స్పెయిన్‌ సర్వనాశనం కావడం ఖాయం: ట్రంప్‌ | Ceuta Migrant Crisis: Trump Warns Spain of Ruin | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ సర్వనాశనం కావడం ఖాయం: ట్రంప్‌

Sep 4 2026 11:44 AM | Updated on Sep 4 2026 11:47 AM

Ceuta Migrant Crisis: Trump Warns Spain of Ruin

స్పెయిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా-యూరప్‌ సరిహద్దు సియూటాలో కొనసాగుతున్న వలస సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ.. పరిస్థితిని సరిగా ఎదుర్కోలేకపోతే ఆ దేశం ‘నాశనమవుతుందని’ హెచ్చరించారు. ఇది సైనిక దాడి కంటే కూడా తీవ్రమైన సమస్యగా ఆయన వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో వలసదారులు ఒక్కసారిగా దేశంలోకి చొచ్చుకురావడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ట్రంప్‌ అన్నారు.

జీబీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. సియుటా(Ceuta)లోకి ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకో నుంచి భారీగా వలసదారులు ప్రవేశించడాన్ని ‘దండయాత్ర’గా అభివర్ణించారు. వేలాది మంది ఒక్కసారిగా దేశంలోకి చొచ్చుకురావడం సాధారణ విషయం కాదని, తాను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. బ్రిటన్‌ కూడా వలసల సమస్యను ఎదుర్కొంటోందని.. అయితే సియూటాలో ఉన్నంత స్పష్టంగా అక్కడ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇంతకు ముందు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. వలసల్ని నియంత్రించకపోతే అమెరికాకు కూడా ఇదే గతి పడుతుందని అన్నారాయన.

జూలై 30, 31 తేదీల్లో మొరాకో నుంచి సియూటాలోకి ఉప్పెనలా వలసలు వెల్లువెత్తాయి. దాదాపు 60 వేల మంది సముద్ర మార్గంలో ఈ స్పెయిన్‌ భూభాగంలోకి ప్రవేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కొందరు నీట మునిగి మరణించారు కూడా. దీంతో సరిహద్దు భద్రతా సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. స్పెయిన్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 50 వేల మందికి పైనే తిరిగి మొరాకోకు చేరుకున్నారు. వీళ్లలో చాలామందిని సైన్యం వెనక్కి పంపించింది. అదే సమయంలో సియూటాలో సాయం అందక.. నిరుత్సాహంతో చాలా మంది వాళ్లంతట వాళ్లే వెనక్కి వెళ్లిపోయారు. మరో 5 వేల మంది ఇంకా సియూటాలో ఉన్నారు. వీరిలో వెయ్యి మందికిపైగా మైనర్లు ఉన్నారు. అయితే స్థానిక ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్యను 9 వేలుగా పేర్కొంటోంది.

వలసదారులు సరిహద్దు దాటేందుకు మొరాకో అధికారులు అనుమతించారన్న ఆరోపణలు వచ్చినప్పటికీ.. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ మొరాకో పాత్రను తోసిపుచ్చారు. అయితే సియూటా సంక్షోభంపై దేశంలో సాంచెజ్‌పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టి ఆయన రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది స్పెయిన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు సాంచెజ్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.

ఇదిలా ఉండగా.. వలస సంక్షోభం ప్రభావం స్పెయిన్‌ అంతర్జాతీయ సంబంధాలపైనా పడుతోంది. ఇటలీతోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాలు షెంగెన్‌ ప్రాంతంలో భాగస్వాములు అయినప్పటికీ.. పరస్పరం తమ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తనిఖీలు విధించుకున్నాయి.

మరోవైపు అమెరికా–స్పెయిన్‌ సంబంధాల్లోనూ గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై దాడులకు అమెరికా తన స్థావరాలను ఉపయోగించుకునేందుకు స్పెయిన్‌ అనుమతించలేదు. అలాగే నాటో రక్షణ వ్యయాన్ని 2035 నాటికి జీడీపీలో 5 శాతానికి పెంచాలన్న ట్రంప్‌ లక్ష్యాన్ని స్పెయిన్‌ వ్యతిరేకించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2 శాతం లక్ష్యమే సరిపోతుందని సాంచెజ్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే స్పెయిన్‌ నాటో విషయంలో సరిగా వ్యవహరించడం లేదంటూ ట్రంప్‌ మరోసారి విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: ఒక్కసారి ఇరాన్‌ వచ్చిపో.. శామ్‌ అంకుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement