విడాకులు ఇవ్వకుంటే రెండో భార్యకు నో పింఛన్‌ | Family pension Incident In Madras High Court | Sakshi
Sakshi News home page

విడాకులు ఇవ్వకుంటే రెండో భార్యకు నో పింఛన్‌

Sep 10 2026 12:13 PM | Updated on Sep 10 2026 12:26 PM

Family pension Incident In Madras High Court

ఏఐ జనరేటర్ ఫోటో

ప్రభుత్వ ఉద్యోగి తన మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకుంటే, అతని మరణానంతరం ఆ రెండో భార్యకు ఫ్యామిలీ పెన్షన్‌ (కుటుంబ పింఛను) పొందే హక్కు లేదని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ ఉద్యోగి ఆర్‌. సమన్‌ మరణించిన తర్వాత, ఆయన రెండో భార్య తమిళరసి ఫ్యామిలీ పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే మొదటి భార్య నళినికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వనందున ప్రభుత్వం ఈ అభ్యర్థనను తిరస్కరించింది.అయితే, కోర్టుకు వెళ్లిన సందర్భంలో సింగిల్‌ జడ్జి బెంచ్‌ తమిళరసికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా, తమిళనాడు ప్రభుత్వం దీనిపై అప్పీల్‌ చేసింది. 

హైకోర్టు తీర్పు: 
ప్రభుత్వ అప్పీలు పిటిషన్‌పై  విచారణ జరిపిన జస్టిస్‌ ఎస్‌.ఎమ్‌. సుబ్రహ్మణ్యం, జస్టిస్‌ కృష్ణస్వామి గోవిందరాజన్‌ ధర్మాసనం దంపతులు విడిపోవడానికి చేసుకున్న ఒప్పందం చట్టబద్ధమైన విడాకులు కాదని స్పష్టం చేసింది. అందువలన  సమన్‌ – తమిళరసిల వివాహం చెల్లదని, ఆమెకు ఫ్యామిలీ పెన్షన్‌ పొందే అర్హత లేదని పేర్కొంటూ సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను రద్దు చేసింది. పైగా రిటైర్డ్‌ హెడ్ మాస్టర్ అయిన తమిళరసి ఇప్పటికే స్వయంగా సొంత పెన్షన్‌ పొందుతున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. 

177 ఫిర్యాదులు 
కాగా, మరో కేసులో ప్రైవేట్‌ పాఠశాలలకు శాశ్వత గుర్తింపు  అనుమతులు ఇప్పిస్తామని నమ్మించి రూ. 100 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన కేసులో ఇప్పటివరకు 177 ఫిర్యాదులు వచ్చాయని మద్రాస్‌ సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ) పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తమిళనాడు తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు అరసకుమార్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేసి గుండా చట్టం కింద జైలుకు పంపారు. 

ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ వి. లక్ష్మీ నారాయణన్‌ ముందుకు ఈ పిటిషన్‌ రాగా, విచారణ ఇంకా కొనసాగుతోందని, కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని పోలీసులు కోరారు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి విచారణనుగురువారానికి  వాయిదా వేశారు. 

చదవండి: ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్‌ దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement