సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్ అలాంటి ఉద్యోగాన్ని వద్దనుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. తీరా ఆ నిర్ణయం భవిష్యత్తులో బాధను కలిగించకుండా ఉంటుందా అనే సందేహాం సదా వెంటాడుతుంటుంది. అయినా సరే ఇంతటి భయానక నిర్ణయం తీసుకుంది ఈ మహిళ. అది కూడా దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నిగ్ధా బోస్ సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్నుకుంది. ఎస్‌బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా మంచి జీతం ఆర్జించే ఉద్యోగాన్ని వదులకుందామె. అసలు ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పుబట్టారు, వెర్రి నిర్ణయంగా అభివర్ణించారు. అయితే ఆ ఉద్యోగంలో తను పనిచేస్తున్నట్లుగా అనిపించలేదని, నిరంతరం ఒత్తిడి, మానసిక అలసట, సొంత శరీరంలో అనుసంధానం కావడానికి సమయమే లేనట్లుగా అనిపించిందని చెబుతుంది.
ఏదో ఉక్కిరిబిక్కిరిగా అనిపించి ఆ ఉద్యోగం వదిలేసినట్లు పేర్కొంది స్నిగ్ధా. ఆ తర్వాత మీరట్‌లో యోగాకి సంబంధిచిన 'తులా వెల్నెస్ స్టూడియోని నడుపుతున్నట్లు తెలిపింది. తనకు ఆర్థిక భద్రత కంటే వ్యక్తిగత శ్రేయస్సే ముఖ్యమనిపించిందని అంటోంది. ఇలా తనలా ఉద్యోగం మానేసేంత సౌలభ్యం అందరికీ ఉండకపోవచ్చు. అలాగే తనలా చేయాల్సిన పనిలేదు కూడా. ఒత్తిడితో ఉద్యోగం చేస్తూ కూడా ఆరోగ్యాన్ని చూసుకోచ్చు.
ఒక పక్క ఉద్యోగం, అలాగే శారీరక బలం పెంపొందిచుకునేలా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయొచ్చని అంటోంది. చెప్పాలంటే జీవితాన్ని మార్చకుండానే ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయొచ్చని, కానీ తనకు ఆ అవకాశం ఉంది కాబట్టి మానసిక ఆరోగ్యమే ప్రధానంగా భావించి, ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా అని సోషల్ మీడియా వేదికగా తన స్టోరీని పంచుకుంది స్నిగ్ధా.
అంతేగాదు నెటిజన్లు కూడా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న స్నిగ్ధ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ..తమ అనుభవాల్ని పంచుకున్నారు. మరొక యూజర్ తాను కూడా ఎస్‌బీఐలో ఉద్యోగం మానేసి తనకు నచ్చి గోల్ప్ క్రీడపై ఫోకస్ పెట్టి అంతర్జాతీయ క్రీడాకారిణిగా దూసుకుపోతున్నా అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!)


