కశ్మీర్‌లో 1990లలో జేకేఎల్‌ఎఫ్ సాగించిన ఉగ్రవాద హింసకు బలైన కుటుంబాలు.. ఆ సంస్థ అధినేత యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నర్సు సరళా భట్ హత్య కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాలిక్.. అదే సమయంలో తన భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.
జేకేఎల్‌ఎఫ్(JKLF) ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా భార్య నిర్మల్ ఖన్నా.. యాసిన్ మాలిక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1990 జనవరి 25న శ్రీనగర్‌లోని ఓ బస్‌స్టాప్ వద్ద రవి ఖన్నాతో పాటు మరో ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ప్రకారం ఈ దాడికి యాసిన్ మాలిక్ నాయకత్వం వహించి కాల్పులు జరిపిన ప్రధాన షూటర్‌గా అతడిని గుర్తించారు.
“నా ఆయుధాలు లేని భర్తను చంపాడు. ఆయన శరీరంలోకి 28 తూటాలు దూసుకెళ్లాయి. ఇప్పుడు తానే గొప్ప వ్యక్తినన్నట్లు మాట్లాడుతున్నాడు. అతడికి ఎలాంటి సానుభూతి అవసరం లేదు. మాలిక్‌కు మరణశిక్ష తప్ప మరో శిక్ష వద్దు. అతడిని ఉరితీసే రోజు కోసం ఎదురుచూస్తున్నా” అని నిర్మల్ ఖన్నా అన్నారు.
మా సంగతేంటి?..
తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు మాలిక్ చెప్పడంపై నిర్మల్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. “నీ భార్య వితంతువు కాకూడదని అంటున్నావు. మరి నీ వల్ల భర్తలను కోల్పోయిన ఎన్నో మహిళల సంగతేంటి? వారి కుటుంబాల బాధ నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా?” అని ప్రశ్నించారు.
మాలిక్ చేతులకు రక్తం అంటుకుందని, అతడు చేసిన హింసకు మూల్యం చెల్లించాల్సిందేనని ఆమె అన్నారు. 36 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతూ.. ఇంతకాలం గడిచినా బాధిత కుటుంబాలకు న్యాయం ఎందుకు జరగడం లేదని ప్రభుత్వం, న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. మాలిక్ తాజా అఫిడవిట్ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆరోపించారు.
‘నా తల్లి కూడా వితంతువైంది’
మరో ఉగ్ర బాధితురాలు డాక్టర్ సుష్మా షల్లా కూడా మాలిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె తండ్రి ఇన్‌స్పెక్టర్ చునీలాల్ షల్లాను 1990 మే 1న ఉత్తర కశ్మీర్‌లో జేకేఎల్‌ఎఫ్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు.
“నేను ప్రత్యక్షంగా ఉగ్రవాద బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తిని. యాసిన్ మాలిక్ తన పాపాలకు చివరకు మూల్యం చెల్లించాల్సి వస్తుండటం సంతోషంగా ఉంది. నా తండ్రిని జేకేఎల్‌ఎఫ్ చంపింది. నా తల్లి ఆయన మరణంతో వితంతువుగా జీవించాల్సి వచ్చింది. ఆ బాధను నువ్వెప్పుడైనా అనుభవించావా? ఇప్పుడు మాత్రం ఏడుస్తున్నావు” అని సుష్మా షల్లా మండిపడ్డారు.

సరళా భట్ హత్య కేసులో..
1990లో శ్రీనగర్‌లో నర్సు సరళా భట్ హత్యకు సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్ విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ అతడు తాజాగా అఫిడవిట్ దాఖలు చేశాడు. ఇకపై విచారణలో తన తరఫున ఎలాంటి వాదనలు వినిపించబోనని కూడా స్పష్టం చేశాడు. అదే అఫిడవిట్‌లో పాకిస్థానీ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ రెండు నిర్ణయాల వెనుక సానుభూతి పొందే ప్రయత్నం ఉందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
36 ఏళ్లుగా ఎదురుచూపులు
1990లలో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో భర్తలను, తండ్రులను కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ ఆ విషాదం నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నాయి. యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్ నేపథ్యంలో ఆ పాత గాయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తన భార్య వితంతువు కాకూడదనే కారణాన్ని మాలిక్ ప్రస్తావించడమే ఇప్పుడు బాధిత కుటుంబాల ఆగ్రహానికి కారణమైంది.
ఇదీ చదవండి: ఆ పెళ్లి కూతురి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్


