పొగ రావడాన్ని డ్రైవర్‌ తిరుపతయ్య గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బస్సుకు ఉన్న అన్ని తలుపులు తెరిచి ప్రయాణికులను దించి దూరంగా పంపివేశారు. కొద్దిసేపటికి బస్సు డీజిల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సమయంలో బస్సు రేకు ఒకటి ఎగిరి రోడ్డు డివైడర్‌పై ఉన్న చెట్లపై పడింది. డివైడర్‌పై ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. కేవలం 15 నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. 

అనంతరం వేరే బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్‌ తిరుపతయ్య అప్రమత్తం కావడంతోనే 19మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement