ప్రపంచ రాజకీయాల్లో ఈ జంట కనిపిస్తే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇద్దరి సరదా సంభాషణలు, ఆప్యాయ పలకరింపులు ఇప్పటికే ‘మెలోడీ’ పేరుతో వైరల్‌గా మారాయి. తాజాగా మెలోనీకి మోదీ చేసిన ఓ ప్రత్యేక విషెస్ ఈ స్నేహాన్ని మరోసారి చర్చలోకి తెచ్చింది.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా ఆమె తాజాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. మెలోనీని తన స్నేహితురాలిగా పేర్కొంటూ.. ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని అన్నారు.
“నా స్నేహితురాలు ప్రధాని మెలోనీకి అభినందనలు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానిగా ఆమె నిలిచారు” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్ట్ చేశారు. మెలోనీ నాయకత్వంలో భారత్–ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మెలోనీతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Mi congratulo con la mia amica, il Primo Ministro Meloni, per essere diventata il Primo Ministro con il mandato più lungo nella storia del dopoguerra italiano. Questo traguardo riflette la fiducia che il popolo italiano ripone nella sua leadership.
La sua amicizia è stata…— Narendra Modi (@narendramodi) September 4, 2026
అలా ప్రధానిగా..
1977లో రోమ్‌లో జన్మించిన జార్జియా మెలోనీ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో యువజన రాజకీయ ఉద్యమంలో చేరిన ఆమె.. ఆ తర్వాత ఇటలీ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2008లో అప్పటి ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2012లో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించి, 2014లో దాని అధ్యక్షురాలయ్యారు. 2022 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో.. అదే ఏడాది అక్టోబర్ 22న ఇటలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా మెలోనీ రికార్డు సృష్టించారు. తాజా రికార్డుపై ఇటు తన సోషల్ మీడియాలో మెలోనీ సైతం ఓ పోస్ట్ చేశారు.
Oggi il nostro Governo diventa il più longevo della storia della Repubblica italiana.
È un dato che accolgo con gratitudine e con un forte senso di responsabilità. Perché la stabilità non è un record da esibire, ma la condizione che consente a una Nazione di programmare,… pic.twitter.com/EpdHe35vJa— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026
మెలోనీ కంటే ముందు..
ఇటలీ రిపబ్లిక్ ఏర్పడిన 1946 తర్వాత ఎంతోమంది ప్రధానులు మారారు. మెలోనీకి ముందు సుదీర్ఘకాలం నిరంతరంగా ప్రధానిగా కొనసాగిన రికార్డు సిల్వియో బెర్లుస్కోనీ పేరిట ఉండేది. 2001లో ప్రారంభమైన ఆయన రెండో ప్రభుత్వం 1,412 రోజులు కొనసాగింది. 2022 అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోనీ తాజాగా ఆ రికార్డును అధిగమించారు.
‘మెలోడీ’గా ఫేమస్..
మోదీ, మెలోనీ మధ్య స్నేహం అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి సమావేశాలు, సంభాషణలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ‘మెలోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెలోనీ కూడా గతంలో మోదీతో తన స్నేహాన్ని సానుకూలంగా ప్రస్తావించారు. ఆఖరికి ఈ బంధం మెలోడీ చాక్లెట్లు పంచుకునే సరదా స్థాయి దాకా వెళ్లింది. అయితే ఈ బంధం గురించి ఇటు ఇండియాలో రాజకీయ దుమారం రేపిన సందర్భమూ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే..
ఇక్కడ మోదీ రికార్డే
ఇటలీలో మెలోనీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ రికార్డు నెలకొల్పిన వేళ.. భారత్‌లోనూ ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019, 2024లో వరుసగా ఎన్నికై మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతల జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. భారత్‌లో నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికై ప్రధానిగా కొనసాగుతున్న నేతగా మోదీ నిలిచారు. ఇటలీలో మెలోనీ, భారత్‌లో మోదీ.. ఇద్దరూ తమ తమ దేశాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంతో ప్రత్యేక ముద్ర వేశారు.
మరింత బలపడనున్న బంధం
ఇటలీతో భారత్ సంబంధాలు మోదీ ప్రధాని అయ్యాకే క్రమక్రమంగా బలపడుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం కీలకంగా ఉందని మోదీనే చాలాసార్లు పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఈ సంబంధాలు మరింత విస్తరించనున్నాయని మోదీ సంకేతమిచ్చారు.
ఇదీ చదవండి: మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?


