చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్‌! | Nepal Wakes Up But Only After Disaster Strikes | Sakshi
Sakshi News home page

చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్‌!

Sep 3 2026 11:40 AM | Updated on Sep 3 2026 12:02 PM

Nepal Wakes Up But Only After Disaster Strikes

హిమాలయాల కొండల్లో.. సునామీ విరుచుకుపడిన వరద నేపాల్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మంచు, మట్టి, రాళ్లతో ఉప్పొంగిన వరద ప్రవాహం గ్రామాలను, రహదారులను, వంతెనలను మింగేసింది. వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారం గడిచినా కూడా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతటి విపత్తు తర్వాత ఇప్పుడు నేపాల్‌ కళ్లు తెరిచింది. మరోసారి ఇలాంటి ముప్పు ఎదురైతే కనీసం కొన్ని నిమిషాల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయాలని చర్యలు మొదలుపెట్టింది.

ఆగష్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలపై చైనా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది నేపాల్‌ ప్రధాన ఆరోపణ. అయితే తాము సకాలంలోనే స్పందించామని చైనా ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ తరుణంలో రసువా జిల్లాలో ఎక్కడైతే వరద ముంచెత్తిందో.. అక్కడే కొత్తగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్‌ నిర్ణయించింది. చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, నదుల ఉద్ధృతి వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సీస్మిక్‌ సెన్సర్లు, కెమెరాలు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు ఉపగ్రహ ఆధారిత వీఎస్‌ఏటీ (VSAT) కమ్యూనికేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.

పాత వ్యవస్థ ఏమైంది?
ఇక్కడే అసలు వైఫల్యం బయటపడుతోంది. గతంలోనూ ఆ ప్రాంతంలో వరదలు, నదీ ప్రవాహాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది. అయితే ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలో పలు పర్యవేక్షణ కేంద్రాలు, గేజ్‌లు కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని కనీసం నాలుగు గేజింగ్‌ స్టేషన్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో సమాచారం అందించడంలో వ్యవస్థ విఫలమైంది.

మొబైల్‌ నెట్‌వర్క్‌ పోయినా..
కొత్త వ్యవస్థలో వీఎస్‌ఏటీని కీలకంగా ఉపయోగించనున్నారు. భారీ విపత్తుల సమయంలో మొబైల్‌ నెట్‌వర్క్‌లు, ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పనిచేయకపోయినా.. ఉపగ్రహం ద్వారా పర్యవేక్షణ కేంద్రాలు అధికారులతో అనుసంధానంలో ఉండేలా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీ ప్రవాహం పెరుగుతున్నట్లు గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేసి, ప్రజలకు ఎస్‌ఎంఎస్‌ హెచ్చరికలు పంపేలా వ్యవస్థను రూపొందించనున్నారు.

ఇంకా 4 వేల మంది మిస్సింగ్‌
ఆగస్టు 26న నేపాల్‌-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదకు నేపాల్‌ తీవ్రంగా నష్టపోయింది. రెండు దేశాల్లో కలిపి కనీసం 1,114 మంది మరణించగా.. దాదాపు 4 వేల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధిక మరణాలు నేపాల్‌లోనే నమోదయ్యాయి.

41 నిమిషాల ఆలస్యం.. ప్రాణాల మీదకు
ఈ విపత్తులో హెచ్చరిక వ్యవస్థ వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఒక అంశం స్పష్టం చేస్తోంది. వరదకు దారితీసిన మంచు, రాళ్ల విరిగిపాటు ఉదయం సంభవించినప్పటికీ.. అధికారిక హెచ్చరిక ప్రజలకు చేరేసరికి దాదాపు 41 నిమిషాలు గడిచిపోయాయి. ఇలాంటి కొండ ప్రాంతాల్లో 10–15 నిమిషాల ముందస్తు సమాచారం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కీలకంగా మారుతుంది.

చైనాతో మరింత డేటా షేరింగ్‌
ఇకపై చైనాతోనూ విపత్తు సమాచారాన్ని మరింత వేగంగా పంచుకునే దిశగా నేపాల్‌ అడుగులు వేస్తోంది. హిమనదుల కదలికలు, నీటి మట్టాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడే ప్రమాదకర పరిస్థితులపై రియల్‌టైమ్‌ సమాచారాన్ని పొందేందుకు సహకారం పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా ఉపగ్రహ చిత్రాలు, నీటి మట్టం–ప్రవాహ సమాచారం, ఎగువ ప్రాంతాల్లో ఏర్పడిన ప్రమాదాలపై వివరాలను పంచుకున్నట్లు సమాచారం.

కొన్ని నిమిషాలైనా.. ప్రాణాలు కాపాడొచ్చు!
కొత్త వ్యవస్థ వల్ల భారీ విపత్తును పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రమాదాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి హెచ్చరికలు పంపగలిగితే.. ప్రజలను, సరిహద్దు సిబ్బందిని, సహాయక బృందాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి జరిగిన ఘోర వైఫల్యం తర్వాత నేపాల్‌ హడావుడిగా పాత వ్యవస్థ స్థానంలో కొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.

ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మాత్రం మరో విపత్తు వచ్చినప్పుడు హెచ్చరించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకే ‘చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్‌’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: నేపాల్‌ వరదలే కాదు.. భూకంపాలకూ కారణం ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement