యూరప్ దేశం ఎస్టోనియాలో భారీ ఆయుధ ఒప్పందం రాజకీయ ప్రకంపనలు రేపింది. ఉక్రెయిన్‌కు అత్యవసరంగా ఆయుధాలు అందించాలన్న తొందరలో ప్రభుత్వం చేసుకున్న ఓ ఖరీదైన డీల్ చివరికి వివాదాస్పదంగా మారింది. దీంతో ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్‌కుర్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయితే ఈ వ్యవహారంలో భారత యాజమాన్యంలోని కంపెనీ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
ఎస్టోనియా 2022 నుంచే ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున సైనిక సాయం చేస్తోంది. అందులో ఆయుధాలు, ఆర్టిలరీ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. 2024లో రష్యాతో భీకర యుద్ధం ప్రారంభం కాగానే ఉక్రెయిన్‌కు అత్యవసరంగా మందుగుండు సామగ్రి అందించేందుకు ఇటలీకి చెందిన డాటాసెల్ అనే కంపెనీతో ఎస్టోనియా ఒప్పందం చేసుకుంది. అయితే అదే ఏడాది భారత్‌కు చెందిన నెకో డిఫెన్స్ మ్యూనిషన్స్(Neco Defence Munitions) సదరు కంపెనీని టేక్ ఓవర్ చేసింది. అయితే ఆ తర్వాతే తేలింది ఏంటంటే.. ఆర్టిలరీ షెల్స్ విక్రయించిన అనుభవం డాటాసెల్ కంపెనీకి ఏమాత్రం లేదని!. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమైంది.
ఎస్టోనియా ప్రభుత్వం ఈ డీల్ కోసం భారీగా ఖర్చు చేసింది. మొదటి ఒప్పందంలో భాగంగా సుమారు 15 మిలియన్ యూరోలు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఆ తర్వాత మరో 10 మిలియన్ యూరోలకు పైగా చెల్లింపులు జరిగాయి. అలా.. పలు ఒప్పందాలతో కలిపి ముందస్తు చెల్లింపులే సుమారు దాదాపు 70 మిలియన్ యూరోల (రూ.769 కోట్లకుపైగా) చేరాయి. ఈ నిధులన్నీ యూరోపియన్ యూనియన్ పీస్ ఫెసిలిటీ ద్వారా సమకూరినట్లు తెలుస్తోంది.
అయితే.. నిర్ణయించిన సమయంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు చేరలేదు. ఉత్పత్తి సమస్యల కారణంగానే సరఫరా ఆలస్యమైందని ఎస్టోనియా వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో 2025లో కొంత సామగ్రి అందినప్పటికీ.. అది నాసిరకంగా ఉందని ఎస్టోనియా ఆరోపించింది. దీంతో గతేడాది ఒప్పందాలను రద్దు చేసి, ముందుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కంపెనీని కోరింది.
అయితే డాటాసెల్ ఈ ఆరోపణలను ఖండించింది. ఇప్పటికే తాము సుమారు 59 మిలియన్ యూరోల విలువైన మందుగుండు సామగ్రిని అందించామని, సుమారు 58 మిలియన్ యూరోల ఇన్వాయిస్‌లు సమర్పించామని చెబుతోంది. నాణ్యతా లోపాల ఆరోపణలను కూడా సంస్థ తోసిపుచ్చింది. అలా పరస్పర ఆరోపణలతో ఈ వివాదం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు చేరింది.
రూ.769 కోట్లు ఎటు పోయాయి?
ఆయుధ ఢీల్‌లో భాగంగా సదరు కంపెనీకి ఎస్టోనియా చెల్లించిన భారీ ముందస్తు మొత్తం వెనక్కి వస్తుందా?. దీనిపైనే ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. ఒకవేళ ఆ మొత్తాన్ని రాబట్టలేకపోతే.. తన సొంత బడ్జెట్ నుంచి ఎస్టోనియా భరించాల్సి వస్తుందని ఆ దేశ నేషనల్ ఆడిట్ ఆఫీస్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ వ్యవహారంతోపాటు ఎస్టోనియా రక్షణ శాఖలో నిధుల వినియోగం, సైనిక కొనుగోళ్లపై నేషనల్ ఆడిట్ ఆఫీస్ పలు ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో రాజకీయ బాధ్యత తీసుకుంటూ పెవ్‌కుర్ పదవి నుంచి తప్పుకున్నారు.

వ్యక్తిగతంగా తాను ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించలేదని ఆయన చెప్పినప్పటికీ.. రక్షణ రంగానికి మంత్రిగా రాజకీయ బాధ్యత తనదేనని ప్రకటించారు. ఎస్టోనియా ప్రధాని క్రిస్టెన్ మిచల్ కూడా పెవ్‌కుర్ వ్యక్తిగతంగా తప్పు చేశారని తాను భావించడం లేదని గతంలో పేర్కొన్నారు.
భారత కంపెనీదే బాధ్యతా?
ఈ వ్యవహారంలో భారత కోణం నెకో డిఫెన్స్ మ్యూనిషన్స్ ద్వారా వచ్చింది. డాటాసెల్ ఇటలీలో నమోదైన సంస్థ అయినప్పటికీ.. దాన్ని 2024లో భారత కంపెనీ కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం బయటపడిన అంశాలు ఒప్పంద వివాదానికి సంబంధించినవే తప్ప.. భారత కంపెనీ మోసానికి పాల్పడిందని నిర్ధారించే ఆధారం కాదట. కాబట్టి.. ఎస్టోనియా వాదనలను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తోంది. ఈ వివాదంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కొనసాగుతోంది. డాటాసెల్ తరఫున ఎస్టోనియాపై కౌంటర్‌క్లెయిమ్ దాఖలైంది. తదుపరి విచారణ వచ్చే నెలలో జరగనుందని నెకో డిఫెన్స్ మ్యూనిషన్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైస్వాల్ తెలిపారు.
ఉక్రెయిన్‌కు అత్యవసరంగా ఆయుధాలు అందించాలన్న తొందరలో.. సరఫరాదారు సామర్థ్యాలు, గత అనుభవం వంటి అంశాలను తగినంతగా పరిశీలించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. యుద్ధ సమయంలో వేగంగా ఆయుధాలు సమకూర్చడం ఒకవైపు.. ప్రజాధనాన్ని కాపాడేందుకు కఠినమైన తనిఖీలు చేయడం మరోవైపు ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది.
ఇదీ చదవండి: హబీబీ.. కమ్ టూ ఇరాన్


